Suryaa.co.in

Andhra Pradesh

శ్రీవారి భక్తుల్ని స్టూవర్టుపురం దొంగల్లా దోచుకున్నారు

– భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు జగన్మోహన్ రెడ్డిని ఆ వెంకటేశ్వర స్వామే ఓడించారు
– భక్తుడిగా నా మనోభావాలను దెబ్బతీసినందుకే జగన్మోహన్ రెడ్డి సగం దెబ్బయ్యాడు
– కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు ఓటమిపాలయ్యాడు
– గత ఐదేళ్లలో భగవంతుడికి భక్తుడిని దూరం చేయడం ఎలా అనే క్రిమినల్ ఆలోచనలతోనే బోర్డు నడిచిందన్నది పచ్చి నిజం
– అత్యంత పవిత్రమైన తిరుమల శ్రీ వారి లడ్డు తయారీ కోసం ఉపయోగించిన నెయ్యి పదార్థాలలో పంది కొవ్వు, చేప నూనె, ఎనిమల్ టాలో ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణ
– భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పక తప్పని పరిస్థితి
– లేకపోతే ఈరోజు సాక్షి దినపత్రిక లో రాసినట్లు గానే వైకాపా నేతలు మరింత తప్పుడు ప్రచారాన్ని చేసేవారు
– లడ్డు తయారీ కోసం వినియోగించే నెయ్యిని పరీక్షించడానికి టిటిడి కి సొంత లేబొరేటరీ లేకపోవడం విడ్డూరం
– భక్తులకు ఉచితంగా మంచినీటి సీసాలను అందజేయాలి
– తిరుమలలో అద్దె గదుల ధరలు తగ్గించాలి
– జెరూసలేం, మక్కాకు వెళితే రాయితీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, తిరుమలకు వచ్చిన భక్తులపై మాత్రం అడ్డగోలు టాక్స్ లు వేసి దోచుకుంది
– ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి , దేవాదాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్తా
– టీటీడీ బోర్డు ఏర్పడక ముందే తిరుమలకు వెళితే ఈవోను కలిసి వివరిస్తా
– ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు

ఉండి: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులను గత ఐదేళ్లలో స్టూవర్టుపురం దొంగల్లా దోచుకున్నారన్నది పచ్చి నిజమని ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. మంచినీటి సీసాను 60 రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారని, అద్దె గదుల ధరలను అడ్డగోలుగా పెంచి భక్తులపై భారాన్ని మోపారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఉండి నియోజకవర్గ కేంద్రంలో రఘురామకృష్ణంరాజు
మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలలో భగవంతుడికి భక్తున్ని దూరం చేయడం ఎలా అనే క్రిమినల్ ఆలోచనలతోనే బోర్డు నడిచిందన్నది పచ్చి నిజమని అన్నారు . దానికి మూల కారణం జగన్మోహన్ రెడ్డి మతం, ఆయన అభిమతమేనని పేర్కొన్నారు.

హవ్వ… వాటర్ బాటిల్ 60 రూపాయలకు విక్రయిస్తారా?

తిరుమల కొండపై భక్తులకు 60 రూపాయలకు మంచినీటి సీసాను విక్రయించడం దారుణమని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. భక్తులు వాళ్ళు విక్రయించిన మంచినీటిని కొనుగోలు చేసి తాగాల్సిన దుస్థితి నెలకొందన్నారు . ఈ నీటిని విక్రయించే వారంతా వైకాపా బ్యాచ్ అని తెలిపారు . ఇప్పుడు కొండపై పరిస్థితులు మారాయో లేదో తెలియదన్నారు. కొండ కింద వాటర్ బాటిల్ 20 రూపాయలకు లభిస్తే, కొండపై ప్లాస్టిక్ బాటిళ్లను నిషేధించామన్న కారణంగా సీసా బాటిల్ ను 60 రూపాయలకు విక్రయించడం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు.

గాజు సీసా ఖరీదు పది రూపాయలని, అందులో శుద్ధి చేసిన నీటిని నింపినందుకు 15 రూపాయలని అనుకున్న, 25 రూపాయలకే సీసా బాటిల్ విక్రయించాలన్నారు. అలా కాకుండా 60 రూపాయలకు సీసా నీళ్ల బాటిల్ విక్రయించడం ఏమిటని ప్రశ్నించారు. అలాగే కొండపై టిఫిన్ చేయాలంటే సామాన్య భక్తుడికి తలకు మించిన భారంగా మారిందన్నారు. హోటళ్ళ లీజు, అద్దె ధరలు అడ్డగోలుగా పెంచడంతో, హోటల్ యజమానులు భక్తులపై భారం మోపారన్నారు.

దోశ తినాలంటే 200 రూపాయలు ఖర్చు చేయాల్సిందేనని అన్నారు. ఇలా కొండపై భక్తులను నిలువు దోపిడీ చేయడమే కాకుండా, స్టూవర్టుపురం దొంగల్లా భక్తుల మీద పడి దోచుకుంటున్నారని మండిపడ్డారు. భక్తుడిని ఇలా నిలువు దోపిడీ చేస్తే విరక్తి చెంది తిరుమల కొండకు రాకుండా ఉంటారన్న కుట్ర కోణం ఇందులో దాగి ఉందేమోనని రఘురామ కృష్ణంరాజు అనుమానాన్ని వ్యక్తం చేశారు. కొండపై వేరే నీళ్లు తాగలేం. సుబ్బారెడ్డి విక్రయించే 60 రూపాయల సీసా బాటిల్ కొనుక్కొని తాగాల్సిందే.

అన్నదానం వద్ద రద్దీ అధికం. అయినా ప్రసాదం తిన్న తర్వాత అన్నదానం వద్దకు తినడానికి వెళ్లేవారు తక్కువే. సామాన్య భక్తులకు తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా లేకుండా కష్ట పెట్టారన్నారు. గతంలో దేవదేవుడి దర్శనానికి క్యూలో నిలుచున్న వారికి పాలు ఇచ్చేవారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల కొండపై భక్తులకు పాలు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారు.

ఇలా చిత్రహింసలు పెడితే నైనా భక్తుల సంఖ్య తగ్గుతుందేమోనని కుట్ర చేశారు. భక్తుల సంఖ్యను ఎంత తగ్గించాలని చూసిన ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మహత్యం వల్ల, కొత్త భక్తులు దర్శించుకునేందుకు వస్తూనే ఉన్నారన్నారు. గతంలో కొండకు మూడుసార్లు వెళ్లేవారు, ఈ ఇబ్బందులు పడలేక ఒకసారి వెళ్లి స్వామి ని దర్శించుకుంటున్నారన్నారు.

భక్తుల విరాళాలతోనే భవనాల నిర్మాణం

తిరుమల కొండపై భక్తుల విరాళాలతోనే భవనాలను నిర్మించారని, అటువంటి భవనాలలో దిగే భక్తుల వద్ద ముక్కు పిండి అదనపు అద్దె వసూలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. జెరూసలేం, మక్కా కు వెళితే రాయితీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, తిరుమలకు వచ్చిన భక్తులపై అద్దె ధరలను అడ్డగోలుగా పెంచి దోచుకుందన్నారు. తిరుమల కొండపై ఇంకా మంచినీటి సీసాను 60 రూపాయలకే విక్రయిస్తున్నారా?, లేదా అన్న విషయం తనకు తెలియదని పేర్కొన్న రఘురామకృష్ణంరాజు, ఈ విషయంలో టిటిడి అధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలన్నారు.

మంచినీటిని సాధారణ ధరలకే భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అలాగే సామాన్య భక్తులకు ఇచ్చే అద్దె గదుల ధరలను తగ్గించాలన్న ఆయన, విఐపి భక్తులకు ఇచ్చే అద్దె గదుల ధరను పెంచితే ఎవరికీ అభ్యంతరం లేదన్నారు. భక్తుల వద్ద డబ్బులు మిగిలితే భగవంతుడి హుండీలోనే వేస్తారని, అటువంటి భక్తుల వద్ద నుంచి ఇలా దోపిడి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. వెంకటేశ్వర స్వామి కి ఏమైనా డబ్బు లేదా?

ప్రతిరోజు మూడున్నర నుంచి నాలుగు కోట్ల రూపాయల ఆదాయం భక్తులు సమర్పించే కానుకల రూపేనా వస్తుందని గుర్తు చేశారు. అయినా భక్తులను ఇంతగా దోచుకోవడం అవసరమా? అంటూ నిలదీశారు. భక్తులకు సౌకర్యాలను కల్పించడం మాని గత ఐదేళ్లపాటు తిరుమల ఆధ్యాత్మిక కేంద్రాన్ని కాస్తా వాణిజ్య కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మార్చిందన్నది వాస్తవమని ఒక భక్తుడిగా చెబుతున్నట్లు రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.

లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడారన్నది నిజం

వెంకటేశ్వర స్వామి భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారన్నది నిజమని, కల్తీ నెయ్యి వాడకం ద్వారా భక్తుల మనోభావాలు దారుణంగా దెబ్బతిన్నాయన్నది వాస్తవమని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని వెల్లడించిన తర్వాత భక్తులలో తీవ్ర ఆగ్రహావేషాలు వ్యక్తమవుతున్నాయన్నారు. లడ్డు తయారీ కోసం వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు, చేపనూనె, ఎనిమల్ టాలో కలిశాయని లేబోరేటరీ లో పరీక్షల ద్వారా నిరూపితమైందన్నారు. బ్లూ చానల్స్ మినహా నిన్న అన్ని టీవీ చానల్స్ ఇదే అంశాన్ని చర్చించాయన్నారు.

తిరుమల శ్రీవారి లడ్డు తయారీ లో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని టీటీడీ ఈవో కూడా స్టేట్మెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. 350 రూపాయల నుంచి 370 రూపాయలకు నెయ్యి సరఫరా చేస్తామంటే గత ప్రభుత్వ హయాంలో అంగీకరించినట్లు తెలిసిందన్నారు. ఇంత తక్కువ ధరకు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఎవరు సరఫరా చేస్తారని ప్రశ్నించారు. ఆవు నెయ్యిని టీటీడీ టన్నులలో కొనుగోలు చేస్తుంది కాబట్టి 500 రూపాయలకు సరఫరా చేస్తారంటే నమ్మవచ్చునన్నారు.

అంతేకానీ 320 రూపాయలకు కొనుగోలు చేశామని చెప్పి రివర్స్ టెండర్ ద్వారా అంతా సేవ్ చేశాం…. ఇంత సేవ్ చేశాం అని చెప్పినట్లుగానే, చివరకు శ్రీవారి లడ్డు ప్రసాదానికి వినియోగించే నెయ్యిలో కూడా కమీషన్లకు కక్కుర్తి పడ్డారన్నారు. వీరు కొనుగోలు చేసిన నెయ్యి కనీసం వంద రూపాయలు కూడా ఉండదన్నారు. అదంతా ఖరీదైన సబ్బుల తయారీ కోసం వినియోగిస్తారని తెలిపారు . అటువంటి నెయ్యిని లడ్డు ప్రసాదం తయారీకి వినియోగించి, శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీశారని మండిపడ్డారు.

లడ్డు తయారీ కోసం ఇటువంటి నాసిరకమైన నెయ్యిని వినియోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పి ఉండకపోతే, ఈరోజు సాక్షి దినపత్రికలో రాసినట్లుగా వైకాపా నాయకులు అబద్దాలను వల్ల వేసేవారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిసి కూడా, చంద్రబాబు నాయుడు కు చెప్పక తప్పని పరిస్థితి నెలకొందన్నారు.

సొంత లేబొరేటరీ ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు?

లక్షల టన్నుల్లో నెయ్యిని కొనుగోలు చేసే టీటీడీ, ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకునే విధంగా సొంతంగా లేబొరేటరీని ఎందుకు ఏర్పాటు చేసుకోలేదని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. సొంత లేబొరేటరీ కి 60 నుంచి 70 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. గత ప్రభుత్వ హయాంలో కొన్ని వేల టన్నులనెయ్యి కొనుగోలు చేశారు. పాలు, నెయ్యి వంటి పదార్థాలు కల్తీ అవుతున్న ప్రస్తుత తరుణంలో ఇప్పటికీ టీటీడీకి సొంత లేబొరేటరీ ఎందుకు లేదన్నది బిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందన్నారు.

ఈ విషయంలో దేవస్థానం పాలకవర్గం, ఎగ్జిక్యూటివ్ అధికారులనే తప్పు పట్టాలన్నారు. టీటీడీకి సొంత లేబొరేటరీ ఉండి ఉంటే ఆరు నెలలకోసారి కన్సైన్మెంట్ వచ్చినప్పుడు పరీక్షలు నిర్వహించి ఉండేవారన్నారు. ప్రతి కంటైనర్ లోని నెయ్యిని శాంపిల్స్ గా తీసుకొని పరీక్ష చేయాలన్నారు. వందల కోట్ల విలువ చేసే మెటీరియల్ కొనుగోలు చేస్తున్నప్పుడు, టీటీడీకి సొంత లేబొరేటరీ లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

టిటిడి చైర్మన్లు రాజకీయ ప్రక్రియలో భాగంగా ఎంపిక అవుతారని, వారికి అంత నాలెడ్జ్ లేకపోయినప్పటికీ, ఈవోలు ఎందుకు సొంత లేబొరేటరీ ఏర్పాటుపై దృష్టి సారించలేదని ప్రశ్నించారు. అది వారి దృష్టిలోపమా? అంటూ నిలదీశారు. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని అధికారులు పనిచేయాలన్నారు.

జగన్మోహన్ రెడ్డి ఓటమికి దేవాలయాలలో పూజలే కారణమని భావిస్తున్న ఆయన కుటుంబ సభ్యులు

2014లో జగన్మోహన్ రెడ్డి ఓటమి అనంతరం స్వరూపానంద స్వామి ఆయనకు హిందూ కలర్ వేశాక, 2019లో నెగ్గిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దేవాలయాలను సందర్శించారని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి తన భార్య భారతి వెంట రాకుండానే, తిరుమలలో పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. 2024లో ఆయన ఓడిపోవడానికి ఆ పూజా ఫలితమే కారణమని ఆయన కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లుగా తెలుస్తోందని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు.

క్రైస్తవ మతంలో ఇతర దేవుళ్ళను కూడా సైతాన్ గా భావిస్తుంటారన్నారు. క్రైస్తవ మత గ్రంథాలలోనూ నేను ఒక్కడినే దేవుడిని, మిగిలిన వారంతా… అంటారని నా క్రైస్తవ మిత్రుల ద్వారా తెలిసిందన్నారు. తన మత విశ్వాసాల మేరకు జగన్మోహన్ రెడ్డి కనుసన్నలలో పని చేసేవారు భగవంతుడికి భక్తున్ని ఎంత దూరం చేయాలో, అంత దూరం చేసే ప్రయత్నం చేశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో భగవంతునికి భక్తున్ని దూరం చేసే ప్రయత్నం జరిగిందన్నది నిర్వివాదాంశం.

రాబోయే రోజుల్లో ధర్మకర్తల మండలి భక్తులను భగవంతునికి చేరువగా చేసే ప్రయత్నం చేయాలన్నారు. పాలకమండలి ఏర్పాటుకు మరికొంత సమయం పట్టవచ్చు. ఈ లోగా కొండమీద వెంకయ్య చౌదరి, కొండ కింద శ్యామల రావు లు భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు.

మంచినీటిని ఉచితంగా సరఫరా చేయాలి

తిరుమల కొండపై భక్తులకు మంచినీటి ని ఉచితంగా సరఫరా చేయాలని రఘురామకృష్ణం రాజు కోరారు. సీసా బాటిల్ ద్వారా భక్తులకు ఉచితంగా మంచినీటిని సరఫరా చేయవచ్చన్నారు. సీసా బాటిల్ ఇచ్చే ముందు భక్తుల వద్ద నుంచి కొంత మొత్తాన్ని డిపాజిట్ గా తీసుకొని, తిరిగి బాటిల్లను కౌంటర్ల ద్వారా సేకరించాలన్నారు. బాటిళ్లను తిరిగి ఇచ్చిన వారికి డిపాజిట్ మొత్తాన్ని ఆ సమయంలో వెనక్కి ఇవ్వాలన్నారు. వేసవికాలంలో ఎంతోమంది చలివేంద్రాల ద్వారా మంచినీటిని, మజ్జిగను దాహార్తులకు అందజేస్తున్నారని గుర్తు చేశారు.

ఎమ్మెల్యేగా ప్రజల సమస్యలను ప్రస్తావిస్తా

ఎమ్మెల్యేగా నేను రాష్ట్రంలో ఏ ప్రాంత ప్రజల సమస్యలనైనా అసెంబ్లీలో ప్రస్తావించడమే కాకుండా, అవసరమైతే ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంతుల దృష్టికి తీసుకువెళ్తానని రఘురామకృష్ణం రాజు తెలిపారు . పాలకవర్గం ఏర్పడక ముందే నేను తిరుమలకు శ్రీవారి దర్శనానికి వెళ్తే భక్తుల సమస్యలను ఈవో దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్ళనున్నట్లుగా తెలిపారు.

మంచినీటి కోసం వసూలు చేస్తున్న 60 రూపాయలను తగ్గించాలని, అద్దె గదుల ధరలను కూడా తగ్గించాలని కోరుతానని చెప్పారు. టిటిడి ఇప్పటివరకు ఒక్క బిల్డింగ్ అయినా కట్టిందా? అని ప్రశ్నించిన రఘురామకృష్ణంరాజు, దాతలు ముందుకు వస్తే వారికి స్థలాన్ని కేటాయించడానికి కూడా కోట్ల రూపాయలు వసూలు చేస్తుందన్నారు. భక్తుల వద్ద నుంచి స్టార్ హోటల్ యజమాన్యాలు వసూలు చేస్తున్నట్లుగా పెద్ద మొత్తంలో అద్దెలు వసూలు చేయడం ఏంటని నిలదీశారు.

భక్తుల వద్ద నుంచి పెద్ద మొత్తం అద్దెలు వసూలు చేయకపోతే, ఆ సొమ్మును భక్తులు శ్రీవారి హుండీలో వేస్తారన్నారు. అలా స్వామి డబ్బు స్వామికే వెళుతుందన్న ఆయన, తిరుమల కొండపై దోపిడీ జరిగిందన్నది వాస్తవం… ఇప్పటికైనా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలన్నారు.

విజయ్ పాల్ బెయిల్ కష్టమే

పోలీస్ కస్టడీలో నన్ను చిత్రహింసలకు గురిచేసిన కేసులో మాజీ పోలీస్ అధికారి విజయ్ పాల్ కు బెయిల్ లభించడం కష్టమేనని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఇన్ని రోజులు పరారీలో ఉన్న విజయ్ పాల్ కు పోలీస్ శాఖలోని అధికారులే సహకరిస్తూ, ఉండి ఉండవచ్చునన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఇక విజయ్ పాల్ కు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదని ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్ర ఎక్స్ట్రాడినరీగా వాదనలు వినిపించారని, అలాగే ఈ కేసులో తన ఇంప్లిడ్ పిటిషన్ పై న్యాయవాది ఉమేష్ చంద్ర కూడా అద్భుతంగా వాదనలను వినిపించారన్నారు. ఈ కేసును 24వ తేదీకి వాయిదా వేశారని, ఆరోజు కచ్చితంగా తీర్పును వెలువరిస్తారన్న ఆశాభావాన్ని రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు.

ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికలో నన్ను కొట్టిన బ్యాచ్, కొట్టించిన బ్యాచ్ దొరుకుతుందని, త్వరలోనే వారిపై చర్యలు ఉంటాయని రాశారని పేర్కొన్నారు. చట్టసభల ప్రతినిధినైన తనని తీసుకువెళ్లి బాదితే, ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఒక మాజీ ఎంపీగా, ప్రస్తుతం ఎమ్మెల్యేగా నాకు నేనే న్యాయం చేసుకోకపోతే, ఈ ప్రభుత్వంలో కూడా నాకు న్యాయం జరగకపోతే ప్రజలకు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులపై, వ్యవస్థలపై నమ్మకం సన్నగిల్లుతుందన్నారు. అందుకే నేను నా పోరాటాన్ని కొనసాగిస్తున్నానని చెప్పారు. నా ఈ పోరాటంలో చివరకు న్యాయానికి విజయం దక్కుతుందన్న పరిపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు.

నీ మతాన్ని ప్రేమించు… ఇతరుల మతాన్ని ద్వేషించకు

భారతదేశం వంటి సెక్యులర్ కంట్రీలో సొంత మతాన్ని ప్రేమించడం తప్పేమీ కాదని, ఇతరుల మతాన్ని ద్వేషించడమే తప్పని రఘురామ కృష్ణంరాజు అన్నారు. పాలకులకు అన్ని మతాలను గౌరవించాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. మన మతాన్ని గౌరవించి, దేవుణ్ణి ప్రేమించడం ఎవరు తప్పు పట్టరని కానీ ఇతర దేవుళ్లను, మతాన్ని ద్వేషిస్తే మాత్రం ప్రజలు క్షమించరన్నారు.

నేను హిందూ మతాన్ని ప్రేమిస్తాను, అలాగే ఇతర మతాలను గౌరవిస్తానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఇతరులు బొట్టు పెట్టుకుంటే కూడా సహించరని పేర్కొన్న ఆయన, ఇంటి పేరు, ఒంటి పేరులో రెడ్డి అని ఉన్న నాయకుడిని బొట్టు పెట్టుకుని తన వద్దకు రావద్దని ముఖాననే చెప్పినట్లు తెలిసిందన్నారు.

LEAVE A RESPONSE