Suryaa.co.in

Editorial

మరీ ఇంత చీప్ పబ్లిసిటీనా బాసూ..

( మార్తి సుబ్రహ్మణ్యం)

ప్రచార పిచ్చి ముదిరి పరాకాష్టకు చేరుకుంటున్న కాలమిది. ‘కాదేదీ అనర్హం సోఫాసెట్ల ప్రారంభోత్సవ ప్రచారం సైతం’ అని శ్రీశ్రీ గారి కవితను మార్చుకోవలసిన యమాఫాస్టు జమానా ఇది. ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు పరిశీలిస్తే.. ప్రచార పిచ్చ మరీ ఇంత వెగటుగా, చిల్లరగా, మానవత్వం కూడా లేకుండా ఉంటుందా అనిపించకమానదు. అలాంటి వెగటు, రోత, స్థాయి తక్కువ పబ్లిసిటీలు మచ్చుకు కొన్ని చూద్దాం.

కొద్దిరోజుల క్రితం నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఒక శంకుస్థాపన కార్యక్రమం తలపెట్టారు. ఎమ్మెల్యే ప్రారంభిస్తున్నారంటే అదేదో పెద్ద కార్యక్రమమే అయి ఉంటుంది కామోసనుకున్నారు. కానీ తీరా సదరు ఎమ్మెల్యే గారు ప్రారంభించిన ఆ మహత్కార్యం ఏమిటంటే.. ఆయన ఆఫీసులో కొన్న కొత్త సోఫా సెట్లకు రిబ్బన్ కటింగు! దానికోసమే ఆ హడావిడి. ఆ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో, ‘ఇలాంటి ప్రారంభోత్సవాలు కూడా ఉంటాయా’ అని నెటిజన్లు నోరెళ్లబెట్టారు.

ఇక తాజాగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రేపల్లె రైల్వేస్టేషన్‌లో మహిళపై అత్యాచార ఘటన. కృష్ణా జిల్లా నాగాయలంకకు వెళ్లాల్సిన భార్యాభర్తలు, చీకటి కావడంతో రేపల్లె రైల్వే స్టేషన్‌లో పడుకున్నారు. ఈలోగా అక్కడి జులాయిగాళ్లు ఆ మహిళపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత వారిని పోలీసులు అరెస్టుచేశారు. అది వేరే కథ. అయితే, ప్రభుత్వం ఆమెకు నష్టపరిహారం ఇచ్చే క్రమంలో భాగంగా, ఆమె భర్తను పిలిచి.. మంత్రి రజనీ, జిల్లా కలెక్టర్, మేయర్ కలసి రెండులక్షల రూపాయల చెక్కు ఇచ్చి తమ దానగుణాన్ని మీడియాకు విడుదల చేశారు.

నిజానికి పాపం బాధితులెవరన్నదీ అప్పటివరకూ బయట ప్రపంచానికి తెలియదు. మీడియాలో కూడా వారి పేర్లు ఇవ్వలేదు. కానీ, మంత్రి-అధికారులు మాత్రం అత్యుత్సాహంతో, అత్యాచారానికి గురయిన మహిళ భర్తకు పరిహారం ఇస్తున్న ఫొటోను రిలీజు చేసి.. వారి వివరాలను ప్రపంచానికి ప్రకటించేశారు. దీనితో పాపం రేపటి నుంచి ఆ దంపతులకు అదో మానసికక్షోభ తప్పదు. సమాజం చూపించే సానుభూతిని ఆ పేద కుటుంబం తట్టుకోవడం కష్టం. నిజానికి ఈ పబ్లిసిటీ అమానవీయ చర్య. బాధితులకు గుట్టుచప్పుడు కాకుండా సాయం చేయాల్సిన ప్రభుత్వమే, పబ్లిసిటీ కోసం ఇలా వారిని మీడియాకెక్కించి అల్లరి చేసి అవమానించడం అన్యాయమే కాదు, అరాచకం కూడా! మంత్రి రజనీ అంటే రాజకీయ నాయకురాలు కాబట్టి, ఆమె సహజంగానే ప్రచారం కోరుకుంటారు. కానీ అన్నీ తెలిసి, ఐఏఎస్ చదివిన కలెక్టర్ కూడా.. ఇది మానవతావాదం కాదని మంత్రిని వారించకుండా, ఆమెతో కలసి ఆయన కూడా బాధితురాలి భర్తతో కలసి ఫొటో దిగడం విమర్శలకు గురవుతోంది.

సీన్ కట్ చేస్తే..
తాజాగా టీవీ9 స్టుడియోలో ఓ కొత్త సినిమా పబ్లిసిటీ ప్రమోషన్ వికటించి, మానవహక్కుల సంఘం వరకూ చేరాల్సివచ్చింది. విశ్వక్‌సేన్ నటించిన ‘అశోకవనంలో అర్జునకల్యాణం’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా.. ఓ అభిమాని పెట్రోల్ పోసుకునే ప్రయత్నంగా ఓ ప్రాంక్ వీడియోను యూనిట్ రూపొందించింది. అంతవరకూ బాగానే ఉంది. అయితే ఇలాంటి చిల్లర చేష్టలవల్ల న్యూసెన్స్ అవుతోందని, ఇందుకు బాధ్యులైన చిత్ర యూనిట్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ అరుణ్‌కుమార్ అనే అడ్వకేట్, మానహ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం, కమిషన్ దానిని స్వీకరించడం జరిగిపోయింది.

ఇక హీరో విశ్వక్‌సేన్ టీవీ9 స్టుడియోలో చర్చకు వచ్చిన సందర్భంలో.. యాంకరమ్మ-హీరో విశ్వక్‌సేన్ మధ్య జరిగిన తిట్ల పురాణం, గెటవుట్ అంటూ యాంకరమ్మ హీరోను గద్దించడం, హీరో కూడా చొక్కాకు ఉన్న మైకు కింద పడేసి వెళ్లిపోయే దృశ్యాలు సోషల్‌మీడియాలో చర్చనీయాంశమవుతోంది.

సహజంగా చానెల్‌కు చెడ్డపేరు తెచ్చే అలాంటి ఈ దృశ్యాలు బయటకు రాకుండా కట్ చేస్తారు. ఒకవేళ అది లైవ్ ప్రోగ్రామ్ అయినా కట్ చేసి, దాని స్థానంలో ఏదో ఒక కార్యక్రమం టెలికాస్టు చేస్తారు. కానీ.. ఈ ఇక్కడ హీరో-యాంకరమ్మ తీరుబడిగా తిట్టుకుంటున్న తిట్లు, హీరో విశ్వక్‌సేన్ హీరోయిజం ఆసాంతం చూపించారంటే.. అది కూడా యాడ్ ప్రమోషన్‌లో భాగం కాకుండా ఎలా అవుతుందన్నది బుద్ధిజీవుల సందేహం. పైగా ఆ వీడియో ఆ ఇద్దరి అనుమతి లేకుండా ఎలా బయటకు వచ్చిందన్నది ఇంకో డౌటనుమానం.

అయినా.. సిన్మావాళ్ల చాదస్తం గానీ, ఇలా చిల్లర పబ్లిసిటీ చేస్తేనే జనం సిన్మా చూస్తారా? కథలో దమ్ముంటే ముష్టివాడిని హీరోగా పెట్టినా, జనం ఆ సినిమాలను ఆదరిస్తారు. బాగుందన్న టాక్ వస్తే చచ్చినట్లు చూస్తారు. రాంగోపాల్‌వర్మ తన సినిమాలకు ఇలాంటి ట్రిక్కులు ప్లేచేసి.. చేసి.. పబ్లిసిటీ అయితే తెచ్చుకుంటారు గానీ, జనాలను ఎక్కువకాలం సిన్మాహాలు వరకూ తీసుకురావడంలో ఫెలయివుతున్నారు. అందుకే వర్మ సినిమా ప్రమోషన్లు టీవీ స్టుడియోలో ఆయన మాటలు వినడం, మధ్యలో ఆయన టీ తాగితే చూడ్డం వరకే బాగుంటాయన్నది సినీజీవుల ఉవాచ.

సీన్‌కట్ చేస్తే…
గతంలో తెలంగాణ అమరవీరుల సంఘం నేత రఘుమారెడ్డి, అప్పటి టీఆర్‌ఎస్వీ యువ నేత, ఇప్పటి ఎమ్మెల్యే బాల్కసుమన్ ఓ చర్చ సందర్భంగా వాదులాడుకున్నారు. ఆ డిబేట్‌ను కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించినట్లు గుర్తు. ఆ సందర్భంలో చర్చ సీరియస్‌గా సాగి, హటాత్తుగా రఘురామరెడ్డిపై బాల్క సుమన్ చేయి చేసుకోవడంతో.. కొమ్మినేని కంగారు పడి ఇద్దరినీ సర్దుబాటు చేశారు. ఆ తర్వాత సీన్లు కనపడకుండా ఆ ప్రోగ్రామ్‌ను కట్ చేశారు.

కొద్దికాలం క్రితం ఏబీఎన్ చానెల్ డిబేట్‌లో అమరావతి అంశానికి సంబంధించి, ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి- అమరావతి పరిరక్షణ సమితి నేత కొలికపూడి శ్రీనివాసరావు మధ్య మాటా మాటా పెరిగింది. హటాత్తుగా కొలికపూడి, బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డిని చెప్పుతో కొట్టడంతో యూనిట్‌తోపాటు, అది చూస్తున్న ప్రేక్షకులు బిత్తరపోయారు.

అయితే ఈ రెండు సంఘటనలు పబ్లిసిటీతో సంబంధం లేకుండా జరిగినవే. ఆయా సందర్భాల్లో డిబేట్ చేసే జర్నలిస్టు సంయమనం, సమయస్ఫూర్తి పాటించి ఆ లైవ్ కార్యక్రమాలను నిలిపివేసి చానెల్ పరువు నిలబెట్టారు. కానీ తాజాగా టీవీ9 లో హీరో విశ్వక్‌సేన్-యాంకరమ్మ మధ్య జరిగిన తిట్ల పురాణంలో, అది కనిపించకపోవడంతో.. బహుశా ఇది కూడా యాడ్ ప్రమోషనేమో అన్న అనుమానాలకు కారణమయింది. నిజం శ్రీమన్నారాయణుడికెరుక?!

LEAVE A RESPONSE