ఆయన ఇప్పుడు ఎవరిని ‘పీకే’స్తారో?

( మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘ పదేళ్ల రోలర్‌కోస్టర్ ప్రయాణంలో ప్రజల పక్షాన విధివిధానాలు రూపొందించటం ద్వారా, ప్రజాస్వామ్యంలో అర్ధవంతమైన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ వచ్చాను. ఇప్పుడు రియల్ మాస్టర్స్ వద్దకు వెళ్లే సమయం ఆసన్నమయింది. ప్రజలే రియల్ మాస్టర్లు. నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారిని మరింత బాగా అవగాహన చేసుకుని, సుపరిపాలన దిశగా అడుగులు వేయాలనుకుంటున్నాను’’
– పీకే గా ప్రచారంలో ప్రశాంత్ కిశోర్ అనబడే బీహార్ రాజకీయ బేహారీ, తాజాగా చేసిన ఐదారు లైన్ల ట్వీట్ ఇది.ఇదికూడా చదవండి.. యాపారమా? రాజకీయమా?

హమ్మయ్య. ప్రజలకు చాలా ఉపశమనం కలిగించే వార్త ఇది. ఇప్పటివరకూ వాళ్లకీ, వాళ్లకీ సలహాలిచ్చి.. తన ఐప్యాక్ మిషన్ ద్వారా ఉద్యోగులను దేశం మీదకు వదిలి.. తాను కాంట్రాక్టు కుదుర్చుకున్న పార్టీలను గెలిపించేందుకు, ఆయా రాష్ట్రాల మధ్య కుల-మతాల చిచ్చు రగించే ఐడియాలిచ్చి, సోషల్‌మీడియాలో జుట్లు జుట్లు ముడిపెట్టి, ఆనక జనంతో బూతులు తిట్టించుకునే అవసరం, ఇకపై పీకేకు ఎంతమాత్రం ఉండదన్న మాట. పోనీలెండి. ఆయన ‘ప్రశాంత’ంగా ఉండటమే దేశ ప్రజలకు కావల్సింది!

పీకే ట్వీటిన అంశాలు చూస్తే ఆయనే ఓ సొంత దుకాణం.. అంటే ఓ రాజకీయ పార్టీకి పురుడుపోయనున్నారని అవుతుంది. ఈ దేశంలో కేఏ పాల్ సహా అందరికీ పార్టీలు పెట్టుకునే హక్కుంది. పార్టీ పెట్టిన తర్వాత ‘రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీచేసి, అధికారపగ్గాలు చేపడతాం. మా పార్టీ విద్యావంతులకు సీట్లు ఇస్తుంది. రాష్ట్ర రాజకీయాలను మార్చి, ప్రజలచేతికే అధికారం ఇచ్చేందుకే మా పార్టీ పుట్టింది. అవినీతిరహిత పాలనే మా లక్ష్యం’ అని అందరిలా గంభీరంగా ప్రకటించే అవకాశమూ ఉంది.

జాతీయ పార్టీ అయిన బీజేపీ పుట్టి మూడు దశాబ్దాలు దాటినా, ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు అభ్యర్ధులకే దిక్కులేదు. మరి ఈ కొత్త పార్టీలకు ‘అన్ని నియోజకవర్గాల్లో’ అభ్యర్ధులెలా దొరుకుతారు అని మీరు ప్రశ్నించకూడదు. నేను జవాబు చెప్పకూడదు. మరి పార్టీని పుట్టించబోయేది అంతలావు పీకే కాబట్టి, ఆయన తన మాయాజాలంతో అన్ని చోట్లా పోటీ చేయిస్తారేమో చూడాలి. లేదా తనకు అంత సినిమా లేదని చివరాఖరులో గ్రహించి ఏదో ఒక పార్టీ భుజం మీద ఎక్కి, దానితో కలసి పోటీ చేస్తారో చూడాలి. మరి ఆయన ఇప్పుడు ఎవరిని ‘పీకే’స్తారో చూడాలి.

సహజంగా బయట నుంచి సలహాలివ్వడం వేరు, తానే ఆ స్థానంలో ఉండి పనిచేయడం వేరు. క్రికెట్ మ్యాచ్ చూసే ప్రేక్షకులు, సచిన్ ఆ బాల్ అనవసరంగా ఆడి అవుటయ్యాడు. లేని పరుగు కోసం కక్కుర్తిపడి అవుటయ్యాడని.. టీవీ తెర మీద కూర్చుని కామెంట్ చేస్తుంటారు. అదే ఆ ప్రేక్షకుడే క్రీజులోకి వెళ్లి తాను కామెంటు చేసిన విధంగా ఆడలేడు. పీకే పార్టీ భవితవ్యం కూడా అంతే ఉంటుందేమో చూడాలి.

అసలు పీకేకు పొలిటికల్ పార్టీల్లో ఎందుకింత క్రేజ్? ఆయనొస్తే చాలని పార్టీ బాసులు ఎందుకనుకుంటారు? ఏమిటి ఆయనలో ఉన్న గొప్పతనం? చాలాకాలం నుంచి జనంలో నలుగుతున్న చర్చలివి. నిజమే. ఒక మనిషిలో ఎలాంటి గొప్పతనం లేదా ప్రత్యేకత లేనిదే అతనిగురించి అందరూ మాట్లాడుకోరు కదా? పీకే బ్యాక్‌గ్రౌండేమిటో ఓసారి చూద్దాం.

పీకేకు ఇప్పుడంటే బోలెంత నేము, ఫేమూ వచ్చింది కానీ.. గతంలో ఆయనా ఫ్లాప్‌స్టారే. పదేళ్ల క్రితం యుపీ, బీహార్‌లో ఆయన పనిచేసిన సమాజ్‌వాదీపార్టీ, కాంగ్రెస్ ఎన్నికల్లో గెలవలేక బొక్కబోర్లా పడింది. దానితో ఆయన అక్కడ నుంచి చడీచప్పుడు లేకుండా మాయమయ్యారు. మరి ఆయన ఒక జగన్‌ను, ఒక మమతాను గెలిపించారు కదా అని ప్రశ్నించవచ్చు. చరిత్ర జయాపజయాలను ఎప్పుడూ చర్చిస్తుంది. ప్రధానంగా వైఫల్యాలనే ఎక్కువ చర్చిస్తుందని విస్మరించకూడదు.

పదేళ్ల క్రితం యుపీలో పీకే ఇచ్చిన సలహాల వల్ల ఓటమి పాలైన కొద్ది నెలల తర్వాత.. కోపోద్రిక్తులయిన సమాజ్‌వాదీపార్టీ కార్యకర్తలు, ‘పీకే ఆచూకీ తెలిపిన వారికి 5 లక్షల బహుమతి ఇస్తామని’ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసిన విషయం, బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. ఇది నిజం. ‘పీకే గురించి ఎందుకింత చర్చ జరుగుతుందో నాకు అర్ధం కావడం లేదు. ఆయన పదేళ్ల క్రితం నాటి యుపీ, బీహార్ ఎన్నికల్లో ఏం సాధించారు? అప్పుడు ఆయన కాంట్రాక్టు తీసుకున్న పార్టీలను ఎందుకు గెలిపించలేకపోయారు? పశ్చిమబెంగాల్‌లో మమతాను గెలిపించారంటున్నారు. కానీ అక్కడ బీజేపీ కింది స్థాయి నుంచి 70 పైచిలుకు స్థానాలు సాధించింది. అసలు తృణమూల్, కమ్యూనిస్టు కోటలయిన బెంగాల్‌లో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరిస్తుందని ఎవరైనా ఊహించారా? మరి ఎవరు గొప్ప? విభజన రాజకీయాలు, సెంటిమెంటు రెచ్చగొట్టడం వల్లనే బెంగాల్‌లో మమతా గెలవగలిగింది. పీకే అనేవాడు ఒక వ్యాపారి. నిరంతరం తనను తాను మార్కెటింగ్ చేసుకునే వ్యాపారి. తెలివిగల వ్యాపారి ఎవరైనా తన ప్రొడక్టు గురించి

కాకుండా, జనం ఏది ఎక్కువగా కొంటారో తెలుసుకుని దానిని ప్రొడక్టు చేస్తాడు. పీకేకి ఆ వ్యూహం లేదు. తన ప్రొడక్టు సేలవడం కోసం, ఏమైనా చేసేరకం’ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, బీజేపీ పార్లమెంటరీపార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం విశ్లేషించారు.

నిజానికి పీకే వ్యూహాలెప్పుడూ గెలిచే గుర్రాలపై బెట్టింగు పెట్టినట్లే ఉంటాయి. ఏపీలో గత ఎన్నికల ముందు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన స్ధానిక నేతలు, వారి కుటుంబసభ్యుల దాష్టీకం, అవినీతిపై జనంలో వ్యతిరేకత నెలకొంది. టీడీపీ తన కార్యకర్తలనూ విస్మరించింది. జన్మభూమి కమిటీలు దోపిడీకి వేదికలయ్యాయి. ఒక్కసారి నాకు చాన్సివ్వండన్న జగన్‌పై జనం మొగ్గుచూపారు. బీజేపీ సానుభూతిపరుల ఓట్లు కూడా వైసీపీ ఖాతాలో కలిశాయి. కేంద్రంతో చంద్రబాబు కయ్యం ఫలితంగా, టీడీపీకి రావలసిన విరాళాలు కూడా ఆగిపోయాయి. కర్ణుడి చావుకు లక్ష కారణాలన్నట్లు.. టీడీపీ ఓటమికీ అన్నే కారణాలు.

అయితే.. కమ్మ కులాల నుంచి ఇతర కులాలను వేరుచేయడం, అమరావతి కమ్మవారికే సొంతమన్నట్లు చేసిన పీకే వ్యూహం కూడా బాగా వర్కవుయింది. దానికి తగ్గట్లుగానే బెజవాడలో కనిపించిన కమ్మకుల ఉన్మాదం టీడీపీని దారుణంగా దెబ్బతీసింది. తిరుమల వెంకన్న పింక్ డైమండ్ మాయం, ఐవైఆర్ కృష్ణారావు ‘ఎవరి రాజధాని పుస్తకం’.. ఇవన్నీ టీడీపీ మునిగిపోవడానికి దోహదపడ్డాయి. అంతే తప్ప అందులో పీకే గొప్పతనం ఏమీ లేదు. కాకపోతే కమ్మ వర్గంపై మిగిలిన అన్ని వర్గాల్లోనూ ద్వేషం నింపి, ఆ కులాన్ని ఒంటరిని చేయడం, నియోజకవర్గాల్లో గట్టి వారిని వెదికి అభ్యర్ధులుగా సూచించడంలో మాత్రం పీకే సక్సెస్ అయ్యారన్నది మాత్రం నిజం.

ఆ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ బలహీనమైనవే. జనసేన మీటింగులకు జనం వస్తారే తప్ప, ఓట్లు రావు. జనం కూడా జగన్‌కు ఓసారి అవకాశం ఇచ్చి చూద్దామన్న మూడ్‌లో ఉన్నారు. వైసీపీ కూడా టీడీపీని ధైర్యంగా ఎదుర్కొనే స్థాయికి చేరింది. ఆర్ధిక వనరులు దండిగా సమకూరాయి. పక్క రాష్ట్ర సీఎం కేసీఆర్ కూడా ఓ చేయి వేశారు. తెలంగాణ నుంచి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులూ ఆంధ్రా నియోజకవర్గాలకు సొమ్ములు పంపించడంలో సక్సెస్ అయ్యారు. బాబు తన అభ్యర్ధులకు సొమ్ములు, ముందుగానే సర్దుబాటు చేయకుండా మీనమేషాలు లెక్కబెట్టారు. తీరా ఎన్నికల సమయానికి, డబ్బులు సర్దుబాటు చేసే మార్గాలన్నీ మూసుకుపోయాయి. సో.. సహజంగా అప్పటికే 67 సీట్లు సాధించిన వైసీపీ భుజంపైకి పీకే ఎక్కేశారు. ఇప్పుడు అర్ధమయిందా? చీకట్లో కన్ను కొట్టే పీకే వ్యూహం.

ఒకవేళ తాను పనిచేసిన పార్టీ ఓడిపోతే..‘ నేను చెప్పినట్లు ఆ పార్టీ నాయకత్వం పనిచేయలేదు. అందుకే ఓడింది. కాబట్టి ఆ ఓటమితో నాకు సంబంధం లేద’ని నిర్భయంగా చెప్పేసే రకం. మొన్నీమధ్య కాంగ్రెస్‌తో జరిగిన యవ్వారం కూడా సేమ్ టు సేమ్. కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధపడ్డ పీకే, ఆ పార్టీ పెద్దతలలతో భేటీలు వేశాడు. కొన్ని గెలుపు చిట్కాలిచ్చాడు. పోనీ ఇచ్చిన వాడు ఇచ్చినట్లు ఉండక.. రాహుల్‌గాంధీని పక్కనబెట్టాలని, సుబ్బారావును తెరపైకి తీసుకురాలని, అసలు గాంధీ ఫ్యామిలీనే తెరపైకి రాకుండా పగ్గాలు ఇతరులకివ్వాలన్న సలహాలేవో ఇచ్చారట. సరే.. వచ్చిన వాడిని నారాజ్ చేయడమెందుకని, పార్టీలో చేరితే ఒక పదవి ఇస్తామే తప్ప.. మొత్తం పార్టీని నీ చేతుల్లో పెట్టి నువ్వు చెప్పింది చేయలేమని, కాంగ్రెస్ వృద్ధజంబూకాలు తేల్చాశాయట. పైగా పీకేకు సొమ్ములు కురిపించే ఐప్యాక్ దుకాణం బందు చేయమన్నారట. దానితో తన ప్లాన్ వర్కవుటు కాదని గ్రహించి, తూచ్.. తన ఫార్ములాకు కాంగ్రెస్ ఒప్పుకోనందువల్ల, తాను ఆ పార్టీలో చేరటం లేదు అని చావుకబురు చల్లగా చెప్పారు. పీకే ఆ చావుకబురును చల్లగా చెబుతారని ‘సూర్య’ అంతకుముందురోజే తన కథనంలో స్పష్టం చేసింది.ఇదికూడా చదవండి.. కాంగ్రెస్‌కు జెల్లకొట్టిన ప్రకాంత్‌కిశోర్!

 

 

Leave a Reply