Suryaa.co.in

Telangana

నియోజకవర్గ ప్రజల విజయం

– తలసాని

ప్రజాతీర్పును గౌరవిస్తామని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం ఉస్మానియా యునివర్సిటీ లో కాలేజ్ ఆఫ్ కామర్స్ లోని కౌంటింగ్ కేంద్రం వద్ద అధికారులు ఫలితాలు ప్రకటించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను సనత్ నగర్ నుండి మూడోసారి గెలిచానన్న సంతోషం కంటే ప్రభుత్వంలోకి రాలేకపోతున్నామనే బాధ ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న కాంగ్రెస్ పార్టీకి ఆయన అభినందనలు తెలిపారు.

దేశానికి స్వాతత్ర్యం వచ్చిన 75 సంవత్సరాలలో జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ నాయకత్వంలో గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాలలో జరిగిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో త్రాగు, సాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారని, విద్యుత్ సరఫరా ను కూడా ఎంతో మెరుగుపరచి 24 గంటల పాటు ఇవ్వడం జరిగిందని వివరించారు. అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని వివరించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ప్రతిపక్షపాత్రను బాధ్యతగా పోషిస్తామని చెప్పారు.

మినీ ఇండియా గా పిలువబడే హైదరాబాద్ నగరంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ఎంతో అభివృద్ధి చేసిందని చెప్పారు. హైదరాబాద్ లో మున్సిపల్ శాఖా మంత్రిగా కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలతో స్పష్టమైన మెజార్టీని సాధించామని చెప్పారు. నూతనంగా ఏర్పడే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని, ప్రజలు ఆశించిన పాలనను అందిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. తనపై పోటీలో నిలిచి ఓటమి చెందిన కాంగ్రెస్ అభ్యర్ధి కోట నీలిమ, బీజేపీ అభ్యర్ధి మర్రి శశిధర్ రెడ్డిలకు మంత్రి తన సానుభూతిని తెలిపారు. రాజకీయాలలో గెలుపు, ఓటములు సహజమని, ఓటమి చెందామని అదైర్యపడొద్దని చెప్పారు. ఎన్నికల సందర్బంగా భాగస్వాములైన వివిధ శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులకు అభినందనలు తెలిపారు.

నియోజకవర్గ ప్రజల విజయం ….
తన గెలుపు సనత్ నగర్ నియోజకవర్గ ప్రజల విజయం అని, అది వారికే అంకితం అని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ లోని సెంటర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో కౌంటింగ్ నిర్వహించారు. ఈ ఫలితాలలో తలసాని శ్రీనివాస్ యాదవ్ 41,827 ఓట్ల మెజార్టీతో గెలిచినట్లు అధికారులు ప్రకటించిన అనంతరం రిటర్నింగ్ అధికారి కిషన్ రావు చేతులమీదుగా దృవీకరణ పత్రాన్ని అందుకున్నారు.

కౌంటింగ్ సెంటర్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న బి.ఆర్.ఎస్ పార్టీ శ్రేణులు ఆయనను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు. తన గెలుపుకు కృషి చేసిన, సహకరించిన నియోజకవర్గ ప్రజలకు, ఓటర్లకు, పార్టీ శ్రేణులకు ఆయన అభినందనలు తెలిపారు.

LEAVE A RESPONSE