-బీజేపీలో రాములమ్మ ఇమడలేకపోతున్నారా?
– ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై అ‘శాంతి’
– తనకు బాధ్యతలు అప్పగించకపోవడంపై గతంలోనే అసంతృప్తి
– పార్టీ స్థాపించిన తన స్థాయికి బీజేపీ సరిపోవడం లేదన్న అసంతృప్తి
– గౌరవం ఇవ్వకపోవడంతో రగిలిపోతున్న రాములమ్మ
– తన సేవలు వినియోగించుకోని పార్టీలో కొనసాగేందుకు విముఖత?
– తెలంగాణలో ఇమేజ్ ఉన్న తనకు ఆ స్థాయిలో స్థానం లేకపోవడంపై ఆవేదన
– ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతికి ఇస్తే బాగుండేదంటున్న కమలదళాలు
– కిరణ్‌కుమార్‌రెడ్డి రాకపై బహిరంగ అసంతృప్తి
– వేదిక నుంచి వెళ్లిపోయి అ‘శాంతి’తో ట్వీట్
-తాజాగా మణిపూర్ అల్లర్లపైనా అ‘శాంతి’ ట్వీట్
– ‘కమలవనం’లో ఇమడలేకనే ఆ అ‘శాంతి’ వ్యాఖ్యలు?
– బీజేపీకి విజయశాంతి గుడ్‌బై చెబుతారా?
-కాంగ్రెస్‌లో చేరతారంటూ చర్చలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆమె తెలంగాణ రాజకీయాల్లో ఒక ఫైర్ బ్రాండ్. ఇమేజ్-గ్లామర్ జమిలిగా ఉన్న అతికొద్దిమంది నేతల్లో ఆమె ఒకరు. ఒకప్పుడు ‘తల్లి తెలంగాణ’ పార్టీని పుట్టించిన అధినేత్రి. కేసీఆర్‌తో.. ‘తన పదో చెల్లి’ అనిపించుకున్న మహిళా నేత. మళ్లీ అదే కేసీఆర్‌పై తిరగబడిన ఆడ బొబ్బులి. సీనియర్ పొలిటికల్ హీరోయిన్. ఆమె ప్రసంగాల్లో పంచ్ ఉంటుంది. పొగిడినా, తెగిడినా అంతా ఓపెనే. ఎక్కడా దాపరికాలు ఉండవ్.
అలాంటి ఆమెకు ఇప్పుడు ఆ పార్టీలో పెద్దగా గుర్తింపు లేదు. నలుగురితోపాటు నారాయణ, ఐదుగురుతోపాటు ఆదినారాయణ! ఆ పార్టీలోని డజన్లమంది నేతలలో ఒకరు. తన స్థాయికి త గ్గ గౌరవం దొరకడం లేదన్న ఒక అ ‘శాంతి’. తన ఇమేజ్‌కు తగిన పదవి లేదన్న ఇంకో అ‘శాంతి’. తన సేవలు వాడుకోవడం లేదన్న మరో పెద్ద అ‘శాంతి’. ఇంత అశాంతితో రగిలిపోతున్న ఆమె పేరు విజయశాంతి! బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యులలో ఒకరు!!
కొన్ని డజన్ల మంది పార్టీ ప్రముఖులలో ఆమె ఒకరు. ఇప్పుడామె సంధిస్తున్న అ‘శాంతి’ అస్త్రాలు.. ‘కమలవనం’ నుంచి నిష్క్రమించే సంకేతాలా? రాములమ్మ పువ్వుపార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారా? ఇదీ ఇప్పుడు తెలంగాణ బీజేపీలో హాట్‌టాపిక్.
బీజేపీ నేత విజయశాంతి ఆ పార్టీ నుంచి నిష్క్రమించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా? అందుకే సొంత పార్టీ నిర్ణయాలను ప్రశ్నిస్తూ, నిరసన-అసంతృప్తితో కలిపిన స్వరం వినిపిస్తున్నారా? కొద్దికాల వ్యవథిలో ఆమె సంధించిన రెండు ట్వీట్లను పరిశీలిస్తే.. ఈ అనుమానాలు నిజమేననిపించకమానవు.
తెలంగాణను అడ్డుకున్న సమైక్యాంధ్ర చివరి సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని.. తెలంగాణ పార్టీ ఆఫీసులో జరిగిన సభకు ఆహ్వానించడాన్ని, విజయశాంతి సహించలేకపోయారు. కిషన్‌రెడ్డి ఆయనను తన పక్కనే కూర్చోబెట్టుకోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయారు.
దానితో వేదిక నుంచి వెళ్లిపోయి, ‘తెలంగాణను అడ్డుకున్న వారున్న వేదికపై ఉండలేకపోయాను’ అని చేసిన ట్వీట్ సంచలనం సృష్టించింది. అది ప్రత్యక్షంగా కిరణ్‌కుమార్‌రెడ్డిని, పరోక్షంగా బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని తాకింది. ఆమె వైఖరిని ఇప్పటిదాకా పార్టీలో, ఎవరూ తప్పుపట్టే సాహసం చేయలేకపోయారు. ఇది కూడా చదవండి: కమలానికి ‘కిరణ్’ కష్టాలు!
తాజాగా మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న దారుణాలు సమాజం తలదించుకునేలా ఉన్నాయంటూ ట్వీట్ చేశారు. తాజా విజయశాంతి ట్వీట్ బీజేపీని రాజకీయంగా ఇరుకునపెట్టింది. నిజానికి మణిపూర్‌లో అధికారం ఉన్నది బీజేపీ కావడమే దానికి కారణం.
ఓవైపు దేశంలోని విపక్షాలన్నీ మణిపూర్‌లోని బీజేపీ సర్కారును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆ ఘటనలపై ప్రధాని పెదవి విప్పాలని లోక్‌సభను అట్టుడికిస్తున్నాయి. ఈ సమయంలో సొంత పార్టీకే చెందిన విజయశాంతి, తన పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రంలో జరుగుతున్న ఘటనను ఖండించటమే.. అ‘శాంతి’ రేకెత్తించిన చర్చకు కారణం.
కాగా తెలంగాణలో పార్టీ నాయకత్వ వైఖరిపై, విజయశాంతి చాలాకాలం నుంచీ అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఒక రాజకీయపార్టీ స్థాపించి, ఎంపిగా గె లిచి, కేసీఆర్‌నే ఢీకొన్న తన స్థాయికి తగ్గ.. ప్రాధాన్యం-గౌరవం లభించడం లేదన్నది ఆమె అసంతృప్తికి ప్రధాన కారణం. తనకు బాధ్యతలు అప్పగించడం లేదని, గతంలోనే ఆమె బహిరంగంగా వాపోయారు.
‘తనకు ఎందుకు బాధ్యతలు ఇవ్వడం లేదో మీరే పార్టీని అడగండి’ అంటూ, విజయశాంతి, గతంలో మీడియాను ప్రశ్నించారు. దీన్నిబట్టి విజయశాంతి అశాంతికి, కారణమేమిటన్నది స్పష్టమవుతోంది. పార్టీ అధ్యక్షులుగా వచ్చినవారంతా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఏ సందర్భంలోనూ తమ అభిప్రాయాలు తెలుసుకోవడం లేదన్న అసంతృప్తి, అందరు నేతల మాదిరిగానే.. ఆమెలోనూ కనిపిస్తోంది.
ప్రధానంగా తన లాంటి ఇమేజ్ ఉన్న నేతకు.. పార్టీలో ఎలాంటి బాధ్యతలు అప్పగించకుండా, ఖాళీగా కూర్చోబెట్టడాన్ని విజయశాంతి జీర్ణించుకోలేకపోతున్నారు. జనంలో ఇమేజ్ ఉన్న ఆమెకు ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యత అప్పగిస్తే బాగుంటుందని, అటు కమలదళాలు కూడా సూచిస్తున్నాయి. దానివల్ల పార్టీకి మేలు జరుగుతుందంటున్నారు.
ఇప్పుడు పార్టీలో ఉన్న నేతలందరి కంటే, విజయశాంతి ఒక్కరే జనాకర్షణ ఉన్న నేత అని గుర్తు చేస్తున్నారు. ఆమె సినీ గ్లామర్- పొలిటికల్ ఇమేజ్‌ను వినియోగించుకోవటంలో, నాయకత్వం విఫలమయిందని కమలదళాలు అంగీకరిస్తున్నాయి.
కాగా విజయశాంతి కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతోంది. బీజేపీ-బీఆర్‌ఎస్ ఒక్కటేనని, అందుకే ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్టు చేయడం లేదన్న చర్చ, ఇప్పటికే జనక్షేత్రంలోకి వెళ్లింది. దానితో బీజేపీలో చేరికలు చతికిలపడి, ఉన్న నేతలే కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి. బీజేపీ జాతీయ నాయకత్వఈ సర్దుబాటు వైఖరిపై అగ్రనేతలు సైతం సంతృప్తిగా లేరు. ఇది కూడా చదవండి: ‘కిషన్‌రెడ్డి’ ‘కమలం’ వికసిస్తుందా?
ఈ క్రమంలో తెలంగాణ రాజకీయ పరిణామాలు పరిశీలిస్తున్న రాములమ్మ.. తన స్థాయికి కాంగ్రెస్ మాత్రమే, సరైన వేదిక అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తన వ్యాఖ్యలు పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందుకు వెళ్లకముందే, విజయశాంతి ఒక నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు.