Suryaa.co.in

Andhra Pradesh

గిరిజనుల అభ్యున్నతే మా ప్రభుత్వ ధ్యేయం

– రాజ్యసభలో స్పష్టం చేసిన విజయసాయి రెడ్డి

న్యూఢిల్లీ, జూలై 25: గిరిజనుల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని వైఎస్సార్సీపీ సభ్యులు రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.

షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ ఆర్డర్‌ అయిదవ రాజ్యాంగ సవరణ బిల్లుపై మంగళవారం సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడైనా గిరిజనులకు మేలు చేకూర్చే ఎలాంటి చర్యలనైనా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సమర్ధిస్తుంది, అందుకు సంపూర్ణ సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. అంతకుముందు సభలో టీడీపీ సభ్యుడు చేసిన ఆరోపణలను ఆయన ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత గిరిజనుల అభ్యున్నతి కోసం చేపట్టిన పలు చర్యలను వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌లోకు మంజూరు చేసిన గిరిజన విశ్వవిద్యాలయాన్ని గిరిజన నివాసిత ప్రాంతంలోనే నెలకొల్పేందుకు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రత్యేక చొరవ చూపారని అన్నారు. ఇందుకోసం ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఒప్పించారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అవసరమైన వందలాది ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. గిరిజన యూనివర్శిటీ భవనాలు, క్యాంపస్ నిర్మాణం ప్రారంభమైందని విజయసాయి రెడ్డి చెప్పారు.

అలాగే అనాదిగా వైద్య, ఆరోగ్య సౌకర్యాలకు నోచుకోని గిరిజనుల కోసం ఏజెన్సీ ప్రాంతమైన పాడేరులో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రితో కూడిన వైద్య కళాశాల నిర్మాణానికి పూనుకున్నారు. పోడు వ్యవసాయమే గిరిజనుల జీవనాధారం అయినందున అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద పోడు సాగు చేసే భూములకు పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమానికి అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి శ్రీకారం చుట్టారు.

1 లక్షా 30 వేల ఎకరాల్లో 55 వేల మంది గిరిజనులకు పట్టాల పంపిణీ జరిగిందని విజయసాయి రెడ్డి ఉద్ఘాటించారు. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ గిరిజను సంక్షేమాన్ని గాలికి వదిలేసింది. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారం చేపట్టాక పోడు సాగు చేసే గిరిజనులకు తిరిగి పట్టాల పంపిణీ కార్యక్రమైన్ని ప్రారంభించింది.

ఎస్టీ జాబితాలోకి వాల్మీకి, బోయ కులాలను చేర్చాలి…
మైదాన ప్రాంతంలో ఆర్థికంగా, సామాజికంగా బాగా వెనుకబడిన వాల్మీకి, బోయ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఈ ఏడాది మార్చిలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. దీనిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోవలసి ఉందని విజయసాయి రెడ్డి అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 డి కింద ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం జరిగింది.

దాని ప్రకారం ఎస్టీ జాబితాలోని కులాలకు 7 శాతం రిజర్వేషన్‌ కల్పించారు. కొత్తగా ఏదైనా కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడం వలన జానాభా ప్రాతిపదికపై రిజర్వేషన్‌ పరిమితిని పెంచాల్సి ఉంటుంది. కాబట్టి అప్పటికే ఎస్టీ జాబితాలో ఉన్న కులాలకు ఎలాంటి అన్యాయం జరగదని ఆయన అన్నారు.

మహిళలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తోంది.
లోక్‌ సభ నుంచి మొదలు పెట్టి స్థానిక సంస్థల వరకు మహిళలకు 50 శాతం స్థానాలను రిజర్వ్‌ చేయడం వలన గిరిజనులకు తమకు కేటాయించిన 7 శాతం రిజర్వేషన్‌ కాకుండా అదనంగా చట్ట సభల్లో ప్రాతినిధ్య వహించే అవకాశం దక్కుతుందని విజయసాయి రెడ్డి అన్నారు.

LEAVE A RESPONSE