November 10, 2026

విజయనగరంలో వెన్నుపోట్లు?

  • మంత్రి శ్రీనివాస్, కళాకు చెక్ పెట్టే వ్యూహం?
  • కళా కోడలికి జడ్పీ చైర్మన్ రాకుండా ముందస్తు కుట్ర?
  • మంత్రి శ్రీనివాస్, కళా వెంకట్రావు నియోజకవర్గాల్లో నాలుగు జడ్పీటీసీలు వైసీపీ పరం
  • వైసీపీ నుంచి చేరని కీలక నేత అనుచరులు
  • పోలింగుకు ముందు నుంచే శ్రీనివాస్, కళా నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్ధులకు కీలక నేత తెరచాటు మద్దతు?
  • చరిత్రలో ఎప్పుడూ ఓడని గరివిడి, గుర్ల మండలాల్లో తొలిసారి ఓటమికి కారకులెవరు?
  • బొత్స కోడలు, చెల్లి విజయం వెనక ఉన్న ఆ టీడీపీ అదృశ్యశక్తి ఎవరు?
  • బొత్స కూతురును సొంత కుటుంబసభ్యులే ఓడించారా?
  • ఆ నాలుగు మండలాల్లో ఓటమిపై విచారణ జరపాల్సిందేనంటున్న తముళ్లు
  • విజయనగరం తమ్ముళ్ల గరం గరం

( మార్తి సుబ్రహ్మణ్యం)

తాజాగా జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా విజయఢంకా మోగించి మీసం మెలేస్తే.. టీడీపీకి తిరుగులేని పట్టున్న విజయనగరంలో, ఎప్పుడూ ఓటమి ఎరగని ఆ రెండు జడ్పీటీసీలు… ఆ రెండు నియోజకవర్గాల్లోని నాలుగు జడ్పీటీసీలు ఓడిపోవడం తమ్ముళ్లను ఖంగుతినిపించింది.

దానికి తెరవెనక జరగిన వెన్నుపోట్లే కారణమని, ఇటీవల టీడీపీలో చేరిన ఓ నేత చక్రం తిప్పిన ఫలితంగానే, ఆ రెండు నియోజకవర్గాల్లో పార్టీకి ఓటమి ఎదురయిందని తమ్ముళ్లు బాహాటంగానే విరుచుకుపడుతున్నారు.

ఈ పరాభవం వెనక జరిగిన వెన్నుపోట్లపై, అంతర్గత విచారణ జరపాల్సిందేనని టీడీపీ సీనియర్లు పట్టుపడుతున్నారు. కొత్తగా ప్రవేశించిన ఈ వెన్నుపోటు రాజకీయ సంస్కృతికి ఇప్పుడే చెక్ పెట్టకపోతే, భవిష్యత్తులో ఈ సంప్రదాయమే పార్టీని నష్టపరుస్తుందని స్పష్టం చేస్తున్నారు.

ఉత్తరాంధ్రలో టీడీపీకి గట్టి పట్టున్న జిల్లాల్లో ఒకటయిన విజయనగరం జిల్లాలో.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజపతినగరం, జామి మండలాలు; మాజీ మంత్రి కళా వెంకట్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గరివిడి, గుర్ల మండలాలు వైసీపీ పరం కావడం వెనక వెన్నుపోట్లే కారణమని కూటమి వర్గాలు బహిరంగంగానే చర్చించుకుంటున్నాయి.

ప్రధానంగా కళా వెంకట్రావు కోడలు విజయం సాధిస్తే, జడ్పీ చైర్మన్ అవుతారన్న ప్రచారం తొలి నుంచీ ఉన్నదే. ఆ ప్రకారంగా ఆమె చైర్మన్ కాకుండా, తన కుటుంబం నుంచి చైర్మన్ కావాలన్న లక్ష్యంతో.. ఇటీవల పార్టీలో చేరిన ఓ కీలకనేత, అక్కడ వెన్నుపోటు రాజకీయాలు నడిపారని కూటమి నేతలు బాహాటంగానే ఆరోపిస్తున్నారు.

అదేవిధంగా మంత్రి కొండపల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని రెండు మండలాల్లో పార్టీని ఓడించడం ద్వారా, కొండపల్లిని బలహీనం చేసి.. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అయి, మంత్రి కావాలన్న సుదూర లక్ష్యంతో.. మంత్రి నియోజకవర్గంలోనూ సదరు కీలక నేత చక్రం తిప్పినట్లు కూటమి వర్గాలు మండిపడుతున్నాయి.

అందుకు తగినట్లుగానే.. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సదరు కీలక నేతకు ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రిని చేస్తారన్న ప్రచారం ఉధృతంగా జరుగుతున్న విషయం తెలిసిందే.

మొత్తంగా జిల్లాలో తూర్పు కాపుల్లో పెద్ద దిక్కుగా ఉన్న కళా, యువనేత మంత్రి కొండపల్లిని వారి నియోజకవర్గంలో ఓడించడం ద్వారా.. వారికి సొంత నియోజకవర్గాల్లోనే పట్టు లేదన్న ప్రచారం కల్పించి, భవిష్యత్తులో వారిద్దరినీ లౌక్యంగా తప్పించడమే సదరు కొత్త కీలక నేత అసలు వ్యూహమని టీడీపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

అయితే నిజంగానే కళా వెంకట్రావు రాజకీయంగా బలహీనపడితే.. వైసీపీ కంచుకోటలయిన చీపురుపల్లి, మెరకముడిదంలో టీడీపీ జెండా ఎగరవేసినప్పుడు ఎందుకు ఓడిపోతారన్న కొత్త లాజిక్కును చీపురుపల్లి టీడీపీ వర్గాలు తెరపైకి తీసుకువస్తున్నాయి.

ఇక గజపతినగరం జడ్పీటీసీని బీజేపీకి కేటాయించవద్దని, అక్కడ బీజేపీ గెలవడం కష్టమని మంత్రి కొండపల్లి పార్టీ నాయకత్వానికి స్పష్టం చేశారని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఒత్తిళ్లకు లొంగి, ఆ సీటును బీజేపీకి కేటాయించడంతో ఆ ఓటమి మంత్రి ఖాతాలో చేరాల్సి వచ్చిందంటున్నారు. అక్కడ కూడా కొత్తగా చేరిన కీలక నేత చక్రం తిప్పి.. కూటమి ఓటమికి పరోక్ష కారకులయ్యారని, అటు బీజేపీ శ్రేణులు మండిపడుతున్నారు.

మంత్రి శ్రీనివాస్ తన నియోజకవర్గంలో మిగిలిన జడ్పీటీసీలను ప్రతిష్ఠగా తీసుకుబట్టే అవి గెలిచాయని, లేకపోతే అవి కూడా కొత్త నేత వెన్నుపోటు రాజకీయానికి బలయ్యేవంటున్నారు.

అసలు కొత్త కీలకనేత టీడీపీలో చేరడం తొలి నుంచి మంత్రి శ్రీనివాస్‌కు ఇష్టం లేదని, నాయకత్వానికి దగ్గరగా ఉన్న ప్రముఖులంతా సదరు నేత పక్షాన ఉండటంతో, మంత్రి శ్రీనివాస్ నిస్సహాయుడయ్యారన్న ప్రచారం అప్పుడే జరిగిన విషయం తెలిసిందే. అటు మంత్రి అనుచరులు సైతం.. సదరు కొత్త నేత, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు మళ్లీ తిరిగి వైసీపీకి వెళ్లిపోతారని అప్పుడే ప్రచారం చేశారు.

నిజానికి సదరు కీలక నేత పార్టీలో చేరిన సందర్భంలో.. ఆ రెండు నియోజవర్గాల్లోని తన అనుచరులు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరతారని, వారి చేరికతో పార్టీ బలపడుతుందని నాయకత్వానికి భరోసా ఇచ్చారట. అయితే పోలింగ్ తేదీ సమీపిస్తున్నా.. వైసీపీ నుంచి ఆయన చెప్పిన వారెవరూ టీడీపీలో ఆ స్థాయిలో చేరకపోగా, వైసీపీలోనే ఉన్న తన అనుచరుల ద్వారా నాలుగు మండలాల్లో టీడీపీ అభ్యర్ధుల ఓటమికి ఆయన, తెరవెనక చక్రం తిప్పారని సీనియర్లు చెబుతున్నారు.

‘చీపురుపల్లిలో ప్రజలు ఆయన చేరికను ఇష్టపడలేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలను వేధించి, చక్రం తిప్పిన చరిత్ర ఆయనది. ఒక మాజీ ఎమ్మెల్యే అయితే.. మా ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించిన ఆ నాయకుడితో కలసి మీలాంటి తిరిగితే మీకూ, పార్టీకి ఏమైనా పరువు ఉంటుందా? మీరు ఎమ్మెల్యే అయేంతవరకూ మా ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు. మీరు వచ్చిన తర్వాతనే కదా ఎఫ్‌ఐఆర్ చేశారు? అయినా పార్టీకి ఇలాంటి వాళ్ల చరిత్ర తెలియదా’ అని.. ప్రచారానికి వెళ్లిన కళా కుటుంబాన్ని, వందలాది కార్యకర్తల సమక్షంలో ముఖానే అడిగిన వైనం పరిశీలిస్తే.. పార్టీలో చేరిన సదరు నేతపై, టీడీపీ కార్యకర్తలు- ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో స్పష్టమవుతోందని, టీడీపీ సీనియర్లు నాయకులు కుండబద్దలు కొట్టడం ప్రస్తావనార్హం.

ఇదిలాఉండగా.. వైసీపీ జడ్పీటీసీ అభ్యర్ధులయిన బొత్స కోడలు పూజిత, గుర్లలో బొత్స సోదరి సంగంరెడ్డి వెంకటమ్మ గెలుపు వెనక.. సదరు కొత్త కీలక నేత చక్రం తిప్పి, బొత్స కుటుంబ పరువు కాపాడటంలో కీలకపాత్ర పోషించారని టీడీపీ వర్గాలే బహిరంగంగా ఆరోపిస్తున్నాయి.

నిజానికి టీడీపీ ఆవిర్భవించిన తర్వాత ఇప్పటివరకూ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గరివిడి, గుర్ల మండలాల్లో.. టీడీపీ ఒక్కసారి కూడా ఓడిపోని చరిత్ర ఉందని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.

కోట్ల నుంచి వైఎస్ వరకూ, జగన్ సీఎంగా ఉన్నప్పుడు జిల్లాలో అనేక జడ్పీటీసీలు కాంగ్రెస్, వైసీపీ పరంకాగా.. గరివిడి, గుర్ల జడ్పీటీసీలను మాత్రం టీడీపీ గెలుస్తూ వచ్చిన చరిత్రకు, ఈసారి వెన్నుపోటు రాజకీయం వల్ల చిల్లు పడటాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.

ఇదంతా తన రాజకీయ గురువయిన బొత్స- ఆయన కుటుంబపరువు నిలబెట్టాలన్న లక్ష్యంతో.. పార్టీలో కొత్తగా చేరిన కీలక నేత ఆడిన వెన్నుపోటు రాజకీయమని విజయనగరం జిల్లా టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ పరాభవంపై కచ్చితంగా విచారణ జరిపి, వెన్నుపోటుదారులపై చర్య తీసుకోకపోతే, భవిష్యత్తులో ఇక జిల్లాలో సీనియర్లు మిగలని పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

‘‘ఇప్పుడు కొత్తగా వచ్చిన నేత.. పార్టీ నాయకత్వంతో సన్నిహితంగా ఉండే వారి మద్దతుతో కులం కార్డుతో సీనియర్లకు చెక్ పెట్టి, జిల్లాలో చక్రం తిప్పాలన్న కుట్ర కనిపిస్తూనే ఉంది. దానివల్ల అటు తాను రాజకీయంగా లాభపడటమే కాకుండా, బొత్స కుటుంబాన్నీ రాజకీయంగా రక్షించి కుటుంబ ప్రయోజనాలు కాపాడటమే అసలు లక్ష్యం. మరి ఈ వాస్తవాలన్నీ ఇక్కడ చిన్న స్థాయి కార్యకర్తకూ తెలుసు. పార్టీ నాయకత్వానికి తెలియకపోవడమే ఆశ్చర్యంగా ఉంది’’ అని ఉమ్మడి విజయనగరం జిల్లా మాజీ ఎమ్మెల్యే ఒకరు విస్మయం వ్యక్తం చేశారు.

లిక్కర్ కేసులో డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయిన కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు పార్టీలో చేరిన వాళ్లు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకూ తమ పార్టీలోనే ఉంటారన్న నమ్మకం తమకు లేదని, కేవలం నాయకత్వానికి దగ్గరగా ఉండే ప్రముఖుల ద్వారా.. ఈ మూడేళ్లు రాజకీయ లబ్ది పొంది, ఎన్నికలకు ముందు మళ్లీ వైసీపీలో చేరినా ఆశ్చర్యం లేదని, పార్టీ వర్గాలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు.

‘‘నిజంగా కొత్తగా చేరిన సదరు నేతకు పార్టీపై ప్రేమ- చిత్తశుద్ధి ఉంటే జగన్, బొత్సపై ఇప్పటివరకూ ఒక్క విమర్శ కూడా ఎందుకు చేయలేదు? విజయనగరం జిల్లాలో బొత్స అవినీతిపై టీడీపీ నేతలంతా మాట్లాడుతుంటే, కొత్తగా చేరిన ఆయనెందుకు మాట్లాడరు? జగన్‌పై బాబు నుంచి కళా వెంకట్రావు, మంత్రి శ్రీనివాస్ వరకూ విమర్శలతో విరుచుకుపడుతుంటే.. కొత్తగా చేరిన ఆయన మాత్రం ఇప్పటివరకూ జగన్‌పై పల్లెత్తు విమర్శ ఎందుకు చేయలేదు? ఇది సరిపోదా? ఆయన టీడీపీలో అవసరార్ధం చేరారా? పార్టీపై ప్రేమతో చేరారా చెప్పడానికి’’ అని సీనియర్లు కొత్త లాజిక్‌ను తెరపైకి తీసుకువస్తున్నారు.

బొత్స కూతురికి కుటుంబసెగ

మరి బొత్స కోడలు, చెల్లిని గెలిపించిన సదరు కీలక నేత.. బొత్స కూతురుని కూడా గెలిపించాలి కదా? ఆమె ఎందుకు ఓడిపోయింది అన్న ప్రశ్న తెరపైకి రావడం సహజం. కానీ అందుకు స్థానికంగా ఉన్న కారణాలు వేరని టీడీపీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు.

అక్కడ వెలమ సామాజికవర్గం సంఖ్య ఎక్కువగా ఉండటంతోపాటు.. బొత్స సొంత కుటుంబసభ్యులే ఆయన కూతురు ఓటమికి పరోక్ష కారకులయ్యారని చెబుతున్నారు. అక్కడ ఆమె గెలిస్తే, భవిష్యత్తులో తమ సొంత కుటుంబ వారసుల రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుందన్న ముందస్తు వ్యూహమే, బొత్స కూతురు ఓటమికి అసలు కారణమని విశ్లేషిస్తున్నారు.

Total Visitors: 3,329,062