- ఆంధ్రాలో అధికారమన్నా ఉండాలి లేకుంటే కేంద్రంలోని పాలకపక్షం అండైనా ఉండాలనే స్థాయికి దిగజారుతున్న తెలుగుదేశం
- (విజయసాయిరెడ్డి, ఎంపీ)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు అమరావతిలో అధికారం లేక, హస్తినలోని బీజేపీ సర్కారుతో దోస్తీ లేక చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే ఆయన తెలుగుదేశం పార్టీ ఏ క్షణంలోనైనా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలోకి ఎంట్రీ సంపాదిస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. తన మాట వినే పసుపు పచ్చ పత్రికలతో, టీవీ చానళ్లతో ఈ విషయంపై కథనాలు అల్లిస్తున్నారు.
బాబుగారి రాజకీయ క్రీడలు హైదరాబాద్, అమరావతిలో మాత్రమే కొన్నాళ్లు నడిచాయి. కేంద్రంలో 1996–98 మధ్య యునైటెడ్ ఫ్రంట్ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు తన పార్టీ ఎంపీలను అందులో మంత్రులు కావడానికి అనుమతిచ్చారు. ఈ కారణంగా ఢిల్లీ సర్కారులో తెలుగుదేశం ప్రధాన భాగస్వామి అయినట్టు ఆయన హైదరాబాద్‌లో కబుర్లు చెప్పేవారు. 1999 మధ్యంతర ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో బీజేపీ (ఎన్డీఏ) కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు దానికి బయటి నుంచి మద్దతు ఇచ్చారు.
ఎన్నికల్లో పొత్తు ఉన్నాగాని, కేంద్ర ప్రభుత్వంలో చేరలేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో దాన్ని బట్టి వ్యవహరించాలనే చంద్రబాబు అతి తెలివితేటలే , అప్పటి ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం చేరకపోవడానికి కారణం. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన విభజిత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి, అధికారం పదేళ్ల తర్వాతైనా సంపాదించాలనే యావతో బీజేపీతో పెట్టుకున్న పొత్తు ఫలించింది. చివరిసారి ఆయన సీఎం కావడానికి అది దోహదం చేసింది. ఒకపక్క జనసేన, మరోపక్క బీజేపీ చేయూతతో గెలిచిన టీడీపీ 2019లో ఒంటరిగా పోటీచేసి ఓడిపోయింది.
ఆ ఓటమి భయమే ఇప్పుడు చంద్రబాబును వెంటాడుతోంది. అందుకే ఎలాగైనా బీజేపీకి దగ్గరై ఎన్డీఏలో చేరాలనే ఆతృత ఆయనలో కనపడుతోంది. చంద్రబాబు నమ్మదగిన రాజకీయ నేస్తం కాదని 1999–2004 మధ్య ఏబీ వాజపేయికి, 2014–2019 మధ్య ప్రధాని నరేంద్రమోదీకి అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. అయినా, ఉనికి కోసం బీజేపీతో రాజకీయ పొత్తుకు చంద్రబాబు వెంపర్లాడుతున్నారని ఐదున్నర కోట్ల ఆంధ్రులకు అర్ధమౌతోంది.