దొంగే దొంగా .. దొంగ అన్నట్లుగా వైకాపా నేతల తీరు
ఎవర్ని ఏమి అనకముందే … మమ్మల్ని కొట్టారంటూ ఢిల్లీలో విజయసాయి పెడబొబ్బలు
ఏమీ జరగకుండానే వాళ్ళు చేసినట్లుగానే ఈ ప్రభుత్వంలోనూ దాడులు చేస్తారనే భయంతోనే ఈ రకమైన ప్రకటనలు
ఒకటి, అర సంఘటనలు జరిగితే అవి వ్యక్తిగత దాడులే తప్ప పార్టీల ప్రమేయం లేదు
ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు
దొంగే దొంగా దొంగ అన్నట్లుగా వైకాపా నేతలు వ్యవహరిస్తున్నారని ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. ఎవర్ని ఏమి అనకముందే, మమ్మల్ని కొట్టారని ఢిల్లీలో విజయసాయిరెడ్డి , ఇతర నాయకులు చేసిన ప్రకటన చూస్తే హాస్యాస్పదంగా ఉందన్నారు.
గురువారం నాడు రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఒక ఎంపీ పై తప్పుడు కేసు నమోదు చేసి, పట్టపగలే ఇంట్లో నుంచి అపహరించి తీసుకువెళ్లి, అర్ధరాత్రి చావబాదినట్లుగా ఆధారాలున్నా సరే గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. వాళ్లు ఎంత దుర్మార్గులో నాకన్నా తెలిసిన వారు మరెవరు ఉండరని అన్నారు.
కొంతమందిని అన్యాయం గా గత ప్రభుత్వ హయాంలో చంపేశారని , ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని అపహరించి చితకబాదరంటే వాళ్లు ఎంతటి దుర్మార్గులో ఇట్టే తెలిసిపోతుందన్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లుగా నా ఫ్లెక్సీ కూడా కట్టకుండా అడ్డుకున్నారు. ఎవరైనా అభిమానంతో ఫ్లెక్సీ కడితే వారికి పోలీసులు ఫోన్లు చేసి బెదిరించేవారు. ఇలా ఎన్నో దుర్మార్గాలు చేసినవారు ఇప్పుడు ఏమి జరగక ముందే , ఏదో జరిగిపోతుందనే భయంతో ముందుగానే తమని కొడుతున్నారని, చంపేస్తున్నారని పెడ బొబ్బలు పెడుతున్నారని రఘురామకృష్ణం రాజు విమర్శించారు.
ఒకటి, అర సంఘటనలు జరిగితే జరిగి ఉండవచ్చు. అది పార్టీలకు సంబంధం లేదు. ఇద్దరి వ్యక్తుల మధ్య ఏవైనా మనస్పర్ధలు ఉంటే ఘర్షణ పడి ఉండవచ్చు. ఇద్దరిలో దెబ్బలు తగిలిన వ్యక్తికి వైకాపా ముసుగు తగిలించి, వైకాపా వారిని చంపేశారంటూ పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు.
అంచనాలు తప్పాయి
ఎన్నికల అనంతరం వైకాపా పార్టీ సంక నాకి పోబోతుందని నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నానని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. ఎన్నికల్లో ఆ పార్టీకి ఓ పాతిక సీట్లు మాత్రమే వస్తాయని ఎన్నోసార్లు చెప్పానని పేర్కొన్నారు. అయితే ఆ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే పరిమితమయిందని , తన అంచనా కూడా తప్పిందని రఘురామ కృష్ణంరాజు అంగీకరించారు.
ఎన్నికల అనంతరం వైకాపా నేతల మాటలు విని ఎవరైనా పందాలు కాస్తారేమోనని చెప్పి, ఓట్లు పడిపోయాయి పరిస్థితి దారుణంగా ఉందని… పందాలు కాయవద్దని హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. వైకాపా నేతల మాటలు విన్నవారు పందాలు కాసి కొంతమంది ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకున్నారని, దానికి కూడా వైకాపా అధికారంలోకి రానందువల్లే మనస్థాపంతో వారు ఆత్మహత్యలు చేసుకున్నారని వక్ర భాష్యాన్ని చెప్పే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బహుశా జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర 2.0 చేపడుతారేమోనని ఎద్దేవా చేశారు.
ఇకపై జగన్మోహన్ రెడ్డి గురించి వ్యక్తిగతంగా నేనేమీ మాట్లాడను
జగన్మోహన్ రెడ్డి గురించి ఇకపై వ్యక్తిగతంగా నేనేమి మాట్లాడ దల్చుకోలేదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి భాషలోనే చెప్పాలంటే… మంచో చెడో ఆయన చేయాల్సింది చేశాడు, వెళ్లిపోయాడన్నారు . ఇప్పుడు ప్రజలు గమనించేది మేము ఏమి చేస్తామని మాత్రమేనని, ప్రజలకు ఎన్నో హామీలను ఇచ్చామని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామో లేదో అన్నదానిపైనే వారు దృష్టి సారిస్తారన్నారు.
అంతేకానీ జగన్మోహన్ రెడ్డి పై, వైకాపా నాయకత్వంపై ప్రజల దృష్టి ఉండదని పేర్కొన్నారు. మేము ప్రజలకు ఇచ్చిన మాటను ప్రజలు బలంగా విశ్వసించారు. జగన్మోహన్ రెడ్డిని కాదనుకున్నారు. మేము ఊహించిన దానికన్నా ఎక్కువగా మమ్మల్ని అందలం ఎక్కించారు. ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే విషయాన్ని చెప్పారని గుర్తు చేశారు. ప్రజలు మనకు అధికారాన్ని ఇవ్వలేదు… బాధ్యతను అప్పగించారని, ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారన్నారు.
ఇతరులపై దాడులు చేయడం కరెక్ట్ కాదని, తప్పు చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలని చంద్రబాబు నాయుడు, శాసనసభ్యులకు దిశా నిర్దేశం చేశారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశాన్ని కంటే ఒక రోజు ముందే నా కస్టోడియల్ టార్చర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు.
నిన్న, మొన్నటి వరకు పోలీసులు ప్రమాణ స్వీకారోత్సవ హడావుడిలో ఉన్నారని, బహుశా నేను ఇచ్చిన ఫిర్యాదు పై ఒకటి, రెండు రోజుల వ్యవధిలో ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చునన్నారు. ఒక ఎంపీగా చిత్రహింసలు అనుభవించిన నేను, నాపై కస్టోడియల్ టార్చర్ జరిగిందని మిలిటరీ ఆసుపత్రి నివేదికలు స్పష్టంగా పేర్కొన్న తర్వాత నాకు నేను న్యాయం చేసుకోకపోతే, ఇక సామాన్య పౌరుడికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోయే ప్రమాదం ఉందన్నారు.
నాకు నేనుగా ఈ నిర్ణయం తీసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. అయితే నా వెనుక ఎవరో ఉన్నారని, పార్టీ పెద్దలు ఉన్నారనే ప్రచారం తప్పని పేర్కొన్న ఆయన, అసలు నేను ఎవరిని కలువ లేదని స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుందనే ఉద్దేశంతోనే నేను ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. కచ్చితంగా నాకు న్యాయం జరిగితే, ప్రజలకు కూడా తమకు జరిగిన అన్యాయాలపై చట్ట ప్రకారం న్యాయం జరుగుతుందనే నమ్మకం వస్తుందనేది నా విశ్వాసమన్నారు.
నా విశ్వాసం ఏమవుతుందనేది చూడాలన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంపై, మా ప్రభుత్వంపై ప్రజలు ఎంతో విశ్వాసాన్ని పెట్టుకున్నారని ముఖ్యమంత్రి చెప్పినట్లుగా అందరూ అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. కచ్చితంగా బాధ్యతాయుతంగా నడుచుకోకపోతే ఇక్కడ ఏ నాయకుడు గొప్ప కాదని ప్రజలే గొప్ప అని మరోసారి ప్రూవ్ చేశారని గుర్తు చేశారు.
20% ఓటర్లే కీలకం… వారి మనసు నొచ్చుకోకుండా ప్రవర్తించాలి
గత ఎన్నికల్లో వైకాపాకు 151 స్థానాలను ఇచ్చిన ప్రజలు, ఈసారి ఎన్నికల్లో కూటమికి 164 స్థానాలను ఇచ్చారని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. గత ఎన్నికల్లో టిడిపికి 40% ఓట్లు పోల్ కాగా, ఈసారి జగన్మోహన్ రెడ్డికి కూడా అంతే సంఖ్యలో ఓట్లు వచ్చాయని పేర్కొన్నారు. ప్రధాన పార్టీల మధ్య ఉన్న వ్యత్యాసం 20% మాత్రమేనని , ఆ 20 శాతం తటస్థ ఓటర్లే ఇంపార్టెంట్. వారే ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తారు.
మంచి జరుగుతుందనుకుంటే, ప్రజా సంక్షేమం కోసం వారు ఓటు వేస్తారన్నారు. వాళ్ల మనస్సు నోచ్చు కోకుండా, మా ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. అందులో ఎవరికి ఎటువంటి అపనమ్మకం ఉండాల్సిన అవసరం లేదన్నారు. అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలని శాసనసభ్యులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గ నిర్దేశం చేశారన్న రఘురామకృష్ణంరాజు, అది టిడిపి శాసన సభ్యులైన, ఇతర పార్టీల శాసనసభ్యులైనా ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయకపోతే ఏమవుతుందో ఇటీవల ఎన్నికల ఫలితాలలో చూశామన్నారు.
అసెంబ్లీ సమావేశాల అనంతరం గ్రామాలలో పర్యటిస్తా
వచ్చే సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయని, అసెంబ్లీ సమావేశాల అనంతరం ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో పర్యటిస్తానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తెదేపా అభ్యర్థిగా నన్ను ప్రకటించిన వెంటనే ప్రజలంతా నా విజయాన్ని కాంక్షించారు. అలాగే మీడియా ప్రతినిధులు నేను చెప్పిన మాటలను ప్రజలకు చేర్చారు. నా విజయంలో భాగస్వాములైన మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
ప్రతి గ్రామంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులను, కార్యకర్తలను కలుసుకోవడమే కాకుండా నన్ను వ్యక్తిగతంగా అభిమానించి నా విజయానికి దోహదపడిన ప్రజలందరిని కలిసి ఈ కార్యక్రమం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తానని చెప్పారు. ఈ విషయాన్ని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నానని రఘురామ కృష్ణంరాజు వివరించారు.
ఊహలలో కంటే అందమైన పల్లెటూరు పాతాళ మరక
పాతాళ మరక గ్రామాన్ని శివ వర్మ అభివృద్ధి చేసిన తీరు నాకు ఎంతో స్ఫూర్తిదాయకంగా అనిపించింది. పల్లెటూర్లు ఎంత అందంగా ఉండాలని అనుకుంటామో, ఆ ఊహలలో కంటే అందంగా పాతాళ మరక గ్రామాన్ని శివ వర్మ తీర్చిదిద్దారు. స్థానిక మంచినీటి చెరువు, స్విమ్మింగ్ పూల్ ను తలపిస్తూ పరిశుభ్రంగా ఉంటుందన్నారు.
శివ వర్మ స్ఫూర్తితో ప్రతి గ్రామంలో ఐదుగురు శివవర్మలు ముందుకు వస్తే ఉండి నియోజకవర్గం మొత్తాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దవచ్చునన్నారు. కానీ అది అంతా ఈజీ కాదని శివ వర్మ ఆయన సొంత డబ్బులు ఖర్చు చేశారన్నారు. ప్రతి గ్రామంలో డబ్బులు ఉన్నవారు ఉన్న కానీ కాన్సెప్ట్, హృదయం ఉన్నవాళ్లు తక్కువ అని, అటువంటి వారిలో సామాజిక చైతన్యాన్ని కలిగించడం ద్వారా ప్రతి గ్రామాన్ని పాతాళ మరక గ్రామం మాదిరిగానే అభివృద్ధి చేయాలి.
గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ముందు పరిశుభ్రత ఎంతో అవసరం. ఇంట్లో నుంచి చెత్త తెచ్చి రోడ్ల మీద వేయడం కరెక్ట్ కాదు. పాతాళ మరక గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయాలని కోరారు. గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ను మంత్రి పవన్ కళ్యాణ్ కు కేటాయిస్తారనే వార్తలను పేపర్లో చదివాను. అసెంబ్లీ సమావేశాలు అనంతరం పవన్ కళ్యాణ్ ను పాతాళ మరక గ్రామానికి ఆహ్వానిస్తాను. పాతాళ మరక గ్రామాన్ని వచ్చి చూడాలని, రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని ఈ ఊరును స్ఫూర్తిగా తీసుకొని అభివృద్ధి చేయాలని కోరుతానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
ఉండి నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలన్నది నా కోరిక
రాష్ట్రంలో ఉండి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలన్నదే నా కోరిక అని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. కోరికలు ఉన్నాయి… ఓపిక ఉంది… అలాగే కచ్చితంగా చేయగలననే నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మంచినీటి సమస్య, మురుగునీటి సమస్య పరిష్కారానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వనున్నట్లు తెలిపారు. మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారమే తన ప్రధాన ధ్యేయమని చెప్పారు.
కేంద్రంలోని జలశక్తి మంత్రి సి ఆర్ పాటిల్ తనకు అత్యంత సన్నిహితులని ఆయన సహకారంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఎవరికి ఆ శాఖ కేటాయించిన వారితో సమన్వయం చేసుకొని తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి నిధుల మంజూరి కోసం కృషి చేస్తానని రఘురామ కృష్ణంరాజు వివరించారు. ఇప్పటికే ఉన్న తాగునీటి పైప్ లైన్ కు మరమ్మత్తుల ద్వారా నియోజకవర్గ పరిధిలోని 45 నుంచి 46 గ్రామాల ప్రజలకు తాగునీటి సమస్య తాత్కాలికంగా పరిష్కారం అవుతుందని తెలిపారు.
ఇప్పటికే ఈ విషయమై ఇంజనీర్లతో మాట్లాడడం తో పాటు, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే మరొకసారి జిల్లా కలెక్టర్ తో సమావేశమై, ప్రస్తుత పైప్ లైన్ కు మరమ్మతులు చేపట్టే ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. తాత్కాలిక మరమ్మత్తుల కోసం చేసే ఖర్చు కూడా వృధా కాకుండా, అన్ని చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ సహకారం, పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో డ్రైనేజ్ వ్యవస్థ పూడికతీత
ప్రభుత్వ సహకారం తీసుకుని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో డ్రైనేజీ లైన్ల పూడిక తీత పనులను చేపట్టనున్నట్టు రఘురామకృష్ణం రాజు తెలిపారు. అలాగే చెరువులలో గుర్రపు డెక్క తొలగించే పనులను చేపట్టనున్నట్లు ఆయన డ్రైనేజీ కాలువల పూడికతీత పనులకు ప్రధాన ప్రాధాన్యతను ఇస్తూ, ప్రజలకు నేను ఏదైతే మాట ఇచ్చానో ఆ మాటకు కట్టుబడి ఒక పాలసీ తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ఉండి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో మూడు నాలుగు జెసిబి యంత్రాలను ప్రజలకు అందుబాటులోకి ఉంచే విధంగా కృషి చేస్తానని తెలిపారు. డ్రైనేజీ కాలువలో పూడికతీత పనులకు దాతలు ముందుకు వచ్చి సహకరించాలని కోరారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేసే దాతలకు ప్రజల్లో గుర్తింపు వచ్చే విధంగా ఎక్కడి వారిని అక్కడి గ్రామాలలో సన్మానించే కార్యక్రమం చేపడతామని చెప్పారు. దీని ద్వారా దాతలకు ఇతరులకు సహాయపడ్డామన్న సంతృప్తితో పాటు, నలుగురిలో గుర్తింపు లభించిందన్న తృప్తి మిగులుతుందని చెప్పారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనుల కోసం చేపట్టిన పాలసీని రానున్న నెల రోజుల వ్యవధిలో ఒక షేపు కు తీసుకువస్తానని చెప్పారు.
అలాగే నియోజకవర్గ అభివృద్ధిని ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించేందుకు 15 రోజులకు ఒకసారి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో ఇంటరాక్షన్ అవుతానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఈ సమావేశంలో అభివృద్ధిపై పురోగతిని వివరించడం జరుగుతుందని, దాన్ని మీడియా ప్రతినిధుల ద్వారా ప్రజలకు తెలియజేయనున్నట్లు చెప్పారు. ప్రజలకు నాయకులకు మధ్య వారధిగా వ్యవహరించే మీడియా కు ఎప్పుడూ జవాబుదారిగానే ఉంటామని తెలిపారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి పెద్ద పదవులేమి అవసరం లేదని, మంత్రులంతా తెలిసినవారేనని, నియోజకవర్గ అభివృద్ధికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్నారు.
ఉండి పట్టణంలోని టోఫెల్ వంతెన కోసం గత వైకాపా ప్రభుత్వంలోనే అనుమతులు వచ్చినప్పటికీ, కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. మరోసారి రీ టెండర్ ప్రక్రియ ద్వారా కాంట్రాక్టర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి, కాంట్రాక్టర్ కు ప్రభుత్వం మొదలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వలేని పక్షంలో, అవసరమైతే డబ్బులు అప్పుగా ఇప్పించైనా సరే వంతెన పనులను మొదలుపెట్టిస్తానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
క్షత్రియులకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారేమో… ఇవ్వరని ఎందుకు అనుకోవాలి
రాష్ట్ర మంత్రివర్గంలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారికి స్థానం కల్పించి క్షత్రియులకు అవకాశం కల్పించకపోవడాన్ని ఎలా చూస్తారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా… త్వరలోనే ఇస్తారేమో, ఇవ్వరని ఎందుకు అనుకోవాలని రఘురామ కృష్ణంరాజు ఎదురు ప్రశ్నించారు. కచ్చితంగా అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు ఓట్లు వేయకపోతే ఇంత పెద్ద విజయం సాధ్యమయ్యేది కాదన్నారు.
కూటమి కి ఇంత పెద్ద విజయం అందటంలో క్షత్రియుల పాత్ర కూడా కచ్చితంగా ఎక్కువగానే ఉంది. జనాభాపరంగా క్షత్రియులు ఒక శాతం మాత్రమే ఉండవచ్చు కానీ సమాజంలోని అన్ని వర్గాల వారికి నోట్లో నాలుక మాదిరిగా వ్యవహరించే క్షత్రియులు అంటే అందరికీ గౌరవమేనని , క్షత్రియులు కూటమి అభ్యర్థుల గెలుపు కోసం అన్ని వర్గాల వారిని ప్రభావితం చేశారన్నారు.
ఇంకా సమయం ఉంది కాబట్టి ఎవరో ఒకరికి క్షత్రియ సామాజిక వర్గం నుంచి ఏదో ఒక పదవి ఇస్తారనే అనుకుంటున్నట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అందరికీ ఒకేసారి పదవులు ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.