Suryaa.co.in

Andhra Pradesh Editorial

పరదాల దారిలో పూలవనం

నాడు పరదాల జగన్.. నేడు జనం మధ్య బాబు
– నాడు జగన్ కోసం పోలీసుల పరదాలు
– రైతులు రోడ్డెక్కకుండా పోలీసుల నిర్బంధం
– జగన్‌కు అమరావతి మహిళల మోకాళ్లపై నిలబడి నిరసన
– ఇప్పుడు బాబుకు అమరావతి రైతుల బ్రహ్మరథం
– మోకాళ్లపై నిలబడి కృతజ్ఞతలు
– అమరావతిలో విచిత్రం

( మార్తి సుబ్రహ్మణ్యం)

అమరావతి రెండు విభిన్న-వింత దృశ్యాలకు కేంద్రమయింది. అపురూప దృశ్యాన్ని ఆవిష్కరించింది. ఇద్దరు నాయకులు.. రెండు భిన్న వైఖరులు.. ఒక నేతకు నిరసనలు.. మరో నేత కు నీరా‘జనాలు’. ఐదేళ్ల క్రితం నిరసనలు, నిర్బంధాలు, లాఠీచార్జిలతో రణక్షేత్రాన్ని తలపించిన అమరావతి సీడ్‌యాక్సెస్ రోడ్డు.. ఇప్పుడు బంతిపూల వనంగా మారింది. తమకు దన్నుగా నిలిచిన ఆ నేతకు తలవంచి ప్రణమిల్లింది. అప్పుడు జగన్‌కు నిరసనలు ఆకాశాన్నంటితే.. ఇప్పుడు చంద్రబాబునాయుడును, నీరాజనాలతో ఆకాశానికెత్తిన వైచిత్రి. ఈ రెండు దృశ్యాలూ అమరావతిలోవే. రెండు దృశ్యాలూ సీడ్‌యాక్సెస్ రోడ్డులోనివే. కాకపోతే నేతలే వేరు.

అమరావతిని విధ్వంసం చేసి.. రాజధాని కోసం పొలాలు ఇచ్చిన రైతుల త్యాగాలను, వికటాట్టహాసంతో వెక్కిరించిన జగ న్.. అమరావతిని కాలగర్భంలో కలిపేందుకు చేయని ప్రయత్నాలు లేవు. అమరావతిని ‘కమ్మ’రావతిగా మార్చి, దానిపై కులముద్ర వేసేందుకు చేయని ప్రయత్నాలు లే వు. ఉద్యమకారులను పెయిడ్ ఆర్టిస్టులుగా చిత్రీకరించారు. త్యాగాల ఫలితంగా రావలసిన కౌలు కూడా ఇవ్వకుండా, మోసం చేసిన ఘనుడిగా ముద్రపడ్డారు.

అందుకే జగన్ సచివాలయానికి వెళ్లే జగన్‌కు నిరసనలు మిన్నంటాయి. రైతులు మోకాళ్లపై నిలబడి నిరసనలు తెలిపారు. జెండాలతో వెర్రిక్కించారు. ముర్దాబాద్‌లతో భీతిత్తేలా చేశారు. జగన్.. మా ఉసురు నీకు తగలక తప్పదని శపించారు. దానితో తత్తరపడి బిత్తరపోయిన జగన్.. దారివెంట పరదాలు కట్టించుకున్నారు. తనను ఎవరూ చూడకుండా, ఎదురురాకుండా పోలీసులతో బందోబస్తు పెట్టుకున్నారు. అడ్డువచ్చిన వారిని అడ్డంగా అరెస్టు చేయించారు.

ఇప్పుడు అధికారం మారింది. జగన్ పోయి చంద్రబాబు వచ్చారు. అమరావతి రైతుల ఉద్యమానికి దన్నుగా నిలిచి, వారి పోరాట చరిత్రను హస్తినదాకా వినిపించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు, అమరావతి రైతులు బారులుతీరి చేతులెత్తి మొక్కారు. బంతిపూలతో ముంచెత్తారు. తమ కృతజ్ఞతలను ఆరకంగా తీర్చుకున్నారు.

జనం అభిమానించినా, ఆగ్రహించినా అంతే ఉంటుంది. జనం జోలికి వెళితే నిలిచిన వారెవరూ చరిత్రలో కనిపించరు. పైగా రైతుల జోలికి వెళితే నిలిచి గెలిచిన పాలకులెవరూ లేరు. దేశంలోనే ఉత్తమ రాజధాని నగరంలా భాసిల్లాల్సిన అమరావతిని, శిధిల రాజధానిలా మార్చిన జగన్‌కు.. అయిదేళ్లు అమరావతిని సజీవంగా ఉంచి, జాతీయ పార్టీలతో జైకొట్టించిన చంద్రబాబుకూ తేడా అదే! అందుకే జగన్‌కు శాపనార్ధాలు. చంద్రబాబుకు నీరాజనాలు!

LEAVE A RESPONSE