Suryaa.co.in

Andhra Pradesh

విద్యార్ధుల జీవితాలతో చలగాటమాడుతున్న లోకేష్‌

– జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కోసం రూ 10 వేల కోట్లకు పైగా ఖర్చు
– ప్రజారోగ్యంపై సీఎం ముందుచూపును ప్రశంసించి వైద్యరంగ నిపుణులు
– జాబ్ మేళాలలో 50 వేల మందికి పైగా ఉద్యోగాలు
– ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయి రెడ్డి

నారా లోకేష్ (పప్పు నాయుడు) విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నాడని, వైసీపీ నేతల పిల్లల కోసం టెన్త్ ప్రశ్నాపత్రాలు లీక్ చేశారంటూ అర్దం లేని ఆరోపణలు చేస్తున్నాడని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి మండిపడ్డారు.

అయితే తేదేపా నేతకు చెందిన నారాయణ స్కూల్ నుంచి ప్రశ్నాపత్రాలు ఎలా బయటకు వచ్చాయో లోకేష్ చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. పరీక్షలు వద్దంటూ, స్కూల్స్ మూసేయాలంటూ అర్థం లేని డిమాండ్లతో అవకాశం వచ్చినప్పుడల్లా విద్యార్థుల జీవితాలతో లోకేష్ చెలగాటం ఆడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో పేద విద్యార్థుల చదువులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ అనేక పథకాలు అమలు చేస్తోందని, కేవలం జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కోసమే రూ.10 వేల కోట్లకు పైగా ఖర్చు చేసిందని అన్నారు..

ప్రజారోగ్యం పట్ల సీఎం జగన్ దూరదృష్టిపై వైద్య రంగ ప్రముఖుల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయని, దేశంలో క్యాన్సర్ చికిత్స ప్రాముఖ్యతను గుర్తించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, క్యాన్సర్ బాధితుల సంరక్షణ, చికిత్సపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దూరదృష్టి అభినందనీయమని ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ప్రశంసించారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 3 సమగ్ర క్యాన్సర్ ఆసుపత్రుల నిర్మాణానికి సీఎం శ్రీకారం చుట్టారని తెలిపారు.

తిరుపతి, విశాఖ నగరాల్లో జరిగిన జాబ్ మేళాల్లో అంచనాలకు మించి 30,473 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగిందని, నేడు, రేపు గుంటూరు నాగార్జున యూనివర్శిటీలో జరగనున్న జాబ్ మేళాలో కల్పించనున్న 26,289 ఉద్యోగాలతో మొత్తం 50 వేల మందికి పైగా ఉద్యోగాలు లభించనున్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి జాబ్ మేళాలు మరిన్ని నిర్వహిస్తామని, నిరుద్యోగులు అధైర్యపడవద్దని కోరారు.

LEAVE A RESPONSE