– టీడీపీలోకి విజయసాయి బావమరిది ద్వారకానాధ్‌రెడ్డి
– తారకరత్న అత్త హరెమ్మ కూడా
– సైకిలెక్కిన ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య
– బావ జగన్ కలెక్షన్ ఏజెంటని ద్వారకానాధ్‌రెడ్డి ఆరోపణ
– సజ్జల, మిథున్ అంతా జగన్ కలెక్షన్ ఏజెంట్లేనన్న ద్వారకా
– జగన్ నమ్మకద్రోహి అంటూ విసుర్లు
– జగన్‌ది అవినీతి పాలన అంటూ ఫైర్
-బావ విజయసాయి కూడా టీడీపీలో చేరాలని బావమరిది ద్వారకా సలహా
– విజయసాయిరెడ్డికి తప్పని ఇంటిపోరు
– ‘కడప’ మండుతున్న వైసీపీ
( మార్తి సుబ్రహ్మణ్యం)
వైసీపీలో కీలకపాత్ర పోషించే ఎంపి విజయసాయిరెడ్డి కుటుంబంలో పసుపు ముసలం పుట్టింది. వైసీపీ నేత అయిన ఆయన సొంత బావమరిది, మాజీ ఎమ్మెల్యే ద్వారకానాధ్‌రెడ్డి హటాత్తుగా టీడీపీ తీర్ధం తీసుకుని, బావ విజయసాయికి ఝలక్ ఇచ్చిన వైనం సంచలనం సృష్టిస్తోంది. కడప జిల్లా ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్యకూడా సైకిలెక్కేశారు. మృతి చెందిన నటుడు తారకరత్న అత్తగారు కూడా, పసుపు కండువా కప్పేసుకోవడంతో, కడప వైసీపీ ముసలానికి తెరలేచినట్టయింది.
గతంలో కడప జిల్లా రాయచోటి నుంచి సీటు ఆశించి భంగపడిన ద్వారకానాధ్‌రెడ్డికి.. ఈసారి కూడా టికెట్ దక్కదని స్పష్టమవడంతో, ఆయన తన దారి తాను చూసుకున్నారు. రాజకీయ ప్రత్యామ్నాయంగా టీడీపీని ఎంచుకున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో.. సోదరుడు గడికోట సురేంద్రనాధ్‌రెడ్డి, తారకరత్న అత్త హరెమ్మ టీడీపీ కండువా కప్పేసుకున్నారు. ద్వారకానాధ్ సొంత అక్కనే
విజయసాయిరెడ్డి సతీమణి అన్న విషయం తెలిసిందే. కాగా కడప జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య కూడా, టీడీపీలో చేరడం కడపలో వైసీపీకి షాక్ తగిలినట్టయింది.
అసెంబ్లీ సీటు ఇవ్వలేకపోయినా తనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తానని మాట ఇచ్చిన జగన్, మాట తప్పడాన్ని ద్వారాకా జీర్ణించుకోలేకపోయారు. దీనిపై జగన్‌ను కలిసేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు టీడీపీలో చేరాలని నిర్ణయించుకోవడం, వైసీపీలో కలవరం కలిగించింది. ఈ సందర్భంగా ద్వారకా తన సొంత బావ విజయసాయిరెడ్డి-సీఎం జగన్‌పై చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.
‘మా బావ విజయసాయిరెడ్డి, సలహాదారు సజ్జల, ఎంపి మిథున్‌రెడ్డి అంతా సీఎంఓలో కలెక్షన్ ఏజెంట్లే. జగన్ వీరిన కలెక్షన్ ఏజెంట్లుగా నియమించుకుని డబ్బులు వసూలు చేస్తున్నారు. అలాంటి కలెక్షన్ ఏజెంట్లనే జగన్ కలుస్తార’ంటూ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. జగన్ నమ్మకద్రోహి అని, ఆయన పాలన మొత్తం అవినీతిమయమేనని విరుచుకుపడ్డారు. వైఎస్‌కు-జగన్‌కు ఏ విషయంలోనూ పోలిక లేదన్న ద్వారకా.. వచ్చే ఎన్నికల్లో కడప జిల్లాలో టీడీపీకి 6-7 సీట్లు వచ్చే అవకాశాలున్నాయని జోస్యం చెప్పారు.
విజయసాయి, ఆయన భార్య మినహా మిగిలిన వారంతా.. వైసీపీ వీడి టీడీపీలో చేరేందుకు వచ్చామంటూ ద్వారకా మరో సంచలనానికి తెరలేపారు.
ఆ ప్రకారంగా.. విజయసాయి కుటుంబంలో ఆయన ఒంటరి అన్న సంకేతాలిచ్చినట్లయింది. రాబోయే రోజుల్లో విజయసాయి దంపతులు కూడా వైసీపీని వీడే అవకాశాలు లేకపోలేదంటూ… విజయసాయిని టీడీపీలోకి ఆహ్వానించే అధికారం తనకు ఉందని స్పష్టం చేశారు.
కాగా ప్రతిరోజూ టీడీపీ పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, యువనేత లోకేష్ మీద ట్వీట్లతో విరుచుకుపడే విజయసాయిరెడ్డికి.. తాజాగా ఎదురైన ఇంటిపోరు ఇబ్బందికరమే కాదు, ఇరకాటం కూడా. ఇప్పటికే విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా, పార్టీలోని ఆయన ప్రత్యర్ధి వర్గం జగన్‌కు నూరిపోస్తోందట. ఆయన టీడీపీకి సన్నిహితంగా ఉంటున్నారన్నది ఆ ఫిర్యాదుల సారాంశమట.
చనిపోయిన తారకరత్న అంతిమయాత నుంచి.. విజయసాయి టీడీపీకి సన్నిహితంగా ఉంటున్నారన్న ప్రచారం, చాలాకాలం నుంచి పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. దానికి తగినట్లుగానే ఆయన తారకరత్న మృతి తర్వాత తన ధోరణి మార్చుకున్నారు. అంతకుముందు వరకూ బాబు-లోకేష్‌ను పరుషపదజాలంతో విమర్శించిన విజయసాయి.. ఆ తర్వాత గారు అంటూ ట్వీట్ చేయడం గమనార్హం.
ఇప్పుడు సొంత బావమరిది పార్టీ విడిచివెళుతూ.. తనతోపాటు జగన్‌ను కూడా విమర్శించడం కచ్చితంగా, విజయసాయికి సంకటమేనని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బాబు-లోకేష్‌ను విమర్శిస్తేనే ఒంగోలు సీటు ఇస్తానని, మాగుంటకు జగన్ షరతు విధించారన్న వార్తలు వచ్చాయి. అదే నిజమైతే ఇప్పుడు విజయసాయిరెడ్డితో, ఆయన బావమరిదిని తిట్టించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదంటున్నారు. బావమరిది సహా బంధువులంతా టీడీపీలో ఉంటే, విజయసాయిరెడ్డిని ఇక జగన్ ఎందుకు నమ్ముతారని పార్టీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
నిజంగా ఈ పరిణామాలు పార్టీలో విజయసాయిరెడ్డి ఉనికికి ప్రమాదమేనని సీనియర్లు సైతం అంగీకరిస్తున్నారు. విజయసాయి టీడీపీని ఎంత విమర్శించినా జగన్ విశ్వసించరని, పైగా ఎవరినీ నమ్మని జగన్ ఇలాంటి విషయంలో సీరియస్‌గానే ఉంటారంటున్నారు. విజయసాయి బావమరిది చెప్పినట్లు.. ఎంపి విజయసాయిరెడ్డి వైసీపీలో ఉంటారా? లేక బావమరిది పిలుపు మేరకు టీడీపీలో చేరతారా అన్నది చూడాలి.
ఇక తాజా పరిణామాలు కడప టీడీపీలో సహజంగానే జోష్ నింపగా, వైసీపీని ఆందోళనలో ముంచాయి. ఇప్పటివరకూ వైసీపీ ప్రారంభం తర్వాత ఆ పార్టీలో చేరేవేరే తప్ప, బయటకు వచ్చిన వారెవరూ లేకపోవడమే దానికి కారణం. ద్వారకానాధ్‌రెడ్డి జనబలం ఉన్న నేత. ఆ కుటుంబానికి రెండు నియోజకవర్గాలను ప్రభావితం చేసేంత బలం ఉంది.
ఇక ఎమ్మెల్సీ రామచంద్రయ్యకు అంతపెద్ద బలం లేకపోయినా.. సిట్టింగ్ ఎమ్మెల్సీ అయి ఉండి కూడా.. అధికార పార్టీని విడిచిపెట్టి వచ్చారంటే, టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్న సంకేతాలివ్వడమేనని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.