Suryaa.co.in

Telangana

కేసీఆర్ గారు… మీకు మైండ్ బరస్ట్ అయింది: విజయశాంతి

తెలంగాణలో సంభవించిన భారీ వరదల వెనుక విదేశాల కుట్ర ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. క్లౌడ్ బరస్ట్ ద్వారా భారీ వర్షాలను కురిపించారని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. క్లౌడ్ బరస్ట్ కాదు కేసీఆర్ గారూ… మీకు మైండ్ బరస్ట్ అయింది అని విమర్శించారు. మీ పరిపాలన వరస్ట్ అని ప్రజలు అభిప్రాయపడుతున్నారని అన్నారు. భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందని వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని.. సీఎంకు మతి భ్రమించినట్టుందని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి వరద ముంపు పర్యటనను చూసి జనాలు నవ్వుకుంటున్నారని విజయశాంతి అన్నారు. వరద ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తే బాధితులకు భరోసా కలగాలని, తమను ఆదుకుంటారనే నమ్మకం ఏర్పడాలని… కానీ ఈ సీఎం అక్కడకు వెళ్లి చేసిన కామెంట్స్ జోకర్ ను తలపిస్తున్నాయని చెప్పారు. గోదావరికి గతంలో ఎన్నోసార్లు వరదలు వచ్చాయని, అలాగే ఇప్పుడు కూడా వచ్చాయని, భవిష్యత్తులో కూడా వస్తాయని… కానీ, కేసీఆర్ కు మాత్రం ఈ భారీ వర్షాలు మానవ సృష్టిలా కనిపిస్తున్నాయని దుయ్యబట్టారు. పైగా విదేశీ కుట్ర అంటున్నారని ఎద్దేవా చేశారు.

కుట్రలకే అతిపెద్ద కుట్రదారుడు కేసీఆర్ అని విమర్శించారు. తానే పెద్ద ఇంజినీరింగ్ నిపుణుడినని గొప్పలు చెప్పుకున్నారని… కేసీఆర్ రీడిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌస్ నీట మునిగిందని అన్నారు. మిషన్ కాకతీయ పేరుతో పూడిక తీయడమే తప్ప… కరకట్టల నిర్మాణాన్ని విస్మరించడంతో అనేక చోట్ల చెరువులు, కుంటలు తెగి వేల ఎకరాల పంట నష్టానికి దారి తీసిందని చెప్పారు. తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు… విదేశీ కుట్ర పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారని మండిపడ్డారు.

ఇప్పటి వరకు జీతాలు అందక ప్రభుత్వ ఉద్యోగులు బాధ పడుతున్నారని విజయశాంతి అన్నారు. జీతాలు ఇవ్వడం చేత కాక.. వర్షాల అంశాన్ని విదేశీ కుట్ర పేరుతో అంతర్జాతీయం చేయాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోందని విమర్శించారు. ముంపు బాధిత కుటుంబాలకు రూ. 10 వేలు పరిహారం ఇస్తానని కేసీఆర్ అంటున్నారని.. సర్వం కోల్పోయిన బాధితులకు ఇది ఏ మూలకు సరిపోతుందని ప్రశ్నించారు. గతంలో హైదరాబాద్ ముంపు బాధితులకు రూ. 10 వేల సాయం చేస్తానని హామీ ఇచ్చి ఎగ్గొట్టిన చరిత్ర కేసీఆర్ దని విమర్శించారు.

10 వేల ఇళ్లతో కాలనీ నిర్మిస్తానని కేసీఆర్ చెప్పడం ఈ శతాబ్దపు గొప్ప జోక్ అని విజయశాంతి ఎద్దేవా చేశారు. ఇంటింటికీ ఒక ఉద్యోగం ఇస్తా, దళితులందరికీ దళితబంధు ఇస్తానన్న హామీలాంటిదే ఇది కూడా అని చెప్పారు. కేసీఆర్ ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం మానుకోవాలని అన్నారు.

LEAVE A RESPONSE