– శకటాలను పరిశీలించిన సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డి
విజయవాడ: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించే శకటాలను త్వరితగతిన సిద్ధం చేయాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి విజయ్ కుమార్ రెడ్డి అన్నారు.73వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా స్థానిక ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో రూపొందుతున్న శకటాలను శనివారం సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్ కుమార్ రెడ్డి పరిశీలించి పలు సూచనలు చేశారు.
అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించేందుకు 16 శకటాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటిలో విత్తనం నుండి
పంట కొనుగోలు వరకు సేవలందించే రైతు భరోసాపై వ్యవసాయ శాఖ శకటం ఉంటుందన్నారు.
జగనన్న పాలవెల్లువ ద్వారా పాడి రైతులకు లబ్ధి చేకూర్చే విధానాన్ని తెలిపే పశుసంవర్ధక శాఖ శకటం ఉంటుందన్నారు. మత్స్యకార భరోసా, ఆక్వా ల్యాబ్ తదితర అంశాలపై వివరించే విధంగా మత్స్య శాఖ శకటం ఉంటాయన్నారు. విద్యాశాఖ సంబంధించి నాడు- నేడు అమ్మ ఒడి ప్రధాన అంశాలుగా రెండు శకటాలు ఉంటాయని అన్నారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన తదితర పథకాల పై సాంఘిక సంక్షేమ శాఖ శకటం, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఆరోగ్యశ్రీ నాడు నేడు కార్యక్రమం లో భాగంగా అత్యాధునిక వసతులతో కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా తీర్చిదిద్దిన ప్రభుత్వాసుపత్రుల్లో అందిస్తున్న సేవలను తెలిపే విధంగాను, ముఖ్యంగా కోవిడ్ వైరస్ పై ప్రజలను అప్రమత్తత చేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్యపరంగా అందిస్తున్న వైద్య సౌకర్యాలపై, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన మూడు శకటాలు ఉంటాయన్నారు.
పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేస్తున్న జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం, జగనన్న కాలనీలపై గృహ నిర్మాణ శాఖ చెందిన శకటం, అంగన్వాడీలు ఫౌండేషన్ ప్రీ స్కూల్స్ కు సంబంధించిన మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ శకటం, డాక్టర్ వైయస్సార్ పెన్షన్ కానుక, చేయూత, ఆసరా, సున్నా వడ్డీ పథకం తదితర పథకాలపై అవగాహన కల్పించే సెర్ఫ్ శకటం, పారిశ్రామిక రంగానికి సంబంధించి
వైయస్సార్ వన్ ,మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ను ప్రోత్సహించే విధంగా రూపొందించిన పరిశ్రమల శాఖ శకటం, క్లీన్ ఆంధ్ర ప్రదేశ్, స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ లో భాగంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శకటం, జగనన్న పచ్చతోరణాన్నివివరించే విధంగా రూపొందించే అటవీ శాఖ శకటం, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి, సమూల మార్పులు,మారుతున్న మన పల్లె ముఖచిత్రం కళ్ళకు కట్టినట్లుగా తెలిపే గ్రామ వార్డు సచివాలయ శకటం ప్రధాన ఆకర్షణగా ఉంటాయని అన్నారు.
కోవిడ్ కారణంగా పరిమిత సంఖ్యలో ప్రజలను అనుమతిస్తున్నందున నగర ప్రజలు వీక్షించే విధంగా నగర వీధుల్లో శకటాల ప్రదర్శన ఉంటుందని కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డి అన్నారు.ఈ పరిశీలనలో సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ కిరణ్ కుమార్, సహాయ సంచాలకులు భాస్కర్ నారాయణ, జిల్లా పౌరసంబంధాల అధికారి ఎస్. వి. మోహన్ రావు,ఆయా శకటాల కు చెందిన అధికారులు పాల్గొన్నారు.