ఆంధ్రప్రదేశ్,ఒడిస్సా రాష్ట్రాల మధ్య ఇంటర్ స్టేట్ అంశాలపై ఇరు రాష్ట్రాల సిఎస్ ల వర్చువల్ సమావేశం
అమరావతి,10 జనవరి:ఆంధ్రప్రదేశ్,ఒడిస్సా రాష్ట్రాల మధ్యగల వివిధ అంతర్ రాష్ట్ర అంశాల పరిష్కారానికి సోమవారం అమరావతి సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ఒడిస్సా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేశ్ చంద్ర మహాపాత్ర తదితర అధికారులతో వర్చువల్ విధానంలో సమావేశం నిర్వహించారు.ముఖ్యంగా ఇరు రాష్ట్రాల మధ్య అంతర్ రాష్ట్ర సమస్యలను నిర్ధిష్ట వ్యవధిలోగా పరిష్కరించుకునే విషయమై ఇటీవల కాలంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భువనేశ్వర్ లో సమావేశం కావడం జరిగింది.తదుపరి ఇరు రాష్ట్రాల తరుపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల నేతృత్వంలో సంబంధిత శాఖల అధికారులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేశారు.
ఆకమిటీలు రెండూ సోమవారం వర్చువల్ విధానంలో ఆయా పెండింగ్ అంశాలపై సమీక్షించారు.ఈసందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ మాట్లాడుతూ కమిటీ తొలి సమావేశం కావున వివిధ పెండింగ్ అంశాలను సంప్రదింపులు ద్వారా త్వరిత గతిన క్రమక్రమంగా పరిష్కరిచుకునేందుకు కృషి చేద్దామని ఒడిస్సా సిఎస్ సురేశ చంద్ర మహాపాత్రకు చెప్పారు.రవాణా శాఖకు సంబంధించిన చాలా అంశాలను చర్చించి పరిష్కరించుకోవడం జరిగిందని తెలిపారు.
ఒడిస్సా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేశ్ చంద్ర మహాపాత్ర భువనేశ్వర్ నుండి వీడియో సమావేశం ద్వారా మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల మధ్య వివిధ పెండింగ్ అంశాలను సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు కృషి చేద్దామని చెప్పారు.ఇప్పటికే ముఖ్యమంత్రుల స్థాయిలో జరిగిన సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలను సకాలంలో పరిష్కరించుకునేందుకు ఈకమిటీ సమావేశాలు అన్ని విధాలా దోహదం చేస్తాయని తెలిపారు. ముఖ్యంగా రెండు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లో రోడ్డు కనక్టవిటీని త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని సిఎస్ సమీర్ శర్మ దృష్టికి తెచ్చారు.ఈసమావేశపు మినిట్స్ ను ఇరు రాష్ట్రాలు పరస్పరం సిద్ధం చేసి పంపితే తదుపరి సమావేశాల్లో పరిష్కరించాల్సిన పెండింగ్ అంశాలపై చర్చించుకుని సకాలంలో పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుందని సురేశ్ చంద్ర మహాపాత్ర పేర్కొన్నారు.
అంతకు ముందు ఈసమావేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్,ఒడిస్సా రాష్ట్రాల మధ్య ఎనర్జీ, వాటర్ రిసోర్సెస్,ఉన్నత విద్య,పాఠశాల విద్య, రెవెన్యూ,రవాణా శాఖలకు సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలపై చర్చించారు.ముఖ్యంగా ఇంధన శాఖకు సంబంధించి జోలాపుట్ డ్యాం హైడ్రో ఎలట్రిక్ ప్రాజెక్టు,లోయర్ మాచ్ఖండ్ హైడ్రో ఎలట్రిక్ ప్రాజెక్టు,బలిమెల డ్యాం చిత్రకొండ హైడ్రో ఎలట్రిక్ ప్రాజెక్టులకు సంబంధించి పరిష్కరించుకోవాల్సిన అంశాలపై చర్చించారు.అదే విధంగా వాటర్ రిసోర్సెస్ శాఖకు సంబంధించి వంశధార నదిపై నేరెడి బ్యారేజి,ఝంఝావతి రిజర్వాయర్ ప్రాజెక్టు,బహుదా నది నీరు విడుదలకు సంబంధించి పంపు స్టోరేజి ప్రాజెక్టులకు ఇరు రాష్ట్రాల తరుపున ఎన్ఒసిలు మంజూరు అంశాలపై సమీక్షించారు.
ఉన్నత విద్యాశాఖకు సంబంధించి శ్రీకాకుళంలోని డా.బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం,ఒడిస్సాలోని బెరహంపూర్ విశ్వవిద్యాలయాల్లో ఒడియా,తెలుగు భాషలను ప్రవేశపెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించారు.పాఠశాల విద్యాశాఖకు సంబంధించి ఆశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ మాట్లాడుతూ 2018 డిఎస్సి లో 83 ఒడియా ఉపాధ్యాయుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా 46 పోస్టులను భర్తీ చేసినట్టు చెప్పారు.
అదే విధంగా శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం జిల్లాల్లో ఒరియా మాట్లాడే ప్రజలు అధికంగా గల మండలాల్లో 106 అంగన్ వాడీ కేంద్రాల్లో ఒరియా భాషను బోధించేందుకు వీలుగా అంగన్ వాడీ వర్కర్లను నియమించడం జరిగిందని తెలిపారు.రవాణా శాఖకు సంబంధించిన అంశాలపై ఆశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు మాట్లాడుతూ ఇంటర్ స్టేట్ ట్రాన్సుపోర్టు ఒప్పందానికి అనుగుణంగా ఇరు రాష్ట్రాలు చర్యలు తీసుకుందామని చెప్పారు.స్టేజ్ కారియర్ వాహనాలకు ఇరు రాష్ట్రాల్లో నైల్టు హాల్టు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆదిశగా చర్యలు తీసుకుందామని చెప్పారు. రెవెన్యూ శాఖకు సంబంధించి శ్రీకాకుళం,విజయనగరం జిల్లాల్లో ఒడిస్సా రాష్ట్ర సరిహద్దులో కొటియా గ్రూప్ ఆఫ్ విలేజిస్ అంశాలపై ఇరు రాష్ట్రాలకు చెందిన సంబంధిత జిల్లా కలక్టర్ల వద్ద ఉన్న మ్యాప్ ల ఆధారంగా జిల్లా స్థాయిలో పరిష్కరించుకునేందుకు చర్యలు చేపడదామని ఇరు రాష్ట్రాల సిఎస్ లు డా.సమీర్ శర్మ,సురేశ్ చంద్ర మహాపాత్ర అంగీకరించారు.
ఈసమావేశంలో ఎపి తరుపున ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు డా.కెఎస్ జవహర్ రెడ్డి,బి.రాజశేఖర్,స్టేట్ రిఆర్గనైజేషన్ కమిటీ ముఖ్య కార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి,ఎపి జెన్ కో ఎండి శ్రీధర్, టిఆర్ఆండ్బి ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు,ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల రావు, రవాణా శాఖ కమీషనర్ పిఎస్ఆర్ ఆంజనేయులు,ఐఅండ్పీఆర్ కమీషనర్ టి.విజయ కుమార్ రెడ్డి,హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయకుమార్,రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధ్యక్షులు హేమచంద్రా రెడ్డి పాల్గొనగా వీడియో లింక్ ద్వారా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్,ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు పాల్గొన్నారు.అదే విధంగా ఒడిస్సా ప్రభుత్వం తరుపున భువనేశ్వర్ నుండి వీడియో సమావేశం ద్వారా ఆ రాష్ట్ర సిఎస్ తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.