అక్కడే కదా
తుపాకులు పేలి
తొమ్మిది ప్రాణాలు
గాలిలో కలిసింది..
అంతా కుర్రాళ్లు…
కాని అవతలున్నది తోడేళ్ళు…
కర్కశంగా గుళ్ల వర్షం..
శవాలు లేస్తుంటే
అదోలాంటి హర్షం..
ఇంతకీ అది కానేకాదు జలియనువాలాబాగు..
అది మన వైజాగు..!
ఇదిగో..ఇదే విశాఖ…
ఇదే ఉక్కు
ప్రైవేటుపరం
చెయ్యొద్దని ఇప్పుడు..
కర్మాగారం కావాలని అప్పుడు…
అదీ ఉద్యమమే..
ఇదీ ఉద్యమమే…
అది త్యాగం..ఇది విరాగం…
అక్కడ కాదు ఇక్కడంటూ
సీతారామరాజు
రొమ్మువిరిచి చూపినట్టు..
అదే అల్లూరి ఆవేశం నింపుకున్న
ఏవియన్ కళాశాల
సమీపంలో అంతే ఉద్వేగంతో పోరాడితే
అదే వయసు పోరగాళ్లు…
నాడు ఫిరంగులు పేల్చింది బ్రిటిష్ ముష్కరుల సేనలు…
యాభై ఆరేళ్ల క్రితం
గుండెల్లో గుళ్ళు
దింపాలని ఇదే రోజున
ఇదే విశాఖలో
మన నియంతృత్వ పాలకుల ఆనలు..!
ఏవియన్ కాలేజీ సాక్షిగా పంచపాండవులు….
పాత పోస్టాఫీసు ముందుగా
చత్రుర్బ్రహ్మలు…
కుర్రాళ్లోయ్..కుర్రాళ్ళు..
వెర్రెక్కి ఉన్నోళ్లు…
అంటూ పోలీస్ వేటగాళ్లు సాగిస్తే నరమేధం…
భోరున ఏడ్చింది తెలుగుతల్లి…
వీరిది ప్రాణత్యాగం..
అలా ఉద్యమాన్ని అణచివేయాలన్న
ఇందిరసర్కార్ మాయారోగం..!
వింటుంటే.. తలుచుకుంటుంటే..
ఇప్పటికీ
ఉడుకుతున్న రక్తం..
ఉప్పొంగుతున్న ఆవేశం..
ఆ తర్వాత
మరో 23 సమిధలు…
ఉక్కు కోసం
పుట్టిన సమాధులు..
వినిపించడం లేదా
వాటి నుంచి విలాపాలు
కనిపించడం లేదా
కదులుతున్న వాటి పునాదులు..
మా త్యాగం వ్యర్థమేనా అంటూ ప్రశ్నలు…
ఇందుకేనా మేము బలయ్యింది..
నాటి మా యువరక్తం..
ఇప్పటి మీ విరక్తం…
చచ్చి మేము గెలిచాము..
మరి బ్రతికుండి మీరేం పీకుతున్నారంటూ
శ్లేషలు..
శవాల్లోనూ మిగిలి ఉన్న గుండె ఘోషలు..!
తెలుగు తమ్ముడా..లే..
ఇది మొక్కుబడి కాదు..
అది పోయిన ప్రాణం..
ఇది రక్తం
మరగాల్సిన తరుణం..
అమ్మ గుండెపై మళ్లీ
రగుడుతున్న వ్రణం..
మన ఉక్కు..
మన హక్కు..
పోరాడడం గెలుపు కాదు..
నిలబెట్టుకుంటేనే గెలిచేది..
మన ఉక్కు..
హక్కు
నిలిచేది..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286