అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబునాయుడు సారధ్యంలో తమ భవిష్యత్తు బాగుంటుందని నమ్మిన 9మంది మంగళగిరి నియోజకవర్గం వాలంటీర్లు యువనేత నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరారు. ఉండవల్లి నివాసంలో వాలంటీర్లకు యువనేత లోకేష్ పసుపుకండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైసిపి నాయకులు వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించి పార్టీ పనులకు ఉపయోగిస్తున్న తరుణంలో మంగళగిరి పట్టణ పరిధిలోని వాలంటీర్లు లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరడం విశేషం.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… వాలంటీర్ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని ఇప్పటికే స్పష్టంగా తెలియజేశామని అన్నారు. వాలంటీర్ల వేతనాలను రెట్టింపు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, వారి భవిష్యత్తుకు తాము భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కేవలం పెన్షన్ల పంపిణీనే కాకుండా ఇతర సంక్షేమ పథకాలు కూడా రాబోయే రోజుల్లో వాలంటీర్ల ద్వారా అందజేస్తామని లోకేష్ చెప్పారు.
వాలంటీర్లు మాట్లాడుతూ… ఉన్నత విద్యను అభ్యసించిన తమకు చంద్రబాబునాయుడు నేతృత్వంలో తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుందని విశ్వసిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. టిడిపిలో చేరిన వారిలో మంగళగిరి నియోజకవర్గం వాలంటీర్లు గొర్రెముచ్చు ఫ్రాన్సిస్, మల్లవరపు లక్ష్మీప్రియ, కోలా ప్రకాష్, పెనుమాక బాలశౌరి, ప్రదీప్, చిన్నపోతుల శ్రీకాంత్, కర్రి త్రివేణి, కన్నా నాగరాజు, కట్టా రమ్యకృష్ణ తదితరులు ఉన్నారు.