Suryaa.co.in

Andhra Pradesh

ఓటుహక్కు ఒక ప్రాథమిక హక్కు!

-సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఓటర్ల హక్కులను పరిరక్షించాలి!
-సి.ఎఫ్.డి. విజ్ఞప్తి!

విజయవాడ , డిసెంబర్ 15: ఓటు హక్కును ప్రాథమికహక్కుగా పరిగణిస్తూ సుప్రీంకోర్టు తాజాగా ఒక తీర్పులో పేర్కొన్న నేపథ్యంలో యాధాలాపంగా , యాంత్రికంగా ఓటుహక్కును తొలగించడం చట్టవిరుద్ధం అవుతుందని , అలాంటి సందర్భాల్లో ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులే బాధ్యులు అవుతారని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ స్పష్టం చేసింది! ఓటర్ల హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

ఆమేరకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ప్రధానకార్యదర్శి డా.నిమ్మగడ్డ రమేష్ కుమార్, సహాయకార్యదర్శి వి.లక్ష్మణ రెడ్డి, కార్యవర్గసభ్యులు, విజయవాడ పూర్వమేయర్ డా జంధ్యాల శంకర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ తరపున తాము రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాతో భేటీ అయ్యామని ఓటర్ల జాబితాల రూపకల్పన సందర్భంలో ఇప్పటికీ పలు పొరపాట్లు జరుగుతున్న విషయంపై తక్షణం దృష్టి సారించాలని కోరుతూ ఆయనకు ఒక వినతిపత్రాన్ని అందజేశామని వారా ప్రకటనలో తెలిపారు.

రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్ధులను లక్ష్యంగా చేసుకుని గంపగుత్తగా ఫారం 7 దాఖలు అవుతున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయని, గంపగుత్తగా ఫారం 7 ను స్వీకరించరాదన్న ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు , రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలకు విరుద్ధంగా పలుప్రాంతాల్లో ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు గంపగుత్తగా ఫారం 7 ను స్వీకరిస్తున్నారని , తగు ప్రక్రియను పాటించకుండానే, సందేహాస్పదమైన స్వల్పకారణాలతో ఇప్పటికే నమోదైన ఓటర్లపేర్లను నిబంధనలకు విరుద్ధంగా జాబితాలను తొలగిస్తున్న ఉదంతాలు పెద్దఎత్తున జరుగుతున్న విషయాన్ని ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకు వెళ్ళామని వారా ప్రకటనలో వివరించారు.

కొందరు ఎలక్టోరల్ అధికారుల తప్పుడు చర్యలను సరిదిద్దనిపక్షంలో రాష్ట్రంలో నిజమైన ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం లేకుండా పోతుందని , పర్యవసానంగా ఎన్నికలు స్వేచ్ఛగా , నిష్పాక్షికంగా జరుగుతాయన్న నమ్మకం దెబ్బ తింటుందని , తద్వారా మన ప్రజాస్వామ్య వ్యవస్థకు , ప్రజాస్వామ్య సంప్రదాయాలకు , పద్ధతులకు మచ్చ ఏర్పడుతుందని వారా ప్రకటనలో హెచ్చరించారు.

కొందరు ఎలక్టోరల్ అధికారులు తగినంత పరిశీలన చేయకుండానే బూత్ ఏజంట్లు , రాజకీయపార్టీల కార్యకర్తలు ఇచ్చే దరఖాస్తుల ఆధారంగా నివాసం ఉండటం లేదంటూ ఓటర్లకు నోటీసులు జారీచేయడం ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తాము తెలిపామని వారా ప్రకటనలో వెల్లడించారు.

రిజిస్టర్డ్ ఓటర్లు తమ నివాస ప్రాంతాల్లో ఇప్పటికే ఓటు వేస్తున్నారని, వారికి ఓటరు గుర్తింపు కార్డుతోపాటు , ఎన్నికల కమిషన్ ఆమోదించిన వివిధ నివాస గుర్తింపు ఆధారాలు కూడా ఉన్నాయని , అయినా నివాసం ఉండటం లేదంటూ ఓటును తొలగించడం అన్యాయమని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రతినిధులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఒక చారిత్రాత్మక తీర్పులో ఓటుహక్కును ప్రాథమిక హక్కుగా పేర్కొన్న నేపథ్యంలో రిజిష్టర్ అయిన ఓటరును జాబితా నుంచి తొలగించడం అంత సులభం కాదని , ఒక్కసారి పౌరునికి ఓటును ప్రాథమిక హక్కుగా ఇచ్చిన తర్వాత రాజ్యాంగ సూత్రాల ప్రకారం సదరుహక్కు ఓటరుకు ఒక ఉన్నతమైన, రక్షిత హోదాను కల్పిస్తుందని , ప్రాథమిక హక్కుగా ఇచ్చిన హక్కును నిబంధనల ప్రకారం , కఠినమైన ప్రక్రియ ద్వారా తప్ప సులభంగా తొలగించడం కుదరదని , తాజాతీర్పు ఓటుహక్కుకు ఇచ్చిన అత్యున్నత ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు వ్యవహరించాలని వారా ప్రకటనలో పేర్కొన్నారు.

అనూప్ బరన్ వాల్ వెర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తమ వినతిపత్రంలో వారు ప్రస్తావించారు.

పౌరుడు ప్రజావ్యవహరాలలో ఒక ఓటరుగా పాలుపంచుకోవడం అనేది రాజ్యాంగ మౌలిక లక్షణమైన ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు కీలకమని సుప్రీంకోర్టు తీర్పు పేర్కొన్న సంగతిని వారు ప్రస్తావించారు.

పౌరులు తమ ఎంపికను ఓటుహక్కు ద్వారా వ్యక్తం చేస్తారని , రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ,1 ఏ , బి , సెక్షన్ల ప్రకారం పౌరులకు లభించిన భావప్రకటనా స్వేచ్ఛలో ఓటుహక్కు కూడా ఒకభాగమని సుప్రీంకోర్టు పరిగణించిందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రతినిధులు ఆ ప్రకటనలో వివరించారు.

సుప్రీంకోర్టు తాజాతీర్పు నేపథ్యంలో సందేహానికి అతీతంగా ధృవీకరించు కాకుండా ,అనాలోచితంగా , నిర్లక్ష్యంగా ఓటర్ల ప్రాథమికహక్కు అయిన ఓటు హక్కును తొలగిస్తే అందుకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులే బాధ్యులు అవుతారని, అందుకు వారు ఎన్నికల కమిషన్ సమీక్షకు , న్యాయ సమీక్షకు గురికావాల్సి ఉంటుందని , సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రతినిధులు తమ ప్రకటనలో స్పష్టం చేశారు.

ఓటు తొలగింపు విషయంలో ఓటర్లకు విధిగా నోటీసు ఇవ్వాలని, తొలగింపు నిర్ణయానికి ఎందుకు రావాల్సి వచ్చిందనే అంశంపై సంబంధిత అధికారులు తగు కారణాలను నోటీసులో పేర్కొనాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

తాము లేవనెత్తిన అంశాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సానుకూలంగా స్పందించారని, ప్రజా ప్రాతినిధ్య చట్టం నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని డా.నిమ్మగడ్డ రమేష్ కుమార్, వి.లక్ష్మణ రెడ్డి, డా.జంధ్యాల శంకర్ ఆ ప్రకటనలో తెలిపారు.
ఓటర్లకు ఓటు చేయడానికి గల ప్రాథమిక హక్కును పరిరక్షించడానికి పౌరులకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ తరపున తాము అండగా ఉంటామని తెలిపారు.

LEAVE A RESPONSE