( విజయసాయిరెడ్డి, ఎంపీ)
విభజనతో గాయపడిన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ఆకర్షించడానికి విశాఖపట్నంలో ‘శిఖరాగ్ర సదస్సులు’ జరిపిన నాటి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆడిన నాటకాలు అన్నీ ఇన్నీ కాదు. ఒక మోస్తరు అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు, ఎగుమతులు, దిగుమతులకు కేంద్రమైన నౌకాశ్రయం కూడా ఉన్న పెద్ద నగరం వైజాగ్ లో సమావేశాలు పెట్టి పెట్టుబడులు మాత్రం అమరావతి ప్రాంతంలో పెట్టాలని తెలుగుదేశం ప్రభుత్వం కోరుకునేది.
‘అమరావతిలో వేలాది ఎకరాల పంట నేలలు చౌకగా ఇస్తాం. మిలియన్ల డాలర్ల సొమ్ము ఇక్కడికి తీసుకొచ్చి, లాభాలు పండించుకోండి,’ అనేది చంద్రబాబు సర్కారు నినాదం. కృష్ణా నదీతీరంలో కనీస మౌలిక సౌకర్యాలు లేని ‘గ్రీన్ ల్యాండ్’ లో సహజంగానే డబ్బుపెట్టి సంపాదించేది ఏమీ ఉండదని ఆగ్నేయాసియా, జపాన్ వంటి దేశాల ప్రభుత్వాలు, పారిశ్రామికవేత్తలు భావించారు. పెట్టుబడులు రాబట్టడానికి విశాఖను వేదికగా వాడుకున్న టీడీపీ ప్రభుత్వం పంట పొలాలను సాగుకు దూరం చేసి చేయాలనుకున్న ‘ధనయజ్ఞం’ ఘోరంగా విఫలమైంది. 1953లోనే అప్పటి ఆంధ్రరాష్ట్రానికి రాజధానిగా గుంటూరు–కృష్ణా జిల్లాల ప్రాంతం వద్దని తీసుకున్న నిర ్ణయం తిరుగులేనిదని నారావారి అమరావతి ప్రయోగం నిరూపించింది.
అమరావతి ప్రాంత ప్రజల గ్రామాల ప్రజలకు చేసిన నష్టం 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని వెంటాడి, ఓడించింది. అలాగే, ఏపీలోని మిగిలిన చిన్న నగరాలతో పోల్చితే పెద్ద విమానాశ్రయం, భారత నౌకాదళ కేంద్రం, అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో విరాజిల్లుతున్న సిటీ విశాఖపట్నం. అలాంటి నగరాన్ని రాష్ట్ర రాజధానిగా చేయాలనే నిర్ణయం 2014లోనే చేయకపోవడం చంద్రబాబు చేసిన అతిపెద్ద పాపం. రేవు నగరంగా అంతర్జాతీయ వాణిజ్యపటంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఉన్న విశాఖ బంగాళాఖాత తీరంలో ఎగువున ఉన్న కలకత్తా తర్వాత పెద్ద నగరం. వైజాగ్ బ్రాండ్ వాల్యూను వాడుకుని గుంటూరు, విజయవాడ మధ్య పొలాల్లో రాజధాని ప్రాంతం పేరుతో పెట్టుబడులు పెట్టించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించవని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగానే తేలిపోయింది.
‘ల్యాండ్ పూలింగ్’ పేరుతో ప్రజలను ఫూల్స్ ను చేయడం పాపం కాదా?
తరతరాలుగా పుట్టి పెరిగిన ఊళ్లను రాజధాని కోసం సర్కారుకు రాసివ్వడానికి రైతులను ‘భూ సేకరణ’కు బదులు ‘ల్యాండ్ పూలింగ్’ పేరుతో బుట్టలో పడేశారు బాబు గారు. మూడు రాజధానుల నిర్ణయం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రకటించాక అమరావతి రైతులను మరింత ఆందోళనకు గురిచేశారు టీడీపీ అధినేత. ఇప్పుడేమో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కారును ఇరుకున పడేయడానికి అమరావతి ‘రైతుల’ను రోడ్ల మీదకు ఎక్కించారు. తమ ప్రాంతంలో రాష్ట్ర రాజధాని వస్తుందని కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు ఏలూరు ప్రాంత ప్రజలు కూడా చంద్రబాబు నిర్ణయం తర్వాత సంబరపడలేదు.
మొత్తంమీద ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా, రాయలసీమ అనే మూడు ప్రాంతాల్లో ఏ ఒక్క ప్రాంతం ప్రజలనూ సంతోషపెట్టలేకపోయారు చంద్రబాబు. ఆయన పాలనలో బాబు గారి వర్గంలోని ఆంతరంగికులు మినహా ఏ సామాజికవర్గం, ఏ ప్రాంతం సంతృప్తికరంగా లేదు. కాబట్టే 2019 ఎన్నికల్లో టీడీపీకి కనీసం 50 అసెంబ్లీ స్థానాలు రాలేదు. ప్రజాతీర్పును అర్ధంచేసుకోలేని చంద్రబాబు గారి పార్టీకి 2024లో ఒక్క అమరావతి ప్రాంత ప్రజలేకాదు, ఉత్తరాంధ్ర ప్రజానీకం, రాయలసీమ జనం దిమ్మదిరిగే తీర్పు ఇవ్వడానికి సిద్ధమౌతున్నారు. ఇకనైనా ‘హైటెక్ రాజనీతికోవిదుడు’ కృష్ణాతీరంలో చేసిన పాపాన్ని విశాఖ నగర తీరంలోని బంగాళాఖాతంలో కడుక్కోవడానికి ప్రయత్నిస్తే అందరికీ మంచిది.