-యుద్ధ ప్రాతిపదికన కాలువలకు మరమ్మతులు చేపట్టాలి
-లాకులకు మరమ్మతులు ఈ వేసవి ముగిసేలోగా పూర్తి చేయాలి
– జనసేన అధినేత పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాలువల నిర్వహణ పనులపై గత అయిదేళ్లుగా దృష్టిపెట్టలేదు. సాగు నీటి అవసరాలు తీర్చే కాలువలు, వాటికి సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలకు అవసరమైన నిర్వహణ, మరమ్మతులు వేసవి సమయంలో చేపట్టాలి. రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ముగిసిన తరుణంలో- మధ్యంతర ప్రభుత్వం ఈ అంశంపై జల వనరుల శాఖతో సమీక్షించాలి.
ప్రభుత్వ అధికారులు కాలువలకు సంబంధించిన నిర్వహణ పనులపై దృష్టి సారించాలి. రాష్ట్రంలో ఏ పంట కాలువ చూసినా పూడిక చేరిపోయి, తుప్పలు, తూటి కాడలు పెరిగిపోయి ఉన్నాయి. కాలువలకు నీరు వదిలినా ప్రవాహం ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. చివరి ఆయకట్టుకు నీరు అందటం లేదు. గత యేడాది పశ్చిమ కృష్ణా డెల్టాలో పంటలు ఎండిపోవడానికి కాలువల నిర్వహణ సరిగా లేకపోవడం కూడా ఓ కారణమయింది.
రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా రైతాంగం నుంచి ఈ సమస్యపైనే ఎక్కువ విజ్ఞాపనలు వచ్చాయి. జలవనరుల శాఖ యుద్ధ ప్రాతిపదికన కాలువలకీ, లాకులకు మరమ్మతులు ఈ వేసవి ముగిసేలోగా పూర్తి చేయాలి. రుతు పవనాలు ప్రవేశించేలోగా పనులు పూర్తయితేనే రైతాంగానికి మేలు జరుగుతుంది.