Home » జూన్ 4న వైకాపాకు పెద్దకర్మ

జూన్ 4న వైకాపాకు పెద్దకర్మ

 నా జన్మదినోత్సవం రోజే… వైకాపా మరణం
-రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై ఇక వైకాపా ఉండే అవకాశం లేదు

-నర్సాపురం పార్లమెంట్ సభ్యులు, అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు

భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో వైకాపా ఉండే అవకాశమే లేదని నరసాపురం పార్లమెంట్ సభ్యులు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు అన్నారు. మే 13వ తేదీన ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ 14వ తేదీ ఉదయాన ముగిసిందన్న ఆయన, నా జన్మదినోత్సవం రోజే వైకాపా మరణ దినోత్సవం అని అన్నారు.

జూన్ 4వ తేదీన ఆ పార్టీ పెద్దకర్మ ఉంటుందని, అందరూ పాల్గొనాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తుందన్నారు. మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేరని, నేను రచ్చబండ కార్యక్రమంలో చెబుతూనే ఉన్నానని తెలిపారు. రాష్ట్రంలోని నాలుగు కోట్ల మందిలో ఉద్యోగులు, వారి అనుబంధ కుటుంబ సభ్యులే 40 లక్షల మంది ఉన్నారన్నారు.

ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు నాలుగు లక్షల 50 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్న రఘురామ కృష్ణంరాజు, ఎన్నికల్లో పాల్గొన్న ఉద్యోగులు ఇంత పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే ఇదే ప్రప్రథమమన్నారు. గత ఎన్నికల్లో ఎంతో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని చెప్పినప్పటికీ లక్షా 40 వేల నుంచి 70 వేల మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు.. ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో 90 శాతం మంది ఉద్యోగులు, కూటమికే ఓటు వేశారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

సొంతూళ్లకు తరలివచ్చిన ఓటర్లు
ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాదులో స్థిరపడిన వారితో పాటు ఇతర ప్రాంతాలలోనూ స్థిరపడిన వారు సంక్రాంతి పండగకు సొంత ఊర్లకు వచ్చిన దాని కంటే మించి వచ్చారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఐదు గంటలకు గమ్యస్థానానికి చేరాల్సిన వారు, ట్రాఫిక్ రద్దీ కారణంగా పది నుంచి 12 గంటలు సమయం తీసుకున్నప్పటికీ ఓపికతో వచ్చి కసితో ఓటు వేశారన్నారు. హైదరాబాదులో ఎన్నికలు ఉన్నప్పటికీ, రాష్ట్రంలో ఈ రాక్షసుడిని వదిలించుకోవాలనే ఉద్దేశంతో ఎవరికి వారు తమ సొంత ఊర్లకు వచ్చి ఓటు వేశారన్నారు.

ఒక్క హైదరాబాదు నుంచే కాకుండా విదేశాలలో స్థిరపడిన వారు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో స్థిరపడినవారు కూడా తమ గ్రామాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. కేవలం ఒక్క హైదరాబాదు నుంచే 20 లక్షల మంది ఓటర్లు రాష్ట్రానికి తరలివచ్చారని, అందులో మహా అయితే పది నుంచి 20 వేల మంది వైకాపా కు పొరపాటున ఓటు వేసి ఉంటారన్నారు. మిగిలిన 19 లక్షల 80 వేల మంది తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమికి ఓటు వేశారన్నారు.

జగన్మోహన్ రెడ్డి ఓడించేందుకు కసితో బయటకు వచ్చిన మహిళలు
మహిళలు అధికంగా ఓటింగ్ లో పాల్గొన్నారని, జగన్మోహన్ రెడ్డి దే విజయమని సాక్షి దినపత్రికలో రాసుకోవడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణంరాజు అన్నారు. జగన్మోహన్ రెడ్డి మహిళలకు చేసిన అన్యాయానికి కసితో వారు బయటకు వచ్చి ఓటు వేశారని తెలిపారు. సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తానని చెప్పి, మద్యం ద్వారా వచ్చే ఆదాయం తోనే అమ్మ ఒడి ఇతర సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తానని జగన్మోహన్ రెడ్డి జీవో జారీ చేశారని గుర్తు చేశారు.

మగువల మాంగల్యాలను తాకట్టు పెట్టి మహిళలకు ఏదో చేస్తున్నానని జగన్మోహన్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మద్యం ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలను జగన్మోహన్ రెడ్డి సంపాదించాడన్నది పచ్చి నిజమని మహిళలు గ్రహించారన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మహిళలకు అద్భుతమైన హామీలను ఇచ్చారన్నారు. ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 18 సంవత్సరాలు దాటిన మహిళలకు పింఛన్ వచ్చే వయసు వరకు నెలకు 1500 రూపాయలు అందించాలని నిర్ణయించారన్నారు .

దీనితో మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్ బూతుల వద్ద క్యూలైన్ల లో నిలబడి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే కసితో ఓటు వేశారని తెలిపారు. వైకాపా నాయకులు మధ్యాహ్నానికే పోలింగ్ కేంద్రాల వద్ద హ్యాండ్సప్ అని వెళ్లిపోయారన్నారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలయ్యిందని రచ్చబండ కార్యక్రమంలో నేను ఎప్పటినుండో చెబుతూ ఉన్నాను. పోలింగ్ రోజు మంత్రి అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, కొట్టు సత్యనారాయణ లపై ప్రజలు తిరగబడ్డారని గుర్తు చేశారు.

తెనాలి లో జరిగిన సంఘటన ప్రజల్లో వచ్చిన మార్పుకు అతిపెద్ద నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు. పోలింగ్ రోజు ఎప్పుడు తెల్లారుతుందా… క్యూలైన్లలో నిలబడి జగన్మోహన్ రెడ్డిని ఓడిద్దామా అని ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఎదురు చూస్తున్నారని నేను ఎప్పటినుండో రచ్చబండ కార్యక్రమంలో చెబుతూనే ఉన్నానని గుర్తు చేశారు.

సర్వేలకు అందని ప్రజాభిప్రాయం
గతంలో ఎంతోమంది ఎన్నో సర్వేలను నిర్వహించారని, కానీ సర్వేలకు ప్రజాభిప్రాయం అందలేదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. మూస పద్ధతిలో నిర్వహించే సర్వేలు ప్రజల నాడిని పసిగట్ట లేకపోయాయన్నారు. కొన్ని వేల మంది బాధితులు, దగా పడిన వారు ప్రతిరోజు నాకు ఫోన్ చేసే వారని, వారంతా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలను ఏకరువు పెట్టే వారన్నారు. తమ పేరును మాత్రం ఎక్కడా చెప్పవద్దని, ప్రజలకు అసలు విషయం చెప్పాలని కోరుకునే వారని తెలిపారు. ప్రజల భయం నాకు అర్థం అయిందన్న ఆయన, ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని తెలిసిందన్నారు.

పుట్టినరోజు నాడే మళ్లీ పుడతాననుకోలేదు
పుట్టినరోజు నాడే మళ్లీ పుడతానని అనుకోలేదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. నా పుట్టినరోజే చచ్చిపోయిన రోజు అవుతుందని అనుకున్నానని, పుట్టినరోజు తిరిగి మళ్లీ పుడతానని అనుకోలేదన్నారు. నాకు గుండె ఆపరేషన్ జరిగిన కొన్ని నెలల తర్వాత హైదరాబాదులో ఉండగా జగన్మోహన్ రెడ్డి మతానికి చెందిన ఒక పోలీసు అధికారి నన్ను కిడ్నాప్ చేసినంత పని చేశాడు. తొలుత జగన్మోహన్ రెడ్డి ఇంటికి తీసుకువెళ్లి కొట్టాలనుకున్నారని కానీ కేంద్ర బలగాలు నాతో ఉండడంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నారని తెలిపారు. నన్ను అక్రమంగా నిర్బంధించి సిఐడి కేంద్ర కార్యాలయానికి తరలించి చిత్రహింసలకు గురి చేశారన్నారు.

నన్ను చంపేయమని జగన్మోహన్ రెడ్డి ఆదేశించినప్పటికీ, డి ఐ జి ర్యాంకులో ఉన్న ఒక అధికారి భయపడి తనని తాను రక్షించుకోవడానికి సీఎం ఆదేశాలను కాదనుకొని, నన్ను చంపకుండా వదిలేశారని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు. ఈ సంఘటనకు ముందు తరువాత నా రచ్చబండ కార్యక్రమాలను తిలకిస్తే స్పష్టమైన మార్పు కనిపిస్తుందన్నారు. అప్పటివరకు జగన్మోహన్ రెడ్డిలో మార్పు వస్తే చాలని కోరుకున్నానని, ఎప్పుడైతే నన్ను చంపాలని చూశాడో ఆ తరువాత జగన్మోహన్ రెడ్డిని మార్చాలని నేను నిర్ణయించుకున్నానని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

నా పుట్టినరోజు అయిన మే 14వ తేదీన అపహరించి చిత్రహింసలకు గురిచేసి 15వ తేదీ తెల్లవారుజామున చంపించాలని జగన్మోహన్ రెడ్డి చూశారన్నారు. రాజకీయాలలో ఇటువంటి క్రూర మృగం ఉండకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాను. చనిపోవలసిన నన్ను భగవంతుడు అందుకే బ్రతికించాడని భావించి, మానవ రూపంలో ఉన్న ఈ మృగాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచడమే ధ్యేయంగా పని చేశానని తెలిపారు.

అప్పటివరకు పొత్తుల గురించి మాట్లాడలేదు
జగన్మోహన్ రెడ్డి పోలీసుల చేత నన్ను అపహరించి చిత్రహింసలకు గురి చేయనంతవరకు నేను పొత్తుల గురించి మాట్లాడలేదని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. ఎప్పుడైతే పోలీసుల చేత నన్ను చంపించాలని చూశాడో అప్పుడే పొత్తుల గురించి మాట్లాడా డని పేర్కొన్నారు. తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలువాల్సిన అవసరం ఉందని, ఆ తర్వాత బిజెపి వీరితో కలుస్తుందని చెప్పానని గుర్తు చేశారు.

బిజెపి పట్ల అప్పుడు ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయని, జగన్మోహన్ రెడ్డికి బిజెపి కొమ్ముకాస్తుందని ప్రజలంతా భావిస్తూ వచ్చారన్నారు. రెండు సంవత్సరాల క్రితమే ఈ పొత్తు ప్రతిపాదన గురించి నేను చెప్పానని గుర్తు చేశారు. అప్పట్లో ఈ పొత్తు ప్రతిపాదన నమ్మశక్యం కానీ నిజంగా ఉండిందన్నారు. ఎవరికి కూడా పాయింట్ వన్ పర్సెంట్ ఈ పొత్తు పై నమ్మకం లేదన్నారు. భీమవరంలో 7 నుంచి 8 నెలల క్రితం వరకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలవరని పందాలు కూడా కాశారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

మీ మీద నమ్మకంతోనే మేము పందాలు కాశామని మీరు చెప్పిందే నిజమయిందని చాలామంది నాతో చెప్పారన్నారు. వాస్తవంగా అందరూ కలవాలన్నది నా ఆశయమని… నిజం చేయగలనన్నది నా నమ్మకం అని ఆ దిశగానే పని చేసినట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డిని మార్చడం తప్ప మరొక ఆప్షన్ లేదని భావించానని ఈలోగా రకరకాల రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకోవడం, వారితో బీజేపీ జత కలవడం జరిగిందన్నారు.

కూటమి అత్యద్భుత విజయం ఖాయం
రాష్ట్రవ్యాప్తంగా కూటమి అత్యద్భుత విజయాన్ని సాధించడం ఖాయమని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన 40 నుంచి 50 మంది నాయకులు నేను మాట్లాడాను. ఎంతోమంది బాహాటంగానే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ముందుకు వచ్చారు. రాయలసీమ ప్రాంతంలో కూటమి కనీసంగా 35 స్థానాలను గెలుచుకుంటుందని, ఆ పైన గెలుచుకున్న ఆశ్చర్యపోనవసరం లేదన్నారు.

ఉభయగోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో కూటమికి తిరుగు లేదన్నారు. గతంలో బ్రదర్ అనిల్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లుగా 151 లో ఎటువైపు ఒకటి లేకుండా పోతుందోనని పేర్కొన్నారని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో 151 అంకె లోని వెనుక నున్న ఒకటి లేకుండా పోయే అవకాశం ఉందన్నారు. క్షేత్రస్థాయి వాస్తవాలను పరిశీలిస్తే, వైకాపాకు కేవలం 15 స్థానాలు మాత్రమే దక్కవచ్చునని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

పోలింగ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ కవళికలను గమనించానని, ఏడుస్తున్నాడని తెలిపారు. సజ్జల మీడియా సమావేశంలో సంధి ప్రేలాపనలను పేలారని, ఇక జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అన్ని సిద్ధం చేసుకుంటున్నారన్నారు.

సిబిఐ ని మేనేజ్ చేసుకుని విదేశాలకు వెళ్లేందుకు అనుమతి సాధిస్తారని, ఫలితాలు మెరుగ్గా ఉంటే తిరిగి వస్తారని, లేకపోతే ఏమి చేస్తారో చూడాలన్నారు. ఎన్నికల అనంతరం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పై వైకాపా ఉండే అవకాశం లేదని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఆ పార్టీలోని పెద్ద పెద్ద నాయకులు త్వరలోనే ప్రత్యామ్నాయ వేదికల వైపు అడుగులు వేస్తారన్నారు.

నియోజకవర్గంలో నా జన్మదిన, పునర్ జన్మదిన వేడుకలను జరుపుకున్నాను
నియోజకవర్గ పరిధిలో నా జన్మదిన, పునర్ జన్మదిన వేడుకలను జరుపుకున్నట్లు రఘురామకృష్ణం రాజు తెలిపారు. జైల్లో ఏదైతే శపథం చేశానో, ఆ శపథం, నా ఆశయం నెరవేరిందన్నారు. ఎన్నికల ఫలితాలకు ముందుగానే శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రజల కోరికను మన్నించినందుకు, ప్రజలకు రాజ్యాంగ హక్కులను తిరిగి కల్పించినందుకు కృతజ్ఞతలను తెలియజేస్తానని చెప్పారు.

ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ నిశ్చింతగా ఉండవచ్చునని, ఇన్నాళ్లు భయపడిన వారు నిర్భయంగా ఉండాలని, రాష్ట్ర రాజకీయ చిత్రపటంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకుండా పోతారన్నారు. సాక్షి దినపత్రికను చదివి ఎవరైనా పందాలు కాస్తే ఓడిపోతారని, మా పార్టీ నాయకులే బాగుపడతారని తెలిసినప్పటికీ, మీరు నష్టపోకూడదని చెబుతున్నట్లు రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు.

జగన్మోహన్ రెడ్డి జీసస్ కాదు… బైబిల్ లోని సైతాన్
జగన్మోహన్ రెడ్డి జీసస్ కాదని, బైబిల్ లోని సైతాన్ అని రఘురామకృష్ణం రాజు అన్నారు . నేను క్రైస్తవ మత వ్యతిరేకుడనని సాక్షి దినపత్రిక, టీవీ ఛానల్ పదేపదే తప్పుడు ప్రచారాన్ని చేసి, నన్ను క్రైస్తవ ద్వేషిగా చిత్రీకరించే ప్రయత్నం చేశాయన్నారు. ఇక నా ప్రత్యర్ధులు ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ, ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారన్నారు . నేను క్రైస్తవ మత వ్యతిరేకుడినని ప్రచారం చేయడం దారుణమని రఘు రామ కృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలోనూ ఇదే విషయాన్ని చెప్పానని, అయినా కావాలని కొంతమంది అదే పనిగా ప్రచారం చేస్తున్నారన్నారు. నేను క్రైస్తవ మతానికి వ్యతిరేకిని కాదని, ఏ వ్యక్తి అయితే ఈ రాష్ట్రానికి శనిలా దాపురించారో, ఆ వ్యక్తి యాదృచ్ఛికంగా క్రైస్తవుడని పేర్కొన్నారు. అతడు హిందువైనా, ముస్లిం అయినా నేను కచ్చితంగా వ్యతిరేకంగా పోరాడి ఉండే వాడినని తెలిపారు. ప్రజా కంఠకుడైన వ్యక్తికి వ్యతిరేకంగా పోరాడుతున్న నన్ను, క్రైస్తవ ద్వేషిగా చిత్రీకరించడం అన్యాయం అన్నారు.

నేను క్రైస్తవ మతాన్ని గౌరవ స్థానాన్ని పేర్కొన్న రఘురామకృష్ణంరాజు, తాను బాల్యం లో మిషనరీ స్కూల్లో, కాలేజీలలో చదువుకున్నానని గుర్తు చేశారు. గతంలోనూ ప్రధానమంత్రి మోడీ రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంలోను క్రైస్తవ సంఘాలను అడ్డుపెట్టుకొని విజయవాడ, గుంటూరు రైల్వే స్టేషన్లలో నాకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ర్యాలీని నిర్వహించేలా ఉసిగొలిపారన్నారు. అలాగే నాపై తప్పుడు కేసులు పెట్టించే ప్రయత్నం విస్తృతంగా చేశారని తెలిపారు.

150 పైగా స్థానాలలో కూటమి గెలుపు
రాష్ట్రంలో 150 పైగా స్థానాలలో కూటమి విజయం సాధించి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవి ప్రమాణ స్వీకారం చేస్తారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు 50 నుంచి 55 వేల మెజారిటీ లభిస్తుందని ఆశించినప్పటికీ, 45 వేల మెజారిటీ లభించే అవకాశం ఉందన్నారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు 60 వేల మెజారిటీతో విజయం సాధించబోతున్నారని తెలిపారు. ఓటుకు నాలుగు నుంచి ఐదువేల రూపాయలు కుప్పం నియోజకవర్గంలో వైకాపా నేతలు పంచినప్పటికీ, ఓటర్లు చంద్రబాబు నాయుడు నాయకత్వాన్నే కోరుకున్నారన్నారు.

సత్తెనపల్లి లో మంత్రి అంబటి రాంబాబు పై కన్నా లక్ష్మీనారాయణ భారీ మెజారిటీతో విజయం సాధిస్తారన్నారు. గోదావరి జిల్లాలలో వార్ వన్ సైడేనని, కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని తెలిపారు. రెండవసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కోరగా పెద్దిరెడ్డి ఓటమి పాలవుతున్నారని, ఇక జగన్మోహన్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం ఎక్కడ చేస్తారంటూ ఎద్దేవా చేశారు.

వైకాపా తరపున పోటీ చేసిన ప్రముఖ నాయకులంతా ఈసారి ఓడిపోబోతున్నారని చెప్పారు. రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గెలవబోతున్నారని, జగన్మోహన్ రెడ్డి తల్లి, పినతల్లి ఇద్దరు చెల్లెలు ఆయన్ని ఓడించాలనికోరుతుంటే, మహిళలు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేస్తారని మీడియా ప్రతినిధులను రఘురామకృష్ణం రాజు ఎదురు ప్రశ్నించారు.

ఉండి లో మంచి మెజారిటీతో గెలుస్తా
ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో మంచి మెజారిటీతో విజయం సాధిస్తానని రఘురామ కృష్ణంరాజు ధీమా వ్యక్తం చేశారు. నాపై పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు ఒకే పార్టీకి చెందిన వారిని, అధికారికంగా బరిలో నిలిచిన అభ్యర్థికి, అనధికారికంగా బరిలో నిలిచిన అభ్యర్థికి వైకాపా నాయకత్వం ఎప్పుడు ఎంతెంత ఆర్థిక సహాయం చేసిందో లెక్కలన్నీ ఉన్నాయన్నారు

Leave a Reply