Suryaa.co.in

Andhra Pradesh

మహిళలకు గౌరవం, భరోసా కల్పిస్తుంటే..ప్రతిపక్షాల ఏడుపేంటి?

– మహిళలకు ఆసరా ద్వారా భరోసా ఇచ్చిన సీఎం జగన్
– మరో 30 ఏళ్ళపాటు జగనే ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు ఆశీర్వదిస్తారు
– ఓటమి తర్వాత టీడీపీ నేతల బుర్రలు పనిచేయట్లేదు
– డిప్యూటీ సీఎం,రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్
ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పెద్ద ఎత్తున అన్నివర్గాల ప్రజలకు చేయూత ఇచ్చి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా గౌరవాన్ని పెంచారు. అంతేకాకుండా మహిళా సోదరీమణులకు ప్రతి పథకంలోనూ అగ్రతాంబూలం ఇచ్చి, వారికి అన్నిరంగాల్లో పెద్దపీట వేశారు.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో టీడీపీ శకం ముగిసింది. గత టీడీపీ ప్రభుత్వంలో ఆ వర్గం, ఈ వర్గం అని లేదు, అన్ని వర్గాల ప్రజలు ఎన్నెన్నో ఇబ్బందులు పడ్డారు. వారందరికి ఒక చుక్కానీలా, దిక్సూచిగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్ నిలబడ్డారు. రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు, అట్టడుగు వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై సమగ్రంగా అవగాహన ఉన్న జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక.. ఆ వర్గాల ప్రజలకు మేలు చేయడంతోపాటు, మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా, వారికి సమాజంలో గౌరవం పెరిగేలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు.
గతంలో పనిచేసిన కొన్ని ప్రభుత్వాలు కేవలం రాజకీయ లబ్ది కోసమే పైకి మాటలు చెప్పి, అధికారంలోకి వచ్చాక అందుకు భిన్నంగా వ్యవహరించేవి. ఇందుకు తెలుగుదేశం పార్టీనే ఉదాహరణ. ప్రజలతో అవసరం ఉన్నంతవరకూ చంద్రబాబు నాయుడు ప్రజలను ఏదోవిధంగా మోసం చేసి, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన వాగ్దానాలను ఎలా చెత్తబుట్టలో పడేశాడో చూశాం. మరి నేడు రాజకీయాల్లో జగన్ కొత్త ఒరవడిని తెచ్చారు. మాట ఇస్తే.. అది ఎంత కష్టమైనా, నష్టమైనా నెరవేర్చేదాక విశ్రమించని నాయకుడు జగన్ మోహన్ రెడ్డి .
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో, మండలాల్లో దసరా సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పండగ వస్తేనే కాదు, సాధారణంగా సంతోషకరమైన పరిణామాలు తమ జీవితాల్లో వచ్చినప్పుడే సంబరాలు జరుగుతాయి. జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పటినుంచి మహిళలలో ఒక నూతన ఉత్సాహం, గౌరవం వచ్చింది. మహిళలు ఆర్థికంగా పరిపుష్టి చెందితే సమాజం ఆర్థికంగా ముందంజలో ఉంటుంది అని నమ్మిన నాయకుడు జగన్ . అన్ని రంగాల్లో మహిళలు ముందు ఉండాలని, మహిళా సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన పరిపాలన ద్వారా అడుగులు వేస్తున్నారు.
మహిళలు సగర్వంగా తలెత్తుకునేలా రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగుతోంది. మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తూ.. వారి అభ్యున్నతికి కృషి చేస్తుంటే.. పొద్దున లేచిన దగ్గర నుంచీ ప్రతిపక్షాలు రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని ప్రచారం చేస్తూ, దొంగ ఏడుపులు ఏడుస్తూనే ఉన్నాయి. మహిళ ఎక్కడైతే గౌరవించబడుతుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారని నమ్మి, ఆ దిశగా మహిళలకు ఆసరా, భరోసా, గౌరవం కల్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ .
వైయస్సార్‌ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఇప్పటివరకూ జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రజలు మా పార్టీకి అఖండమైన మెజార్టీ ఇచ్చి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వానికి పట్టం కట్టారు. ఆలోచనాపరుడు, విజ్ఞతగల నాయకుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. దేశంలోనే అత్యంత సమర్థవంతమైన ముఖ్యమంత్రుల జాబితాలో వైఎస్‌ జగన్‌ తొలి మూడు స్థానాల్లో ఉన్న విషయం తేటతెల్లం చేస్తోంది.
గ్రామ, వార్డు సచివాలయాలు- వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా 4 లక్షల ఉద్యోగాల్లో ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా నియామకాలు జరిగాయి. వ్యవసాయం, విద్యా, వైద్యంతో పాటు ఇతర సంక్షేమ పథకాలు ప్రజలకు పెద్ద ఎత్తున, వారి గుమ్మం వద్దకే వాలంటీర్లు వెళ్ళి అందిస్తున్నారు. అమ్మ ఒడి, ఆసరా, చేయూత, వైయస్సార్‌ పెన్షన్‌ కానుక.. తదితర అనేక కార్యక్రమాలను ఈ ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా అమలు చేస్తుంది.
మరోవైపు అన్నివర్గాలను గౌరవించే విధంగా అయిదుగురు ఉప ముఖ్యమంత్రులను నియమించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రాజకీయ పదవుల్లోనూ, సంక్షేమ కార్యక్రమాల్లోనూ అత్యంత గౌరవం ఇచ్చారు. ఏదైనా ఉన్నది ఉన్నట్లు, కుండబద్ధలు కొట్టినట్లు చెప్పే ధైర్యం ఉన్న నాయకుడు వైఎస్‌ జగన్‌.
సుదీర్ఘ పాదయాత్ర సమయంలో ప్రజలకు ఏం కావాలో, వారి సమస్యలు ఏమిటో వైఎస్‌ జగన్‌ దగ్గరగా చూసి తెలుసుకున్నారు. మహిళల భద్రత కోసం పటిష్టమైన దిశ చట్టం తీసుకురావడం, అలాగే పరిశ్రమలు నెలకొల్పితే స్థానికులకు 75శాతం ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇవన్నీ ప్రజలకు ఒక ఆత్మస్థైర్యం కలిగించే కార్యక్రమాలు.
13 జిల్లాలు అభివృద్ధి కావాలంటే వికేంద్రీకరణ అవసరమని మూడు రాజధానులు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో పాలన సులభతరంగా ఉండాలంటే వికేంద్రీకరణ అవసరం, అంతేకాకుండా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇది దోహదపడుతుంది. ఉత్తరాంధ్ర అశ్రద్ధ చేయబడిన ప్రాంతం. ఇక్కడ ప్రాంత ప్రజలు 63శాతం వ్యవసాయ ఆధారంతో జీవనం సాగిస్తున్నారు. వంశధార, పోలవరం ప్రాజెక్ట్‌లు పూర్తి చేయడం ద్వారా నీటివనరులు రైతులకు అందుతాయి.
వ్యవసాయాన్ని లాభసాటిగా తీసుకువెళ్లాలని, రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విత్తనం మొదలుకుని, పంట అమ్ముకునేవరకూ వారికి ప్రభుత్వం అండగా ఉంటూ, రైతులకు ఎంత చేసినా తక్కువే అనే భావనలో ముఖ్యమంత్రి ఉన్నారు. సమాజంలో ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యతగా గుర్తించిన నాయకుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. ఇలాంటి మంచి ముఖ్యమంత్రి పాలనలో మరెన్నో విజయాలు సాధించేందుకు ప్రజల సహకారం అవసరం.
నాడు-నేడు కార్యక్రమం ద్వారా విద్య, వైద్య వ్యవస్థల రూపు మార్చుతున్నారు. కేరళ లాంటి అత్యధిక అక్షరాస్యత ఉన్నరాష్ట్రం కన్నా మిన్నగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేలా చేస్తున్నారు. అలాగే 16 మెడికల్‌ కాలేజీలను ఒకేసారి మంజూరు చేశారు. కరోనా లాంటి మహమ్మారి వ్యాప్తిని సమర్థవంతంగా కట్టడి చేయడమే కాకుండా, ప్రతి ఒక్కరీకి వ్యాక్సినేషన్‌ అందేలా చర్యలు చేపట్టడం, ఆస్పత్రులలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం జరుగుతోంది.
ఇలాంటి గొప్ప మనసు ఉన్న ముఖ్యమంత్రికి మరింత అండగా ఉంటూ.. మరో 30ఏళ్ల పాటు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలో ఉండేలా ప్రజలంతా అండగా ఉండాలని, ఆశీర్వదించాలని కోరుతున్నాం. రాష్ట్రంలోని అన్నివర్గాల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని, అందర్ని సమన్వయం చేసుకుంటూ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వాన్ని బలపడేలా మరింత సమర్థవంతంగా పనిచేయాలి.
తెలుగుదేశం పార్టీ నాయకుల విమర్శలు, వ్యాఖ్యలు చూస్తే వాళ్లు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదు. ఓటమి పాలవడంతో వారి ఆలోచనలు, వారి బుర్రలు సరిగా పనిచేయడంలేదనే అనుమానం కలుగుతోంది. వాటి తాలుకా పరిణామాలే వారు చేసే వ్యాఖ్యలని భావిస్తున్నాం. కనీసం భవిష్యత్‌లో అయినా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా బాధ్యత నిర్వర్తించేలా ఉండి, ప్రభుత్వంపై అనవసరపు విమర్శలు తగ్గించుకుంటే మంచిదని హితవు చెబుతున్నాం. టీడీపీ ఆరోపణలు గురివింద గింజ సామెతలా ఉంటాయి. వాళ్ల లోపాలను మర్చిపోయి… ఎదుటవారి లోపాలను ఎత్తిచూపేందుకు ముందుంటారు.
విద్యుత్‌ సమస్య తలెత్తిందని, రాష్ట్రాన్ని చీకటి రాజ్యం అంటూ టీడీపీ మాట్లాడటం అర్థరహితం. విద్యుత్‌ కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు ప్రభుత్వం తన శాయశక్తులా పనిచేస్తోంది. చౌకబారు రాజకీయాలు టీడీపీ మానుకోవాలి. ఇప్పటికే గడ్డి కరిచేలా వారికి ప్రజలు బుద్ది చెప్పారు. ముందు ముందు వారికి చావు దెబ్బ తప్పదు. మీడియా సమావేశంలో మాజీ ఎంపీ కిల్లి కృపారాణి కూడా పాల్గొని మాట్లాడారు.

LEAVE A RESPONSE