Suryaa.co.in

Editorial

‘మంత్రీజీ’ మాకొద్దు…మార్చేయండి!

పాతనేతలకు పాతరేశారు
-ఆయన సారథ్యంలో అంతా వైఫల్యమే
– కాబోయే సీఎంగా ప్రచారం చేసుకుంటున్నారు
— టీఆర్‌ఎస్‌తో మ్యాచ్‌ఫిక్సింగ్‌పై చర్యలేవీ?
– సంజయ్, కిషన్‌రెడ్డినీ లె క్కచేయడం లేదు
– తెలంగాణ బీజే పీ మార్గదర్శి మంత్రి శ్రీనివాస్‌పై సీనియర్ల తిరుగుబాటు
– ఢిల్లీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ సీనియర్లు
– రంగంలోకి ఇంద్రసేనారెడ్డి
– తెలంగాణ బీజేపీలో ‘ఆత్మగౌరవ’ తిరుగుబాటు
( మార్తి సుబ్రహ్మణ్యం, హైదరాబాద్)
ఆయన తెలంగాణలో బీజేపీకి మార్గదర్శి. పార్టీ పరిభాషలో సంఘటనా మంత్రి. అధికారికంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రులు ఎంతమంది ఉన్నా వారంతా నామమాత్రావశిష్టులే. వారికి పేరుకే పదవులు. పెత్తనమంతా సదరు సంఘటనా మంత్రిదే. నామినేటెడ్ పోస్టు నుంచి కోర్ కమిటీ వరకూ ఎవరుండాలని డిసైడ్ చేసేది ఆయనే. ఇలా దాదాపు ఎనిమిదేళ్ల నుంచి ఎదురులేకుండా ఆ పదవిలో ఉన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మంత్రి శ్రీనివాస్‌జీపై తెలంగాణ సీనియర్లు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఆయన మాకొద్దు.. మార్చేయమని ఢిల్లీకి ఫిర్యాదు చేశారు. ఏకంగా రెండు డజన్ల మంది సీనియర్లు శివారు ప్రాంతంలో భేటీ అయి, పాతవారికి పాతరేస్తున్న మంత్రిజీని మార్చకపోతే, తెలంగాణలో పార్టీకి తెరవు ఉండదని సంఘ్ పెద్దలకు స్పష్టం చేశారు. హైదరాబాద్ జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధి ఓటమికి కారణమయిన శ్రీనివాస్‌జీని ఎలా కొనసాగిస్తారని నిలదీస్తున్నారు. ఈవిధంగా ఆయనపై తిరుగుబాటు చేయడం గత మూడేళ్ల వ్యవధిలో ఇది రెండోసారి. అయినా మంత్రిజీ పీఠాన్ని ఎవరూ కదిలించలేకపోయారు. దటీజ్ మంత్రీజీ!
తెలంగాణ బీజేపీలో తిరుగుబాటుకు తెరలేచింది. పార్టీకి కర్త కర్మ క్రియగా ఉన్న రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి , ‘సంఘటనా మంత్రి’గా పిలుచుకునే మంత్రి శ్రీనివాస్‌జీపై 24 మంది సీనియర్లు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ధర్మారావు, రాజేశ్వరరావు, చింతా సాంబమూర్తి, జనార్దన్‌రెడ్డి, వెంకటరమణి, రాములు, మల్లారెడ్డి, అల్జాపూర్ శ్రీనివాస్, శ్యాంసుందర్ సహా 24 మంది సీనియర్లు ఓ వ్యవసాయక్షేత్రంలో భేటీ అయ్యారు. ఆ సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌జీని ఆ పదవి నుంచి తొలగించకపోతే, రాష్ట్రంలో పార్టీకి భవిష్యత్తు ఉండదని, జాతీయ నాయకత్వానికి ఖరాఖండీగా స్పష్టం చేశారు. గత ఎనిమిదేళ్లుగా అదే పదవిలో కొనసాగుతున్న మంత్రి శ్రీనివాస్‌జీ వల్ల పార్టీకి నయాపైసా లాభం లేక పోగా, పార్టీ ఓటమి పాలవుతోందని సీనియర్లు ఢిల్లీకి వివరించారు. పార్టీ జాతీయ సంఘటనా మహామంత్రి బీఎల్ సంతోష్ పేరు చెప్పి, ఆయన తన పదవి కాపాడుకుంటున్నారని సీనియర్లు ధ్వజమెత్తుతున్నారు.
మంత్రి శ్రీనివాస్‌జీ అవలంబిస్తున్న ఏకపక్ష నిర్ణయాలతో సీనియర్లు పార్టీకి దూరమవుతున్నారని.. వారంతా జాతీయ నాయకత్వంతోపాటు, సంఘ్ నాయకత్వానికీ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. నిజానికి వీరంతా పార్టీ ఆవిర్భావం నుంచీ వివిధ హోదాల్లో పనిచేస్తున్నవారే. మంత్రి శ్రీనివాస్‌జీ నిర్ణయాల వల్ల, ప్రస్తుతం పార్టీలో వారి ఉనికి ప్రశ్నార్ధకంగా మారింది. సొంత నియోజకవర్గాల్లో గౌరవం కరవయింది. ఆయన వల్లే తాము పార్టీలో అనాధలయ్యామన్నది వారి ఆవేదన, ఆగ్రహం.
రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, కేంద్రమంత్రులు, ఎంపీలను బేఖాతరు చేసి మంత్రి శ్రీనివాస్‌జీ, రాష్ట్రంలో తనకంటూ సొంత వర్గాన్ని ఏర్పాటుచేసుకుని, కాబోయే సీఎంగా పార్టీ వర్గాల్లో ప్రచారం చేసుకుంటున్నారని వారు ఢిల్లీ నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. గతంలో త్రిపుర ఇన్చార్జిగా పనిచేసిన సునీల్ దియోధర్ మాదిరిగా, మంత్రి శ్రీనివాస్‌జీ కూడా కాబోయే సీఎంగా ప్రచారం చేసుకున్నారని నాయకత్వానికి వివరించినట్లు సమాచారం.
మంత్రి శ్రీనివాస్‌జీ పార్టీకి తొలినుంచీ పనిచేస్తున్న సీనియర్లను పక్కనబెట్టారని, ఇప్పుడు కనీసం నియోజకవర్గాల్లో కూడా పార్టీ సమావేశాలకు ఆహ్వానం లేకుండా చేశారని, ఆ భేటీలో ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏబీవీపీలో తప్ప పార్టీ వ్యవహారాల్లో పనిచేసిన అనుభవం ఏమాత్రం లేని మంత్రీజీని, ఇన్నాళ్ల పాటు ఎలా కొనసాగిస్తారని సీనియర్లు ప్రశ్నించారు.
ఇటీవలి జరిగిన హైదరాబాద్ జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలున్న పార్టీ అభ్యర్ధి రాంచందర్‌రావు ఓటమికి, మంత్రి శ్రీనివాస్‌జీనే కారణమని ఫిర్యాదు చేశారు. యాక్టివ్‌గా పనిచేసే 46 మంది నేతలను ఎన్నికల సమయంలో మంత్రి శ్రీనివాస్‌జీ కావాలనే ఇతర జిల్లాలకు ఇన్చార్జిలుగా పంపించారని గుర్తు చేశారు. దానిపై ఇప్పటిదాకా పార్టీలో చర్చ లేకపోవడం, స్వయంగా అభ్యర్ధి ఫిర్యాదు చే సినా పట్టించుకోకపోవడంపై సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.
కాగా తనపై ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్‌జీ, స్వయంగా రాంచందర్‌రావు ఇంటికి వెళ్లి ఫిర్యాదుపై ఆరా తీసినట్లు తెలిసింది. అయితే తాను ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని, మీ వల్లే తాను ఓడినట్లు ఆ సందర్భంగా రామచందర్‌రావు నిర్మొహమాటంగా చెప్పినట్లు పార్టీ వర్గాల సమాచారం.
‘పొలిటికల్ మ్యాచ్‌ఫిక్సింగ్’పై చర్యలు, విశ్లేషణ ఏదీ?
ఇదిలాఉండగా గత అసెంబ్లీ ఎన్నికల ముందు.. హైదరాబాద్ నగరంలోని ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్ధులపై బలహీనమైన అభ్యర్ధులను నిలబెట్టే అంశంలో పెద్ద కథ నడిచింది. ఇప్పుడు కీలకనేతగా ఉన్న నేతకు సలహాదారుగా ఉన్న ఉస్మానియా యూనివర్శిటీ ప్రముఖుడి రాయబారిగా టీఆర్‌ఎస్‌తో జరిగిన మ్యాచ్‌ఫిక్సింగ్‌పైనా పార్టీ నాయకత్వం ఇప్పటిదాకా చర్యలు తీసుకోకపోగా, వారిలో కొందరికి పదవులిచ్చి గౌరవించిన వైనంపైనా పార్టీలో చర్చ జరుగుతోంది. ఇలాగైతే కార్యకర్తల్లో నాయకత్వంపై విశ్వసనీయత ఎలాఉంటుందని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు.
అదే విధంగా లింగోజీగూడ డివిజన్ ఉప ఎన్నికలో పార్టీ నాయకత్వం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కుమ్మక్కయిన ఫలితంగా గెలిచిన సీటు ఉప ఎన్నికలో పోగొట్టుకోవడంపైనా ఇప్పటివరకూ చర్యలు గానీ, విశ్లేషణ గానీ జరగలేదని పార్టీ సీనియర్లు చెప్పారు. ఆ వ్యవహారంలో మంత్రిజీ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆదేశాలు లేకుండానే బీజేపీ నేతలు ప్రగతిభవన్‌కు ఎలా వెళతారు? కానీ దానితో ఎలాంటి సంబంధం లేని రాంచందర్‌రావును బలిచేయడం ఏం న్యాయం’ అని మరో సీనియర్ నేత ప్రశ్నించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు చోట్ల టీఆర్‌ఎస్‌తో జరిగిన మ్యాచ్‌ఫిక్సింగ్‌తోపాటు, ఇటీవలి లింగోజీగూడ మ్యాచ్‌ఫిక్సింగ్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటేనే బీజేపీ-టీఆర్‌ఎస్ మ్యాచ్‌ఫిక్సింగ్ లేదన్న భావన స్పష్టమవుతుందని, లేకపోతే ఇద్దరి మధ్య మ్యాచ్‌ఫిక్సింగ్ ఉందని క్యాడర్ భావించే ప్రమాదం ఉందని పలువురు సీనియర్లు హెచ్చరించారు.
ఇక గత అసెంబ్లీ ఎన్నికల ముందు మంత్రి శ్రీనివాస్‌జీ ఆధ్వర్యంలో ఒక్కో అసెంబ్లీకి ఒక మోటర్ వెహికల్, నెలకు పదివేల జీతం ఇచ్చి చేసిన నియామకాల వల్ల, పార్టీకి ఒకే ఒక్క సీటు వచ్చిందని బీజేపీ సీనియర్ల సమావేశం నేతలు గుర్తు చేసినట్లు సమాచారం. కొంత మందికి 10 వేలు, మరికొందరికి 20, ఇంకొందరికి 22 వేలు మంత్రిజీ ఇష్టానుసారం ఇచ్చారని గుర్తు చేశారు. ఫుల్‌టైమర్లకు ఇచ్చిన ఆ వాహనాల్లో కొన్ని ఇప్పటికీ అలాగే నిరుపయోగంగా పడి ఉండగా, అందులో చాలావరకూ కనిపించలేదని, అలాగే ఆయన ఏర్పాటుచేసిన టెలీకాలర్ వ్యవస్థ వల్ల పార్టీకి జరిగిన ప్రయోజనం సున్నా అని సీనియర్లు విశ్లేషించినట్లు తెలిసింది.
విశ్లేషణలు ఏవీ?
పార్టీ వ్యవస్థాపక దినం నుంచి పనిచేసిన వారు, ఇప్పుడు మంత్రి శ్రీనివాస్‌జీ దయాధర్మం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితిని జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. మంత్రిజీ నిర్ణయించిన వారికే నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు వస్తున్నాయని, పార్టీ వారిని కాకుండా ఏబీవీపీ నుంచి వచ్చిన వారినే ఆయన ఎక్కువ ప్రోత్సహిస్తున్నారని నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పొలిటికల్ అఫైర్స్-ఆర్గనైజేషన్ వేర్వేరయినప్పటికీ ఆయన, రాష్ట్ర అధ్యక్షుడి అధికారాలను కూడా హైజాక్ చేస్తున్నారని పలువురు సీనియర్లు వ్యాఖ్యానించినట్లు సమాచారం. అధ్యక్షుడు సంజయ్‌తో ఆయనకు సమన్వయం లేదన్నారు. ఇటీవలి హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల ఇమేజ్ వల్లే పార్టీ గెలిచింది తప్ప, అందులో మంత్రి శ్రీనివాస్‌జీ గొప్పతనం ఏమీ లేదని.. నాగార్జునసాగర్, హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్ధి ఎంపికలోపం వల్ల, డిపాజిట్లు కూడా దక్కలేదని విశ్లేషించారు. ‘గతంలో ఏ ఎన్నికలయినా వాటిపై విశ్లేషణ ఉండేది. ఇప్పుడు సాగర్, హుజూర్‌నగర్, లింగోజీగూడ, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై విశ్లేషణ లేదు. హుజూరాబాద్ విజయంపై విశ్లేషణ కూడా లేద’ని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా పార్టీ నాయకులకు సమయం కేటాయించడం లేదని, ఆయన ఎక్కువగా ఢిల్లీలోనే గడుపుతున్నందున సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాని పరిస్థితి ఉందని అటు పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈటల ఆత్మగౌరవం సరే.. మా ఆత్మగౌరవం సంగతేమిటి?
హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను గెలిపించి ఆయన ఆత్మగౌరవం నిలబెట్టామన్న పార్టీ పెద్దలు, పార్టీ స్థాపన నుంచి పనిచేస్తున్న తమ లాంటి సీనియర్ల ఆత్మగౌరవాన్ని పట్టించుకోరా? అని భేటీ అయిన సీనియర్లు నాయకత్వాన్ని ప్రశ్నించారు. ‘‘ ఎమర్జెన్సీ, అయోధ్య ఉద్యమంలో పోలీసు దెబ్బలు తిని కేసులు పెట్టించుకుని, రామమందిర నిర్మాణంలో విరాళాలు వసూలు చేయడంతోపాటు, ఇన్నేళ్ల ఉద్యమంలో పోలీసు లాఠీ దెబ్బలు తిన్న 150 మంది ఆత్మగౌరవం కాపాడటం మంత్రిజీ-అధ్యక్షుడికి ముఖ్యం అనిపించలేదా? వయసు అయిపోయిందని కొందరిని, ఆరోగ్యాలు బాగోలేవని మరికొందరిని జిల్లా, రాష్ట్ర స్థాయి సమావేశాలకు పిలవకుండా పక్కకుపెట్టడమేనా పార్టీ మాకిచ్చే గౌరవం’ అని సమావేశంలో పాల్గొన్న నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమ్మడి రాష్ట్రం ఉన్నంతవరకూ హైదరాబాద్ నగరానికి రాష్ట్ర కమిటీలో ప్రాధాన్యం ఇచ్చే సంప్రదాయం ఉండేదని, మంత్రిజీ దానికి పాతర వేశారని సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా పార్టీలో కొత్తవారికి ప్రాధాన్యం ఇవ్వడాన్ని తప్పుపట్టనప్పటికీ, సీనియర్లను పక్కనపెట్టడంపైనే సమావేశంలో అసంతృప్తి వ్యక్తమయినట్లు సమాచారం. ‘పార్టీలో కొత్తవారు రావలసిందే. పార్టీ విస్తరణను ఎవరూ తప్పుపట్టరు. కానీ మొదటి నుంచీ పార్టీ జెండా మోసిన వారిని పక్కనబెడితే ఎలా? పునాదులు లేకుండా భవంతులు నిర్మాణం కావు కదా?అలాగయితే మరి మేం చేసిన త్యాగాలకు అర్ధం ఏమిటి? ఇదే విధానం పాటిస్తే సీనియర్లు పనిచేస్తారా’ అని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
కాగా మంత్రి శ్రీనివాస్‌జీ వ్యవహారశైలిపై స్వయంగా ఫిర్యాదు చేయాలని తీర్మానించిన సీనియర్లు, తొలిదశలో ఆమేరకు ఢిల్లీ పార్టీతోపాటు, తెలంగాణలోని ఆరెస్సెస్ మ్రుఖులకూ ఆయన పనితీరుపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ముందు మంత్రిజీ తీరును వివరించేందుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమయం కోరగా, ఆయన అంగీకరించి.. తర్వాత అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంపై సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.
indrasenareddyదీనితో స్పందించిన నాయకత్వం.. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నల్లు ఇంద్రసేనారెడ్డిని రంగంలోకి దింపినట్లు సమాచారం. వివాదరహితుడు, సొంత అజెండా లేని నేతగా పేరున్న ఇంద్రసేనారెడ్డి ద్వారా, అసంతృప్తితో ఉన్న సీనియర్ల సమస్య తెలుసుకుని, వారిని బుజ్జగించే బాధ్యత అప్పగించినట్లు పార్టీ వర్గాల సమాచారం. కాగా ఈనెలాఖరులో సీనియర్లు ఢిల్లీకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

LEAVE A RESPONSE