నిబంధనల మేరకే కల్లాలను నిర్మించాం

-రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం రూ. 150 కోట్లు రికవరీ చేయడం అన్యాయం
-కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ హుజూరాబాద్ లో మహా ధర్నా
-పాల్గొన్న బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి

రాష్ట్రంలోని రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నిబంధనల మేరకు కల్లాల నిర్మాణం చేపడితే… ఆ కల్లాల నిర్మాణాన్ని తప్పుపడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 150 కోట్ల పది లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రికవరీ చేయడం అన్యాయమని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండల కేంద్రంలో బీ ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ధర్నా లో వినోద్ కుమార్ మాట్లాడారు. రైతులు తమ వడ్లను పచ్చి వడ్లను ఆరబెట్టుకునేందుకు రైతుల కోసం కల్లాలను నిర్మిస్తే కేంద్ర ప్రభుత్వం అందుకు వెచ్చించిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్యాయం గా రికవరీ చేసిందని, అందుకు నిరసనగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలను నిర్వహించామని వినోద్ కుమార్ తెలిపారు.
ఉపాధి హామీ పథకం నిబంధనలో ఉన్న కమ్యూనిటీ స్టోరేజ్ నిబంధన మేరకు చట్ట ప్రకారం రైతు కలలను కల్లాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

రైతులకు అన్ని రకాలుగా అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తోందని, అందులో భాగంగానే గ్రామాల్లో కల్లాలను నిర్మించామన్నారు. రోడ్లపై వడ్లను ఆరబోయొద్దని, దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఆలోచించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిందని, అయితే అంతకన్నా ముందే ముందు చూపుతో రాష్ట్ర ప్రభుత్వం కల్లాలను నిర్మించిందని వినోద్ కుమార్ వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వ పనితీరును అభినందించాల్సింది పోయి అందుకు భిన్నంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్యాయంగా రూ 150 కోట్ల 10 లక్షల రూపాయలు రికవరీ చేసిందని వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రతి ఒక్కరు ఖండించాలని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply