Suryaa.co.in

Andhra Pradesh

థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాసుపత్రిలో పీఎస్ఏ ప్లాంట్ ను ఏర్పాటు చేశాం

– 140 ఆసుపత్రుల్లో ఏర్పాటుకు సీఎం జగన్ చర్యలు
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, సెప్టెంబర్ 8: కరోనా థర్డ్ వేవ్ సన్నద్ధతపై ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, దీనిలో భాగంగానే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్ ను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో థర్డ్ వేవ్ ను దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్న చర్యలపై మంత్రి కొడాలి నాని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ 50, అంతకంటే ఎక్కువ బెడ్స్ కల్గిన ఆసుపత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సీఎం జగన్మోహనరెడ్డి నిర్ణయించారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 140 ఆసుపత్రుల్లో వచ్చే అక్టోబర్ 6 వ తేదీ నాటికి ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ప్రభుత్వం నెలకొల్పుతోందన్నారు. కరోనా సెకండ్ వేవ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నామని చెప్పారు. గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేంద్రం ద్వారా రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. ఆక్సిజన్ కొరత, సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా 50 డీ – టైప్ సిలిండర్లను తాను సమకూర్చానని చెప్పారు. ఆక్సిజన్ సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. ప్రముఖ పురుగుమందుల కంపెనీ అదమా ప్రైవేట్ లిమిటెడ్ తో మాట్లాడి గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో పీఎస్ఎ ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేశానని చెప్పారు. 300 బెడ్స్ కు నిరంతరాయంగా ఆక్సిజన్‌ను సరఫరా చేయగలమన్నారు. అలాగే ఈ ప్లాంట్ ద్వారా అవసరమైన మేర ఆక్సిజన్‌ను సిలిండర్లలో నింపి అందుబాటులో ఉంచుకుంటున్నామన్నారు. కరోనా థర్డ్ వేవ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో పిడియాట్రిక్ వార్డును సిద్ధం చేశామని తెలిపారు. ఈ వార్డులో 20 ఆక్సిజన్ బెడ్స్ ఉంటాయని, వీటిలో 10 బెడ్స్ ను ఐసీయూకు కేటాయించామని మంత్రి కొడాలి నాని తెలిపారు.

LEAVE A RESPONSE