* బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
* ‘రైతు బడి- అగ్రి షో’ను ప్రారంభించిన మంత్రి
* సాగులో సాంకేతికతకు ప్రాధాన్యమిస్తున్న చంద్రబాబు
* రాయలసీమకు కృష్ణా జలాల తీసుకొచ్చిన ఘనత టీడీపీదే
* వ్యవసాయంలోకి యువత రావాలి
* రైతు ద్రోహి జగన్
– మంత్రి సవిత ఫైర్
అనంతపురం /రాప్తాడు : వ్యవసాయంలో సాంకేతిక వినియోగంతో అధిక దిగుబడులు సాధించొచ్చునని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. రైతుల అభ్యున్నతే లక్ష్యంగా సాగులో సాంకేతికకు సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు.
రాయలసీమకు కృష్ణా జలాలు తీసుకొచ్చిన ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు. రాప్తాడులో శనివారం నుంచి రెండ్రోజుల పాటు జరిగే రైతు బడి-అగ్రి షో కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, అమిలినేని సురేంద్రబాబు, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నాయకుడు పరిటాల శ్రీరామ్ తో కలసి మంత్రి ప్రారంభించారు.
అనంతరం నిర్వహించిన సభలో మంత్రి సవిత మాట్లాడుతూ, మారుతున్న కాలనుగుణంగా వ్యవసాయంలోనూ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఒక వైపు మానవ వనరులు కొరత వేధిస్తున్న సమయంలో సాంకేతికను వినియోగించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రంలో వ్యవసాయంలో సాంకేతికకు ప్రాధాన్యమిస్తున్నారన్నారు. ఇప్పటికే వ్యవసాయంలో డ్రోన్ల వినియోగిస్తున్నామన్నారు. డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను 90 శాతం రాయితీపై రైతులకు అందిస్తున్నామన్నారు. వ్యవసాయ, హార్టీకల్చర్ అధికారులు సాంకేతిక వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు.
రాయలసీమలో ప్రతి ఎకరాకూ నీరందిస్తాం
రాయలసీమలోని ప్రతి ఎకరాకు సాగునీరందించడమే సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యమని మంత్రి సవిత స్పష్టంచేశారు. రాయలసీమకు కృష్ణా జలాలను తీసుకొచ్చిన ఘనత టీడీపీదేనన్నారు. రాయలసీమలోని అన్ని ప్రాంతాల్లోనూ సాగు, తాగునీరందిచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా అసంపూర్తిగా నిలిచిపోయిన హంద్రీనీవా సుజల స్రవంతి పనులు కూడా ఇటీవలే ప్రారంభించామని గుర్తు చేశారు. 80 వేల కోట్లతో పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రమంతా సస్యశ్యామలమవుతుందన్నారు.
శ్రీరామ్ కు అభినందనలు
రైతు బడి-అగ్రి షో కార్యక్రమం పేరుతో వ్యవసాయంలో సాంకేతిక పరికరాల వినియోగంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్న టీడీపీ నాయకుడు పరిటాల శ్రీరామ్ ను మంత్రి సవిత అభినందించారు. యువత వ్యవసాయంలోకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇందుకు పరిటాల శ్రీరామ్ ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయశాఖాధికారులు, వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు సదస్సులో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి సవిత సందర్శించారు. డ్రోన్లు, ట్రాక్టర్లను పరిశీలించారు. అధిక దిగుబడులిచ్చే టమాటా నారును, మామిడి, ఇతర మొక్కలను తిలకించారు.
రైతు ద్రోహి జగన్
కార్యక్రమంలో అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడుతూ, జగన్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. టీడీపీ ప్రభుత్వాల హయాంలోనూ, 2019-24 మధ్య కాలంలోనూ వ్యవసాయ అభివృద్ధికి తీసుకున్న చర్యలపై చర్చకు రావాలని జగన్ కు మంత్రి సవిత సవాల్ విసిరారు. రైతు ద్రోహి అని జగన్ తీవ్రంగా విమర్శించారు. జగన్ 5 ఏళ్ల పాలన రైతుతో పాటు సాగు రంగం కూడా కుదేలైందన్నారు. చంద్రబాబు ఉచితంగా జిప్సం, బోరాన్, జింక్ ఇస్తే…జగన్ వాటిని నిలిపేశాడన్నారు.
పురుగుల మందులు, కలుపు మందులు, గడ్డి మందులను చంద్రబాబు రైతుకు 50 శాతం సబ్సిడీపై ఇస్తే…జగన్ వాటిని కూడా నిలిపేశాడన్నారు. చంద్రబాబు హయాంలో మైక్రో ఇరిగేషన్ పరికరాలను 90 శాతం సబ్సిడీతో రైతులకు ఇవ్వగా….వాటిని ఇవ్వకుండా జగన్ చేతులు ఎత్తేశాడన్నారు. మిర్చి పంటపైనా జగన్ దొంగ నాటకం ఆడుతున్నాడని మండిపడ్డారు.
ఎన్నికల కోడ్ ఉంటుండగా గుంటూరు మిర్చి యార్డుకు ఎలా వెళతారని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నన్నాళ్లూ రైతులను, ప్రజలను పట్టించుకోని జగన్…ఇప్పుడు ఆకస్మాత్తుగా సవిత ప్రేమ కురిపిస్తూ దొంగ నాటకమాడుతున్నారని మంత్రి సవిత మండిపడ్డారు.