పంజాబ్‌, హర్యానా రైతులకు న్యాయం చేస్తాం

– ఆ చెక్కుల వ్యవహారం సాంకేతిక సమస్యే
– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్

ఇటీవల దేశ రైతాంగ పోరాటంలో అసువులు బాసిన పంజాబ్, హర్యానాకు చెందిన 709 రైతు కుటుంబాలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 22 మే 2022 న 1010 చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.

కాగా, ఈ చెక్కులు నగదు రూపంలోకి మారడం లేదని కొన్ని మీడియా సంస్థలు వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నాయి. ఇదే విషయం మీద తెలంగాణ ప్రభుత్వం తక్షణం స్పందించి విచారణ చేయగా తేలిందేమంటే., మొత్తం 1010 చెక్కుల్లో 814 చెక్కులకు నగదు చెల్లింపులు ఇప్పటికే జరిగాయని తేలింది.

కాగా, బ్యాంకు నిబంధనల మేరకు, నిర్దేశిత 3 నెలల సమయం లోపల ఆ చెక్కులను ఆ యా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి వుంటుంది. అట్లా చేయకపోవడం వల్ల మిగిలిన కొన్ని చెక్కులకు నగదు చెల్లింపులు చేయక నిలిపివేయబడ్డాయని నిర్ధారణ అయ్యింది. ఇది చెక్కులను నిర్దేశిత సమయంలో డిపాజిట్ చేయకపోవడం వల్ల జరిగిన సాంకేతిక పొరపాటే తప్ప మరోటికాదు.

ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించింది. సంబంధిత బ్యాంకులకు గడువుదాటిన తర్వాత డిపాజిట్ చేసినారని చెప్తున్న మిగిలిన చెక్కులకు మరికొంత సమయం ఇచ్చి, నగదు చెల్లింపులు జరిగే విధంగా అనుమతివ్వాలనీ, (రీవాలిడేట్ చేయాలని) ప్రభుత్వం ఇప్పటికే ఆయా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.

ఇంకా ఈ విషయానికి సంబంధించి మరింత సహాయం కోసం ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ (రెవెన్యూ డిపార్ట్ మెంట్) రాంసింగ్ ను 9581992577 నెంబరులో సంప్రదించవచ్చు.అమరులైన రైతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని మరోసారి రాష్ట్రప్రభుత్వం స్పష్టం చేస్తున్నది. వారికి ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయం అందే దాకా తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తుందని మరోసారి స్పష్టం చేస్తున్నాం.

Leave a Reply