– మంత్రి కొలుసు పార్థసారథి
పెనమలూరు: వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హామీ ఇచ్చారు. మంత్రి బుధవారం తాడిగడప మున్సిపాలిటీలో యనమలకుదురు, పెనమలూరు మండలం కరకట్టపై పెదపులిపాక శ్రీనగర్ కాలనీ ప్రాంతాల్లో, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ స్థానిక నాయకులతో కలిసి పర్యటించి మంత్రి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో ప్రకాశం బ్యారేజీ నిర్మించాక ఎన్నడూ ఊహించని విధంగా కృష్ణానదికి వరద రావడం, వేలాది మంది నిరాశ్రయులవడం జరిగిందని, ఇదొక ప్రకృతి వైపరీత్యమని, దీనిని ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందస్తు ప్రణాళికతో సర్వశక్తులు వడ్డారని అన్నారు.
ఆధునిక సాంకేతిక విధానాలను వినియోగించి, ముఖ్యమంత్రి స్వయంగా బుల్డోజర్స్ పై వరద ప్రాంతాల్లో పర్యటించి, ఒక యజ్ఞం లాగా పర్యవేక్షిస్తున్నారని, 200 బోట్లు, 7 హెలికాప్టర్లు, 40 ద్రోన్ లు వినియోగించి ముంపు ప్రాంతాల్లో బాధితులకు ఆహారం, మంచినీరు సరఫరా చేస్తున్నారని తెలిపారు.