-వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి
-ఎక్కడా ఎలాంటి అవసరమొచ్చినా అండగా ఉంటా
-బుడమేరు వద్ద గండ్లు పూడ్చే చర్యలు కొనసాగుతున్నాయి
-ప్రైవేట్ బోట్లకు ప్రభుత్వమే డబ్బు చెల్లిస్తుంది
-విజయవాడకు బుడమేరు చాలా సమస్యగా తయారైంది..చిన్న చిన్న వాగులన్నీ కలిసి బుడమేరు పెద్దదిగా మారింది
-ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వైసీపీ నేతలు అమరావతి మునిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు
-ప్రజల కోసం నేను యజ్ఞం చేస్తుంటే.. వైసీపీ నేతలు రాక్షసుల్లా అడ్డం పడుతున్నారు
– మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు
విజయవాడ: చరిత్ర ఎప్పుడూ చూడని విపత్తు ఎదురైందని.. ఆపదలో ఉన్న ముంపు బాధితులకు ఒకవైపు సహాయసహకారాలు అందిస్తూనే మరోవైపు అడ్డంకులు సృష్టిస్తున్న రాక్షసులతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
బుధవారం ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. నా జీవితంలో ఎప్పుడూ చూడని విపత్తు ఇది.. ప్రజలకు జరిగిన నష్టం అపారం.. ఏడు లక్షల మందికి సహాయమందించాల్సిన ఈ పరిస్థితిలో సీఎస్ దగ్గరి నుంచి మొత్తం అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపి సేవలందిస్తున్నాం. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు 91 శాతం మేర బాధితులకు ఆహారాన్ని అందించగలిగాం.
ఎప్పటికప్పుడు రోజుకు రెండుమూడుసార్లు ఐవీఆర్ఎస్ ఫీడ్‌బ్యాక్‌ను తీసుకొని.. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకొని లోపాలను సరిచేసుకుంటూ స్పష్టమైన ప్రణాళికతో సేవలందిస్తున్నాం. ఎక్కడైతే ఆహారం అందలేదో ఆయా ప్రాంతాలను గుర్తించి, యుద్ధప్రాతిపదికన అందేలా శ్రీకారంచుట్టాం. ఆహార నాణ్యతను పరీక్షించాకే బాధితులకు ఆహారాన్ని అందిస్తున్నాం. ఏ పనిచేసినా ఓ
పద్ధతిప్రకారం చేస్తూ ముందుకెళ్తున్నాం.
యుద్ధప్రాతిపదికన గండ్లు పూడ్చివేత పనులు:
వరద నియంత్రణ చర్యల్లో భాగంగా ఈరోజు మంత్రులు నారా లోకేశ్, నిమ్మల రామానాయుడు బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతంలోనే ఉండి.. వాటిని పూడ్చేందుకు కృషిచేస్తున్నారు. ఇప్పటికే ఒక గండిని పూడ్చారు. మిగిలిన రెండు గండ్లను పూడ్చే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అదే విధంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నాం.
ఎక్కడైతే నీళ్లు లేవో ఆయా సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నాం. 182 ట్యాంకర్లు ద్వారా పెద్దఎత్తున మంచి నీటిని ప్రజలకు సరఫరా చేస్తున్నాం. మునిసిపల్ నీటి సరఫరాను కూడా పునరుద్ధరించాం. ఈ నీటిని పూర్తిగా పరీక్షించాకే తాగునీటికి ఉపయోగించేలా ఆదేశాలిచ్చాం. 62 వైద్య శిబిరాల ద్వారా వైద్యసేవలతో పాటు అవసరమైన అన్ని మందులూ అక్కడే అందిస్తున్నాం.
ఇప్పటికే 50 వరకు ఫైర్ ఇంజిన్లు వచ్చాయి. వీటిసహాయంతో ఇళ్లలోని బురదను శుభ్రం చేసే పనులు ప్రారంభమయ్యాయి. మరో 50 వరకు అదనంగా ఫైర్ ఇంజిన్లు వస్తాయి. 2,100 మంది పారిశుద్ధ్య సిబ్బంది పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రొక్లెయిన్లు, టిప్పర్లు పెట్టి చెత్తాచెదరాన్ని తొలగించే పనులను పెద్దఎత్తున చేపడుతున్నాం. ఎక్కడా అపరిశుభ్రత అనే పరిస్థితి లేకుండా చేస్తున్నాం. ఎక్కడైనా డెడ్ బాడీలు ఉంటే వాటికి పోస్టుమార్టమ్ నిర్వహించి కుటుంబసభ్యులకు అందిస్తాం. ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందిస్తాం.
పశువుల కళేబరాలను సైంటిఫిక్‌గా డిస్పోజ్ చేస్తాం. దాదాపు 32 మంది ఐఏఎస్ అధికారులు పనిచేస్తున్నారు. 179 సచివాలయాలకు 179 మంది సీనియర్ అధికారులు లేదా ఐఏఎస్ అధికారులను ఇన్‌ఛార్జ్‌లుగా పెట్టాం. మంగళవారం రాత్రి 9,09,191 ఆహార ప్యాకెట్లను అందించాం. బుధవారం ఉదయం 6 లక్షల ఆహార ప్యాకెట్లతో పాటు 8,50,000 కాటన్ల నీటి బాటిళ్లను, 3 లక్షల లీటర్ల పాలను పంపిణీ చేశాం. 5 లక్షల బిస్కట్ ప్యాకెట్లను కూడా అందించాం. 5 లక్షల మందికి లంచ్ ఏర్పాట్లు చేశాం.
బాధితులు సరైన విధంగా ఫీడ్ బ్యాక్ అందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఫీడ్‌బ్యాక్‌ను సరైన విధంగా విశ్లేషించి ఏమేం చేయాలో అన్నీ చేస్తాం. ఇబ్బందుల్లో ఉన్న గర్భిణీలకు ప్రత్యేక ఏర్పాట్లతో సేవలందించేందుకు ఆదేశాలిచ్చాం.
వరదపై నిరంతర పర్యవేక్షణ:
పైన ఎక్కడినుంచైనా ఇన్‌ఫ్లో వస్తుందా అనే అంశంపై ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో పరిశీలన చేయిస్తున్నాం. డిపార్ట్‌మెంట్ సమాచారంతో పాటు అందుబాటులో ఉన్న వాస్సర్ ల్యాబ్స్, ఇతర సమాచారాన్ని విశ్లేషించి.. అప్రమత్తం చేసే విషయమై చర్యలు తీసుకుంటున్నాం. ఉదయం 7 మి.మీ. మేర వర్షపాతం క్యాచ్‌మెంట్ ఏరియాలో నమోదైంది. దీనివల్ల ఏడెనిమిది వేలు క్యూసెక్కులు వచ్చేందుకు వీలుంటుంది. ఇది కూడా మూడునాలుగు గంటలే ఉంటుంది.
భవానీపురంలోకి వచ్చిన నీళ్లు కొంత ప్రాంతాన్ని ముంచేశాయి. ప్రధానంగా ఈరోజు ఇబ్బందులకు కారణం బుడమేరు. ఇది ఎన్నో ఏళ్లుగా విజయవాడకు ఒక సమస్యగా తయారైంది. బుడమేరుకు రెడ్డిగూడెం నుంచి కోతులవాగు, పులివాగు, లోయబాగు, గడ్డుమడుగ లోయ ఇలా వివిధ వాగుల నుంచి నీరు వస్తోంది. అయితే 20 ఏళ్లుగా విజయవాడ పట్టణం విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలోనే పెద్దఎత్తున ఆక్రమణలు పెరిగాయి. దీనివల్ల బుడమేరు నుంచి కొల్లేరుకు వెళ్లాల్సిన నీరు సరిగా వెళ్లకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది.
బుడమేరు 11 వేల క్యూసెక్కులను తట్టుకునేలా డిజైన్ చేశారు. అయితే ఇప్పుడు 70 వేల క్యూసెక్కుల నీరు రావడంతో వరద పోటెత్తింది. 1970లో దీన్ని రిపేర్ చేసి విస్తరించాలని ప్రయత్నం చేశారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2007లో బుడమేరు ప్రవాహాన్ని పోలవరం కుడికాలువకు మళ్లించాలనే ప్రతిపాదన చేశారు.
అయితే వీటీపీఎస్‌లో సమస్యలు వచ్చాయని అది కూడా ప్రారంభించి మధ్యలో వదిలిపెట్టారు. వెలగలేరులో పెట్టిన రెగ్యులేటర్ ఉన్నా అది చాలా చిన్నది. కొద్దిమొత్తంలో మాత్రమే వరద నియంత్రణకు ఇది ఉపయోగపడుతుంది. 2005లో పెద్ద వరద వచ్చింది. అప్పుడు మేమంతా ఆందోళన చేశాం. ఇక్కడున్నవారు కూడా పెద్దఎత్తున ఆందోళన చేశారు. వరద నియంత్రణ పనులు చేస్తామని రాజశేఖరరెడ్డి చెప్పినా అదికూడా వదిలేసిన పరిస్థితి. నేను అధికారంలోకి వచ్చాక రూ. 500 కోట్లు మంజూరు చేశా.
అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకోలేదు. బుడమేరుకు ఉన్న గండ్లను కనీసం పూడ్చి ఉంటే, ఆక్రమణలు లేకుండా ఉంటే కొంతవరకు సమస్య పరిష్కారమయ్యేది. ఎప్పుడైతే 2019 నుంచి ఆక్రమణలు బాగా పెరిగాయో కాలవే లేకుండా చేసే పరిస్థితి చేశారు. ఒకపక్క కృష్ణా నుంచి వచ్చిన నీళ్లు, మరోవైపు బుడమేరు నుంచి వచ్చిన నీళ్లతో ఎప్పుడూ లేని విధంగా బీభత్సంగా వరద వచ్చే పరిస్థితి వచ్చింది.
2019 నుంచి 2024 వరకు మీరు అధికారంలో ఉన్నారా? లేదా? అధికారంలో ఉంటే బుడమేరుకు గండ్లు పడితే ఎక్కడ నిద్రపోయారు. ఎక్కడ గాడిదలు కాస్తున్నారు? అలాంటి తప్పుడు పనులు చేసి ఎదుటివారిపై బురదజల్లడం నీచాతినీచం.
చాలామంది అనుకుంటున్నట్లు ఒక్క కృష్ణా నది వల్లే వరదలు రాలేదు. కృష్ణా నది కంటే బుడమేరు వల్లే నష్టం ఎక్కువ జరిగింది. ఎక్కడికక్కడ కబ్జారాయుళ్లు వచ్చి కబ్జాచేయడం వల్లే ఈ పరిస్థితులు దాపురించాయి. అవన్నీ సర్వేచేయమంటున్నాం. పోలవరం కుడి ప్రధాన కాలువ మట్టిని కూడా దోచేశారు. ఇది చాలా దుర్మార్గం.
కాలువకు సపోర్టునిచ్చే గట్ల మట్టిని కూడా దోచుకున్నారు. దీనిమీద కూడా దృష్టిసారించి ప్రజాద్రోహులను కఠినంగా శిక్షిస్తే తప్ప ఇలాంటి సమస్యలు తప్పవు. ఒకవ్యక్తి దుర్మార్గానికి నగరం గజగజలాడింది.
అమాయకులంతా చాలా బాధపడే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరముంది. మేధావుల ఆలోచనలను కూడా తీసుకొని శాశ్వత పరిష్కార మార్గంతో బుడమేరుకు వచ్చే నీళ్లని కొల్లేరుకు పంపించడం, లేదంటే కృష్ణానదికి పంపించడం ఇలాంటి ముంపు పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. దానిపైనా పనిచేస్తాం.
ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు
ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. జాయింట్ యాక్షన్ కమిటీ, టీచర్లు, పెన్షనర్లు, ఏపీ జ్యాక్ తదితర చాలా ఆర్గనైజేషన్లు, అనుబంధ ఉద్యోగ సంఘాలు వచ్చాయి. బేసిక్ ఒకరోజు వేతనాన్ని వరద బాధితుల సహాయార్థం ప్రకటించాయి. అదే విధంగా సెక్రటేరియట్ అసోసియేషన్ వారు కూడా బేసిక్ ఒకరోజు వేతనాన్ని ఇస్తామన్నారు. వీరందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. వారికి ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
అందరం కలిసి సమష్టిగా విపత్తును ఎదుర్కోవాల్సిన అవసరముంది. ఒకరిద్దరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు తప్ప ప్రజలందరూ స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. 45 డ్రోన్లు వరద ప్రభావిత ప్రాంతాల్లో సేవలందిస్తున్నాయి. సాయంత్రానికి చాలా వరకు వరద తగ్గే అవకాశముంది. రేపటికి చాలావరకు కంట్రోల్‌లోకి వస్తుంది. ఒకట్రెండు రోజుల్లోనే సాధారణ పరిస్థితులను తీసుకొచ్చేందుకు అహర్నిశలు కృషిచేస్తున్నాం. ప్రజలు వ్యాధుల బారిన ప్రబలకుండా ఏమైతే చేయాలో అన్ని చర్యలు తీసుకుంటున్నాం. బాధితులందరికీ న్యాయం చేసేలా ముందుకెళ్తాం. నిత్యవసర సరుకులు కూడా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం.
బురదజల్లడం.. ఎదురుదాడి చేయడం దుర్మార్గం
చేయాల్సింది చేసి ఎదుటివారిపై బురదజల్లే కార్యక్రమం చేయడం దుర్మార్గం. అహంభావం.. ధిక్కార ధోరణికి పరాకాష్ట. ఒక వ్యక్తి అసమర్థత వల్ల లక్షలమంది ప్రజలు ఇబ్బందిపడే పరిస్థితి దాపురించింది. తప్పుచేసిన వారు గమ్మున ఉండకుండా తిరిగి ఎదురుదాడి చేసే కొత్తవిద్యను నేర్చుకున్నారు. అమరావతి మునిగిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారిని అమరావతిలో ముంచాల్సిన పరిస్థితి ఉంది.
అమరావతిని శ్మశానం అంటున్నవారిని అక్కడే పూడ్చాలి. అలా మాట్లాడుతున్న వారికి బుద్ధిజ్ఞానం ఉండాలి. ప్రజలు వింటున్నారని ఎదురుదాడి చేస్తారా మీరు! ఎదురుదాడి చేస్తే ప్రజలే బుద్ధి చెప్పాల్సిన అవసరముంది. ఇలాంటి వారిని సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరముంది. నేరస్తులు దబాయిస్తే భయపడేవారు ఎవరూ లేరు. మళ్లీ వర్షం పడుతుందని భయపడుతున్నాం. మళ్లీ బుడమేరుకు వరద వస్తుందేమోనని కంగారుపడుతున్నాం. పరిస్థితి ఇలాగే ఉంటే మీరు ఇలా దుర్మార్గంగా మాట్లాడతారా? సమాజహితంపై మీకు బాధ్యత లేదా?
ఎక్కడో ఉండే సినిమా యాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు వస్తున్నారు. మామూలు వ్యక్తులు వచ్చి మా వంతు సాయం చేస్తామంటూ ముందుకొస్తున్నారు. ఎంప్లాయిస్‌ను ఈ రోజు పిలవలేదు. కానీ, వారే స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమవంతు సహాయం చేశారు. నేరస్తులు చేసే దౌర్జన్యాలు, అరాచకాలు ఈ రాష్ట్రంలో జరగడానికి వీల్లేదు. రాత్రింబవళ్లు ఎంతో కష్టపడుతున్నారు. ఎప్పుడూ బురదలో తిరగని అధికారులను కూడా ఫీల్డ్‌లో పెట్టి పనిచేయిస్తున్నాం.
తప్పుడు మాటలు మాట్లాడిన వారు క్షమాపణ చెప్పాల్సిందే. ఈరోజు ఉదయం కేంద్ర హోంమంత్రితో మాట్లాడి పరిస్థితిని చూసేందుకు రమ్మన్నాను. ఇలా అన్ని విధాలా మేము చేయాల్సిందంతా చేస్తుంటే రాక్షస మూక అసత్య ప్రచారం చేస్తోంది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది.
డబ్బులడిగితే కేసులుపెట్టి, జైల్లో పెడతాం
ప్రజలకు అందుబాటులో ఉన్న బోట్లు వారు ఎవరైనా బాధితులను డబ్బులకు డిమాండ్ చేస్తే అలాంటివారిపై కేసులుపెట్టి జైల్లో పెడతాం. ప్రజలు కూడా ఎవరికీ ఎట్టిపరిస్థితుల్లో డబ్బులు చెల్లించొద్దు. ప్రస్తుత పరిస్థితులను ఆసరాగా తీసుకొని నిత్యవసర సరుకులు రేట్లు ఎవరైనా పెంచితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని ఆదేశించాం. ఇప్పటికే విజిలెన్స్ నిఘా కొనసాగుతోంది. కూరగాయల రేట్ల నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక అవుట్‌లెట్ల ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అందుబాటులో ఉంచుతాం.