Suryaa.co.in

Telangana

చట్టపరంగా బంకచర్లను అడ్డుకుంటాం

– ఈ నెల 30 న ప్రజాభవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్
– మెడిగడ్డ,అన్నారం,సిందిళ్ళ బ్యారేజి ల పునరుద్ధరణకు ఎన్.డి.ఎస్.ఏ కన్సల్టెంట్ గా వ్యహరిస్తుంది
– సత్వరమే నాగార్జున సాగర్ లో పూడిక తీతకు ఆదేశాలు
– నీటిపారుదల శాఖాలో పదోన్నతులు, బదిలీలకు గ్రీన్ సిగ్నల్
– ఆధుని సాంకేతిక పరిజ్ఞానంతో ఎస్.ఎల్.బి.సి పనుల పునరుద్ధరణ
– రాష్ట్ర నీటిపారుదల శాఖకు ఇద్దరు సైనికాధికారులు
– టన్నేల్ నిర్మాణంలో నిష్ణాతులైన వారి నియామకానికి కసరత్తు
– అంతర్జాతీయ స్థాయిలో పేరు గడించిన టన్నేల్ నిపుణులు కల్నల్ పరిక్షిత్ మొహారా జులైలో చేరిక
– నీటిపారుదల శాఖా సలహదారుడిగా జనరల్ హార్బల్ సింగ్ కు అహ్హనం
– భారత సైన్యంలో ఇంజినీర్ ఇన్ చీఫ్ గా పనిచేసిన జనరల్ హార్బల్ సింగ్
– మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బంకచర్లను చట్టపరంగా అడ్డుకుంటామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణా రైతాంగం ప్రయోజనాలకు భంగం వాటిల్ల కుండా చూడడమే తమ ముందున్న కర్తవ్యమని ఆయన తేల్చిచెప్పారు

ఈ ప్రాజెక్టును నిర్మిస్తే తెలంగాణా ప్రాంత ప్రయోజనాలు ఏ విధంగా దెబ్బ తింటాయో, నష్టం ఎలా వాటిల్లుతుందొ నన్న అంశంలో బలమైన వాదనలు వినిపించి ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలువరిస్తామన్నారు. బుధవారం మధ్యాహ్నం ఎర్రమంజిల్ కాలనీ లోని నీటిపారుదల శాఖా కేంద్ర కార్యాలయంలో నీటిపారుదల శాఖా ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు

నీటిపారుదల శాఖా ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్,ఇ.ఎన్.సి మహమ్మద్ అంజత్ హుస్సేన్, ఇ. ఎన్.సి ఓ&యం డిప్యూటీ ఇ. ఎన్.సి శ్రీనివాస్ లతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు

గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్ తో తెలంగాణా కు సంభవించనున్న ముప్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలసి ఈ నెల 19 న కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్ పాటిల్ కు సవివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను ఇచ్చామన్నారు.బంకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన ఫ్రీ-ఫిజిబిలిటీని నివేదికను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించవద్దని తేల్చిచెప్పామన్నారు.

ఈ ప్రాజెక్టును నిర్మిస్తే తెలంగాణా రాష్ట్ర నీటి కేటాయింపులపై ప్రభావం చూపుతుందని దానిని దృష్టిలో పెట్టుకుని నివేదికను తిరస్కరించాలని కోరామన్నారు.అందుకు స్పందించిన కేంద్ర మంత్రి పాటిల్ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన నివేదికను ఆమోదించ లేదని,త్వరలోనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని ఆయన వివరించారు

పదేళ్ల బి.ఆర్.యస్ పాలనలో పుట్టుకొచ్చిన గోదావరి-బంకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణా ప్రయోజనాలకు జరిగే నష్టం పై ఈ నెల 30 న ప్రజాభవన్ లో మద్యాహ్నం 3 గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను ఏర్పాటు చేశామన్నారు

టన్నెల్ నిర్మాణాలలో అపారమైన అనుభవం కలిగిన సుప్రసిద్ధ సైనికాదికారు లిద్దరిని నీటిపారుదల శాఖలోకి తీసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయాన్నారు.

ఇటీవల రోహ్తంగ్,జోజిలా టన్నెల్ నిర్మాణంలో పనిచేసిన ఇద్దరు అధికారులను వినియోగించుకునేందుకు నీటిపారుదల శాఖా కసరత్తు చేస్తుందన్నారు. భారత సైన్యంలో ఇంజినీర్ ఇన్-చీఫ్ గా పనిచేసిన జనరల్ హార్బల్ సింగ్ ను తెలంగాణా రాష్ట్ర నీటిపారుదల శాఖకు సలహా దారుడిగా ఉండమని అహ్హనించామన్నారు

అంతర్జాతీయ స్థాయిలో పేరు గడించిన టన్నెల్ టెక్నాలజీ నిపుణులు కర్నల్ పరిక్షిత్ మోహ్రా ఈ జులైలో రాష్ట్ర నీటిపారుదల శాఖలో చేరనున్నారని ఆయన పేర్కొన్నారు

మేడిగడ్డ ,అన్నారం,సిందిళ్ళ బ్యారేజి లపై ఎన్.డి.ఎస్.ఏ ఇచ్చిన నివేదికలపై సమీక్షించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ధరణ పనులకై ఎన్.డి.ఎస్.ఏ డిజైన్ కన్సల్టెంట్ గా వ్యహారిస్తుందన్నారు.ఎన్.డి.ఎస్ ఏ ఇచ్చిన ఆదేశాలను సత్వరమే అమలులోకి తీసుకు రావాలని ఆయన అధికారులను ఆదేశించారు

పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు వీలుగా ప్రతివారం సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు తనకు నివేదికను సమర్పించాలన్నారు.కేంద్ర జలసంఘం సూచనలకు అనుగుణంగా పనులను వేగవంతం చేయాలన్నారు. డిండి ప్రాజెక్ట్ పై ఆయన మాట్లాడుతూ భూసేకరణ విషయమై సంబంధిత జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించాలన్నారు

శ్రీశైలం ఎడమ కాలువ (ఎస్.ఎల్.బి.సి)పనుల పురోగతి పై సమీక్షించిన ఆయన పునరుద్ధరణ పనుల కోసమై అంతర్జాతీయ స్థాయి ఏజెన్సీ లతో చర్చించి ప్రతిపాదనలు స్వీకరిస్తున్నామన్నారు

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో పునరుద్దరణ పనులు చేపట్టే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చామని పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు ఖర్చుకు వెనకాడకుండా ముందుకు పోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. అదే సమయంలో నీటిపారుదల శాఖలో పెండింగ్ లో ఉన్న పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయాలని,బదిలీల తంతును వెంటనే పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.

ప్రధాన ప్రాజెక్టులలో పూడిక తీత పనులపై ఆయన స్పందిస్తూ అనేక జలాశయాలు పూడికతో పూడి పోయి ఉన్నందున 20 నుండి 25 శాతం మేర నీటిసామర్ధ్యం తగ్గిన నేపద్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జాతీయ మార్గదర్శకాలకు అనుగుణంగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నాగార్జునసాగర్,నిజాంసాగర్ తదితర ప్రాజెక్టుల పూడిక తీత పనులపై ఆయన అడిగి తెలుసుకున్నారు
ప్రత్యేకంగా నాగార్జునసాగర్ పూడిక తీత పనులను సత్వరం ప్రారంభించాలన్నారు.ఈ విషయమై ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి సమాచారం అందించాలని అధికారులను సూచించారు. దేవాదుల ప్రాజెక్టు మూడో దశ పనుల పురోగతితో పాటు సీతారామ ప్రాజెక్టుకు ప్రస్తుతం కేటాయించిన నిధుల పరిమితులకు లోబడి అదనపు ప్యాకేజి లను రూపొందించే అంశలపై అధికారులు దృష్టి సారించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

LEAVE A RESPONSE