– బాబు పాపం వల్లే పోలవరం ఆలస్యం
– డయాఫ్రం వాల్ దెబ్బతినడం వల్లే ప్రాజెక్టు ఆలస్యం
– గత టీడీపీ ప్రభుత్వం అవగాహన లోపం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిన్నది
– ఒక్క అంగుళం కూడా పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించం
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు
పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు, ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితులపై పూర్తి అవగాహన తెచ్చుకునేందుకు ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడకు రావడం జరిగింది. ఉదయం నుంచి ప్రాజెక్టు అంతా పర్యవేక్షించి జరుగుతున్న పనులు, విషయాలను అవగాహన చేసుకున్నాను. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, జలవనరుల శాఖ మంత్రిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించి, పోలవరం ప్రాజెక్ట్ పనులను వివరించేందుకే మీడియా ముందుకు రావడం జరిగింది.ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు మంత్రి అంబటి రాంబాబు సమాధానం చెబుతూ..
సాధ్యమైనంత త్వరలో పోలవరం ప్రాజెక్టు పూర్తి
రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు, రాజకీయ పార్టీలకు, అందరికీ ఉండే ప్రశ్న ఏంటంటే… పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభిస్తారు? గ్రావెటీ కింద ఎప్పుడు నీళ్లు ఇస్తారనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ 2019-20 సంవత్సరంలో వచ్చిన వరదల ఉధృతి వల్ల దెబ్బతిన్నది. అది ఎంతమేరకు దెబ్బతిన్నది? ఆ దెబ్బతిన్న భాగాన్ని ఎలా రిపేర్ చేయాలనే అంశాలు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. అవి సంపూర్తి అయ్యాక డయాఫ్రం వాల్ ఉపయోగించుకుని, ఎర్త్ కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ పూర్తి చేసి నీటిని ఇవ్వగలిగే దానిపై స్పష్టత ఇవ్వగలం. ఇవన్నీ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి పోలవరం ప్రాజెక్టును ప్రారంభించాలనే చిత్తశుద్ధి మా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఉందని మనవి చేస్తున్నా.
డయాఫ్రం వాల్ దెబ్బతినడం వల్లే ఆలస్యం
ప్రాజెక్టుకు ఇవాళ ఉన్న మేజర్ హర్డిల్ ఒక్కటే… డయాఫ్రం వాల్ దెబ్బతినడమే. దీనికి కారణం ఎవరు? అంటే గత తెలుగుదేశం ప్రభుత్వమే. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో మేము చెబితే రాజకీయ కక్షతోనో, లేక చంద్రబాబు నాయుడు, దేవినేని ఉమలపైన నెపం నెట్టేస్తున్నారని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. నేను చాలా స్పష్టంగా చెబుతున్నాను డయాఫ్రం వాల్ దెబ్బతినడం వల్ల ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అయినా, త్వరితగతిన ప్రాజెక్ట్ పూర్తిచేయాలనే తాపత్రయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది.
డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి ఖచ్చితమైన కారణం గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన తప్పిదాలు, తొందరపాటు విధానాలే. ఇవాళ డయాఫ్రం వాల్‌ను రిపేర్ చేయడమో, పునరుద్దరించడమో చేయాలి అంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్‌మెంట్‌కు మాత్రమే పరిమితం కాదు. సీడబ్ల్యూసీ, పీపీఏ, డీడీఆర్‌పీ.. వీళ్లంతా సంయుక్తంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రపంచంలో ఎన్నో డ్యామ్‌లు కట్టారు… డయాఫ్రం వాల్ లు నిర్మించారు. కానీ, ఎక్కడా డయాఫ్రం వాల్ దెబ్బతిన్న సంఘటనలు జరగలేదు. కేవలం పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రం వాల్ మాత్రమే దెబ్బతిన్నది. దీని నుంచి ప్రపంచానికి ఒక గుణపాఠం నేర్చుకునే పరిస్థితి వచ్చింది, అందువల్ల దీనిపై కొంత సందిగ్దావస్థ ఉన్నా, సాధ్యమైనంత త్వరలో ప్రాజెక్ట్ పూర్తి చేసి, ప్రజలకు నీరు అందించి, ప్రజల మెప్పు పొందాలనేలా మా ప్రభుత్వం పనిచేస్తోంది.
పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ దెబ్బతిన్న విషయం.. సీడబ్ల్యూసీవారి దృష్టిలో ఉంది. కేంద్రానికి సంబంధించిన నిపుణుల బృందం ఇక్కడకు రావడం, చెన్నై ఐఐటీ టీమ్ వచ్చి డయాఫ్రం వాల్ పరిశీలించి, వాటర్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్ వారితో చర్చలు జరిపారు. వాటిపై ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటర్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్‌వాళ్లు కొన్ని డిజైన్లు పంపించడం జరిగింది. ఏం చేయాలనే దానిపై ఒక స్పష్టత వచ్చాక, ఆ తర్వాత ఆ డిజైన్లను అమలు చేసే అవకాశం ఉంటుంది. మరోవైపు ప్రాజెక్ట్ వ్యయం ఇప్పటికే రూ. 47వేల కోట్లకు పెరిగింది. ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యేకొద్ది ప్రాజెక్టు కాస్ట్ మరింత పెరిగే అవకాశం ఉంది.
డయాఫ్రం వాల్ పునరుద్ధరణకు మూడు ఆప్షన్లు
దెబ్బతిన్న డయాఫ్రం వాల్ ను పునరుద్ధరించే విషయంలో మూడు ఆప్షన్లు ఉన్నాయి. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. 1. మొత్తం డయాఫ్రం వాల్ ను తిరిగి సమాంతరంగా నిర్మించడం, 2. ఎక్కడైతే దెబ్బతిన్నదో అక్కడ మాత్రమే డయాఫ్రం వాల్‌ను నిర్మించడం. 3. క్యాపింగ్ చేయడం. ఈ మూడు ఆప్షన్లను టెక్నికల్‌గా అధికారులు పరిశీలిస్తున్నారు. డయాప్రం వాల్ ఎంతమేరకు దెబ్బతిన్నదనే దానిపై సైంటిఫిక్‌గా పరిశీలించి నివేదికలు పంపిస్తున్నారు. ఒకవేళ మొత్తం డయాఫ్రం వాల్ దెబ్బతింటే మొత్తం కట్టవలసిందే. దానికి రెండో మార్గం లేదు. లేదా కొంతవరకు దెబ్బతింటే అంతవరకే కట్టి… ఎర్త్ కమ్ రాక్ ఫిలింగ్ డ్యామ్‌ను పూర్తి చేస్తాం. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయిలో చర్చలు జరిగాకే, నివేదిక వచ్చాకే నిర్ణయం తీసుకుంటాం.
టీడీపీ ప్రభుత్వ అవగాన లోపం వల్లే..
టీడీపీ ప్రభుత్వం అవగాహన లోపం, చేయాల్సింది చేయకపోగా, పబ్లిసిటీ కోసం ఏదో చేయాలనే తాపత్రయం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిన్నది. ప్రాజెక్టులో కీలకమైన పనులు వదిలేసి, త్వరతిగతిన పూర్తయ్యే పనులు చేసి, వాటి బిల్లులు పాస్ చేయించుకోవాలనే తాపత్రయంతో గత తెలుగుదేశం ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అప్పటి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమాలు చేసిన పాపం వల్లే ఇలా జరిగింది.
దేశంలో ఉన్న ఇరిగేషన్ నిపుణులు, ప్రాజెక్ట్‌ల గురించి అవగాహన ఉన్న ఎవరిని అడిగినా ఇదే విషయం చెబుతారు. రెండు కాఫర్ డ్యామ్‌లు పూర్తి కాకుండా డయాఫ్రం వాల్ ఎలా నిర్మిస్తారు? కాఫర్ డ్యామ్ పూర్తి అయ్యాక, లేదంటే, ఇబ్బందులు రావని భావిస్తే, రెండూ ఒకేసారి చేయవచ్చు. వరదలు వచ్చేసరికి రెండు బొక్కలు పెట్టి వెళ్లిపోయారు. వరద దెబ్బకు కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయింది. దేశంలోగానీ, ప్రపంచంలోగానీ ఇలాంటి సంఘటన ఎక్కడా జరగలేదు. కేవలం చంద్రబాబు నాయుడు వల్లే ఇక్కడ జరిగింది. దీంతో దాదాపు రూ 400కోట్ల నష్టం వాటిల్లింది. హడావుడిగా మీరు పనులు చేసి వెళ్లారు? దీనికి ఎవరు బాధ్యులు? డయాఫ్రం వాల్‌ను మళ్లీ నిర్మించాలా, వద్దా అనేది చెప్పాల్సింది సీడబ్ల్యూసీ, ఏపీ వాటర్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్ సంయుక్తంగా స్టడీచేసి నిర్ణయం తీసుకోవాలి. ఆ కార్యక్రమం జరుగుతోంది.
దిగువ కాఫర్ డ్యామ్‌ను మూసివేయడానికి సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం… ఎక్కడైతే గ్యాప్ ఉందో, ఆ గ్యాప్‌లో జియో మెంబ్రేన్ బ్యాగ్‌లలో ఇసుక నింపి, కాఫర్ డ్యామ్‌ను క్లోజ్ చేసే పనులు జరుగుతున్నాయి. ఎగువన ఉన్న రెండు కాఫర్ డ్యామ్ మార్గాలను మా ప్రభుత్వం వచ్చాక క్లోజ్ చేయడం జరిగింది. కాఫర్ డ్యామ్ అనేది డయాఫ్రం వాల్ కోసమే నిర్మాణం జరిగింది.
ఒక్క అంగుళం కూడా ఎత్తు తగ్గించం
ఒక్క అంగుళం కూడా పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేది లేదని ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఎల్లో మీడియా, టీడీపీ చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని, అసత్యాలను నమ్మవద్దని కోరుతున్నాం. సాధ్యమైనంత త్వరలో పోలవరం ప్రాజెక్ట్‌ను మేమే పూర్తిచేస్తాం. ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి రైతులకు నీళ్లు అందిస్తారు.
ఆర్ అండ్ ఆర్ పనులు వేగవంతం
ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీకి సంబంధించి నిర్వాసితుల నుంచి వస్తున్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. 41.15 కాంటూర్ వరకూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం. ఇందుకు సంబంధించి సఫలీకృతం అయ్యాం. ఇంకా ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొన్నిచోట్ల పునరావాస కాలనీల నిర్మాణం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్వాసితులకు అదనంగా ప్యాకేజీ ఇవ్వడానికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన ప్రకారం కూడా ఇవ్వడం జరుగుతుంది. టన్నెల్ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి.