– సీఎం రేవంత్ రెడ్డి వినతికి స్పందించిన కేంద్రం
తెలంగాణ రైతులకు ఎరువుల కొరత లేకుండా అన్ని విధాలా సహకారం అందిస్తామని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
మంగళవారం ఢిల్లీ లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం కేంద్ర మంత్రి ని కలిసి రాష్ట్రానికి సరిపడా యూరియా , ఎరువులు సరఫరా చేయాలని కోరారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జూలై, ఆగస్టు నెలల్లో యూరియాను నిరాటంకంగా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి విజ్ఞప్తి పై స్పందించిన కేంద్ర మంత్రి నడ్డా.. రైతుల అవసరాలను తీర్చడానికి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ కు అవసరమైన మేరకు సరఫరా ఉండేలా చూసుకోవాలని ఎరువుల శాఖ అధికారులను ఆదేశించారు.
యూరియాను వ్యవసాయేతర అవసరాలకు మళ్లించకుండా, రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సమానంగా ఎరువులు పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కోరారు.
ఇదే సమయంలో తెలంగాణలో యూరియా వినియోగం పెరుగుతుండటంపై కేంద్ర మంత్రి నడ్డా ఆందోళన వ్యక్తం చేశారు. 2023-24 యాసంగి తో పోలిస్తే 2024-25 యాసంగి లో యూరియా అమ్మకాలు 21% అధికమయ్యాయని అన్నారు.
రసాయన ఎరువుల అధిక వినియోగాన్ని తగ్గించి, సేంద్రీయ, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం ప్రణామ్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రోత్సాహకాలు అందిస్తుందని ప్రస్తావించారు.