-గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న యూనివర్సిటీల కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఫైల్ క్లియర్ కాగానే రిక్రూట్మెంట్ ప్రారంభిస్తాం
-పి. హెచ్. డి. స్కాలర్స్ కు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ హామీ
-యూనివర్సిటీలలో 1,062 అధ్యాపక ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని వినోద్ కుమార్ ను కలిసి వినతి పత్రం సమర్పించిన పీ.హెచ్.డీ విద్యార్థులు
రాష్ట్రంలోని వివిధ విశ్వ విద్యాలయాలలో ఖాళీగా ఉన్న 1,062 అధ్యాపక ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ పి.హెచ్.డి. పూర్తి చేసిన విద్యార్థులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు.
రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలలో గత కొన్ని సంవత్సరాలుగా వివిధ కారణాల వల్ల రిక్రూట్మెంట్ జరగకుండా పెండింగ్ లో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ వంటి పలు పోస్టుల భర్తీ చేయాలని ఆ విద్యార్థులు వినోద్ కుమార్ ను శుక్రవారం మంత్రుల నివాసంలో కలిసి విజ్ఞప్తి చేశారు.
1,062 అధ్యాపక పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ ను ఏర్పాటు చేస్తూ బిల్లును ఆమోదించిందని, దీంతో రిక్రూట్మెంట్ త్వరలోనే జరుగుతుందని తాము ఆశించామని ఆ విద్యార్థులు పేర్కొన్నారు. అయితే గవర్నర్ కార్యాలయంలో యూనివర్సిటీలలో అధ్యాపక నియామక కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లు పెండింగ్ లో ఉందని తెలిసి యావత్ విద్యార్థి లోకం దిగ్భ్రాంతికి గురవుతోందని ఆ విద్యార్థులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లును గవర్నర్ త్వరలోనే ఆమోదిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. గవర్నర్ ఈ ఫైల్ ను ఆమోదించగానే అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తామని పి హెచ్ డి వినోద్ కుమార్ హామీ ఇచ్చారు.
కోర్టు సమస్యలు, ఇతర సమస్యలను అధిగమించి బీహార్, ఒరిస్సా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలతో సహా ఇతర ప్రాంతాల్లోని కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని.. తెలంగాణ రాష్ట్రంలో కూడా కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ను ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఈ మేరకు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ఆమోదించిందని వినోద్ కుమార్ వివరించారు. వినోద్ కుమార్ ను కలిసిన పీహెచ్డీ పి హెచ్ డి విద్యార్థుల బృందంలో జి. వినయ్, ఎం. సంతోష్ కుమార్, ఎస్. సత్యమూర్తి, జే. ప్రశాంత్, ఎల్. కామ్రేడ్, సురేష్ , తదితరులు ఉన్నారు.