Suryaa.co.in

Andhra Pradesh

ముస్లింల సంక్షేమం టీడీపీతోనే సాధ్యం

-జగన్ పాలనలో మైనార్టీలపై దాడులు పెరిగాయి
-రాజకీయ లబ్ధి కోసం వైసీపీ మత విద్వేషాలు రెచ్చగొడుతోంది
-ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక దుల్హన్ పథకం కింద రూ.లక్ష ఆర్దిక సాయం
-టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
-నిడదవోలులో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు

నిడదవోలు :ముస్లిం మైనార్టీల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తూ.గో జిల్లా నిడదవోలులో గురువారం రంజాన్ వేడుకల్లో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. మత పెద్దల సమక్షంలో కేక్ కట్ చేసి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ…‘‘క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం. పేదలకు ధానాలు చేస్తే మోక్షం లభిస్తుందని రంజాన్ సారాంశం చెబుతోంది.రంజాన్ మాసం అంతా కఠోర శ్రమతో ఉపవాస దీక్షలు చేశారు. ధర్మాన్ని కాపాడాలని అల్లాను నెలంతా ప్రార్ధించారు. మీ ప్రార్ధనల వల్ల రాష్ట్రానికి దేశానికి మంచి జరగాలి.’ అని ఆకాంక్షించారు.

మైనార్టీల సంక్షేమం టీడీపీతోనే సాధ్యం
ఏ పార్టీ ముస్లిం మైనార్టీలకు న్యాయం చేసిందో ఆలోచన చేయాలి. టీడీపీ హయాంలో ప్రత్యేకంగా మైనార్టీ కార్పోరేషన్ ఏర్పాటు చేశాం. ఉమ్మడి రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉర్దూను రెండవ బాషగా చేశాం. కర్నూలులో ఉర్దూ వర్సిటీ ఏర్పాటు చేసింది టీడీపీనే. 2 ఉర్దూ వర్సిటీలుంటే రెండూ టీడీపీనే ఏర్పాటు చేసింది. హైదరాబాద్లో హజ్ హౌస్ కట్టి ప్రత్యేక విమానాలు వేయించాం. కడప, విజయవాడలో హజ్ హౌస్ లు కట్టించాం. యాత్రకు వెళ్లేందుకు ఆర్థిక సాయం అందించాం.

పేద ముస్లింలను ఆదుకునేందుకు రంజాన్ తోఫాతో పాటు సంక్రాంతి కానుకలు కూడా ఇచ్చాం. పెళ్లిళ్ల కోసం దుల్హన్ పథకం కింద రూ.50 వేలు చొప్పున ఇచ్చాం. దుల్హన్ పధకం కింద రూ. 1 లక్షా ఇస్తానని జగన్ అన్నారు, ఇచ్చారా? టీడీపీ అధికారంలోకి రాగానే దుల్హన్ పథకం కింద ఈసారి రూ.లక్ష చొప్ప్పున అందిస్తాం. నా మైనార్టీలంటున్న జగన్ వారికి చేసిందేంటి? దుకాణ్ మకాణ్ వంటి వాటితో పాటు మౌజమ్, ఇమామ్ లకు దేశంలోనే మొదటి సారిగా వేతనాలిచ్చాం. నేడు ఆ వేతనాలు అందుతున్నాయా?

కడపలో హజ్‌హౌస్ 90 శాతం పూర్తిచేస్తే వీళ్లు 10 శాతం పూర్తిచేయలేకపోయారు. ఇదేనా వైసీపీకి మైనార్టీలపై ఉన్న ప్రేమ? విదేశీ విద్య కింద రూ.15 లక్షలు చొప్పున అందించాం. ప్రపంచంలో ఏ వర్సిటీలో చదువుతున్నా ఆర్థిక సాయం అందించాం. మైనార్టీలకు ఆర్థిక సాయం కోసం సబ్ ప్లాన్ తీసుకొచ్చాం.’ అని తెలిపారు.

వైసీపీ పాలనలో మైనార్టీలపై దాడులు
వైసీపీ పాలనలో మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయి. వేధింపులు తట్టుకోలేక నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. నిడదవోలు గ్రామానికి చెందిన మైనార్టీ వ్యక్తి మలేషియాలో చనిపోతే..ఆ డెడ్ బాడీని తీసుకురాలేని అసమర్ధ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. టీడీపీ ఎన్ ఆర్ విభాగం ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించింది.

మైనార్టీల ఆస్తులు కొల్లగొట్టారు. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేకుండా పోయింది. రాజకీయ లబ్ధి కోసం మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. రాష్ట్రం కోసమే మూడు పార్టీల పొత్తు. ఎన్డీయేతో రెండుసార్లు పొత్తు పెట్టుకున్నాం. ఏ నాడు మైనార్టీలకు అన్యాయం జరగలేదు. మైనార్టీలకు అనేక సంక్షేమ పధకాలు అందించాం. మతం పేరుతో జగన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. మీ ఓట్లు కొల్లగొట్టి మీకే తీరని ద్రోహం చేశాడు. ముస్లింల 4 శాతం రిజర్వేషన్ బిల్లు సుప్రీంకోర్టులో ఉన్న సమయంలో న్యాయవాదులను పెట్టి కాపాడాం.

భవిష్యత్ లోనూ కాపాడుతాం. సీఏఏ చట్టానికి పార్లమెంట్ లో మద్దతు తెలిపింది వైసీపీ కాదా? వైసీపీ పాలనలో ఒక్క మైనార్టీకైనా న్యాయం జరిగిందా? టీడీపీ అధికారంలోకి వస్తేనే ముస్లింలకు మేలు జరుగుతుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుకున్న ఎన్డీయే పొత్తును ప్రజలు ఆశీర్వదించాలని చంద్రబాబు నాయుడు అన్నారు.

LEAVE A RESPONSE