– కలెక్టర్లు, ఎస్పీలే మాటవినని దయనీయం
– గవర్నర్ పర్యటనలో ముఖం చాటేస్తున్న అధికారులు
– ఇక గవర్నర్ ఆదేశాలు అమలుచేసేదెవరు?
– చాన్సలర్ హోదా కూడా పోతే ఇక పట్టించుకునేదెవరు?
– తంటాలు పడుతున్నారా? తంటాలు పెడుతున్నారా?
– తెలంగాణ గవర్నర్ తమిళసై చర్యలపై చర్చ
– నాడు కుముద్‌బెన్ జోషి.. నేడు తమిళసై
– నాడు ఎన్టీఆర్, నేడు కేసీఆర్
( మార్తి సుబ్రహ్మణ్యం)
చాలా ఏళ్ల క్రితం ముచ్చట ఇది. అప్పట్లో ఎన్టీరామారావు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయనకు చెక్ పెట్టేందుకు అప్పుడే గవర్నర్‌గా వచ్చిన కుముద్‌బెన్ జోషి, రాజ్‌భవన్‌లో ప్రజాదర్బారుకు తెరలేపారు. జోగినిలకు పెళ్లిళ్లు చేశారు. ఎన్టీఆర్ వ్యతిరేక శక్తులందరికీ ధారాళంగా అపాయింట్‌మెంట్లు ఇచ్చారు. దీనితో ఆమె తీరుపై విమర్శలకు తెరలేచింది. సమాంతర పాలన సాగిస్తున్నారంటూ టీడీపీ గళమెత్తి గర్జించింది. ఆరోవేలయిన గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలన్న ఎన్టీఆర్, ఆమె ఆ పదవిలో ఉన్నంతవరకూ జోషిని లెక్కచేయలేదు.
మళ్లీ చాలా ఏళ్ల తర్వాత కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ర్టానికి.. గవర్నర్‌గా వచ్చిన మరో మహిళ కూడా కుముద్‌బెన్ జోషి మాదిరిగానే, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెక్ పెట్టే పని మొదలుపెట్టారు. గవర్నర్ తమిళసై కూడా జోషి మాదిరిగానే ప్రజాదర్బార్‌కు తెరలేపారు. అప్పుడు ఎన్టీఆర్‌కి జోషి, ఇప్పుడు కేసీఆర్‌కు తమిళసై అన్నమాట. ఇద్దరి దూకుడుకూ మహిళా గవర్నర్లే బ్రేకులు వేయడం విశేషం. కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న బీజేపీ, కాంగ్రెస్ నుంచి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏఆల్ వరకూ.. ఎవరికంటే వారికి సులువుగా గవర్నర్ అపాయింట్‌మెంట్లు ఇస్తున్న తీరు అధికార టీఆర్‌ఎస్‌కు ఆగ్రహం కలిగిస్తోంది. తమిళసై వ్యవహారశైలిపై ఇటీవల మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆమె బీజేపీ నేతగా వ్యవహరిస్తున్నారన్న ఆయన వ్యాఖ్యపై, చర్చ జరిగిన విషయం తెలిసిందే.
గవర్నర్ పర్యటనకు కలెక్టర్లు, ఎస్పీలు గైర్హాజర్
డీజీపీ, సీఎస్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులను రాజ్‌భవన్‌కు సమీక్ష కోసం రావాలని గవర్నర్ ఆదేశిస్తున్న వైనం, అటు అధికారులకూ ప్రాణసంకటంలా పరిణమించింది. అటు గవర్నర్‌ను కాదనలేని పరిస్థితి. ఇటు ప్రభుత్వాన్ని ధిక్కరించలేని ఇరకాటం వారిది. చివరాఖరకు డీజీపీ, సీఎస్‌లు కూడా గవర్నర్ భేటీకి డుమ్మా కొడుతున్నారు. భద్రాచలం, సమ్మక సారక్క ఇతర దేవాలయాల సందర్శనల సందర్భంలో కూడా, తమిళసైకి పెద్దగా ప్రొటోకాల్ లభించడం లేదు. ఆమెకు స్వాగతం చెప్పాల్సిన కలెక్టర్, ఎస్పీలు కూడా ముఖం చాటేస్తున్నారు. చివరాఖరకు అసెంబ్లీ సమావేశాలు కూడా ఆమె అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారు. దానితో గవర్నర్ స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి తనకు జరుగుతున్న అవమానంపై వాపోతున్న దుస్థితి ఏర్పడింది. ఇదే అదనుగా బీజేపీ-కాంగ్రెస్ నేతలు ఒక మహిళ పట్ల కేసీఆర్ ప్రభుత్వం ఇంత అవమానకరంగా వ్యవహరిస్తోందంటూ దుయ్యబడుతున్నారు.
మహిళల కోసం రాజ్‌భవన్‌లో ఫిర్యాదు నెంబరు
అయితే గవర్నర్ తమిళసై మహిళల కోసం నిర్వహించే ప్రజాదర్బార్ల వల్ల ఫలితం ఏమిటన్న అంశంపై చర్చకు తెరలేచింది. మహిళలు తమ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు 04023310521 నెంబరు ఏర్పాటుచేయడంతోపాటు, ఒక ఫిర్యాదు బాక్సు కూడా ఏర్పాటుచేశారు. నిజానికి గవర్నర్ ఇప్పటివరకూ తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్శిటీలకు చాన్సలర్. పేరుకు చాన్సలరు గవర్నరే అయినప్పటికీ, యూనివర్శిటీలకు సంబంధించిన నిర్ణయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవడం సహజం. గవర్నర్లు కేవలం యూనివర్శిటీ వైస్ చాన్సలర్లతో సమీక్షలు నిర్వహిస్తుంటారు. అంతకుమించిన అధికారాలేమీ గవర్నర్లకు ఉండవు.
సర్కారును కాదని ‘సై’ అనలేని అధికారులు
సహజంగా గవర్నర్ తన వద్దకు వచ్చే ఫిర్యాదులను, సంబంధించిత శాఖాధికారులు లేదా సీఎస్, డీజీపీలకు పంపిస్తుంటారు. అక్కడి నుంచి సరైన స్పందన రాకపోతే రాజ్‌భవన్ అధికారులు మరోసారి పంపిస్తారు. అప్పటికీ స్పందించకపోతే, సంబంధిత అధికారులను రాజ్‌భవన్‌కు పిలిపిస్తారు. ఇంతకుమించి అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం గవర్నర్‌కు కష్టమే. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సహజంగా ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా వ్యవహరిస్తుంటారు. సీఎం-గవర్నర్ మధ్య సఖ్యత వాతావరణం ఉంటే ఒక విధంగా.. వారిద్దరి మధ్య సఖ్యత లేకపోతే మరొక విధంగా వ్యవహరిస్తుంటారు.
అమ్మో.. రాజభవన్‌కు మేం వెళ్లం!
తమిళసై గవర్నర్‌గా వచ్చిన తర్వాత, ప్రభుత్వ అనుమతి లేకుండా రాజ్‌భవన్ వెళ్లిన అధికారులపై బదిలీ వేటు పడింది. దానితో ప్రభుత్వ అనుమతి లేకుండా రాజ్‌భవన్‌కు వెళ్లేందుకు అధికారులు భయపడుతున్న పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌కు భయపడుతున్న అధికారులు, గవర్నర్ తమిళసై రాజ్‌భవన్‌కు హాజరుకావాలని హుకుం జారీ చేస్తున్నా ఖాతరు చేయని పరిస్థితి కొనసాగుతోంది. ఈ భయంతోనే గవర్నర్ ఇటీవలి పర్యటనలకు ఎస్పీ, కలెక్టర్లు ముఖం చాటేశారన్నది బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో గవర్నర్ మహిళల కోసం ప్రారంభించిన ప్రజాదర్బార్‌లో వచ్చే ఫిర్యాదులను ఎలా పరిష్కరిస్తారన్న చర్చ జరుగుతోంది. గవర్నర్ పంపిన ఫిర్యాదును చూసేదెవరు? వాటికి సమాధానం ఇచ్చేదెవరన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఢిల్లీకి ఫిర్యాదుతో ముదిరిన యుద్ధం
కాగా.. రాష్ట్రంలో రాజ్యాంగ అధిపతి అయిన తనను అవమానిస్తున్న వైనంపై గవర్నర్ తమిళసై.. ప్రధాని, కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. దానితో కేసీఆర్-తమిళసై మధ్య జరుగుతున్న యుద్ధం ముదురుపాకాన పడినట్టయింది. ఆమె తెలంగాణలో జరుగుతున్న పలు ప్రాజెక్టులలో అవినీతిపై ఒక నివేదికను కేంద్రానికి సమర్పించారు. ఈ నేపథ్యంలో ఇక గవర్నర్‌ను, ఏ విషయంలో కూడా లెక్కచేయాల్సిన అవసరం లేదన్న నిర్ణయానికి కేసీఆర్ సర్కారు వచ్చినట్లు కనిపిస్తోంది.
మమతా బాట పడితే కష్టమే
ఇదిలాఉండగా, ప్రస్తుతం యూనివర్శిటీలకు చాన్సలరుగా ఉన్న గవర్నర్‌ను ఆ పదవి నుంచి తొలగిస్తే.. ఇక గవర్నర్‌కు యూనివర్శిటీలపైనా అజమాయిషీ ఉండదు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ ఇదే పని చేశారు. యూనివర్శిటీలకు చాన్సలరుగా ఉన్న గవర్నర్ స్థానంలో ముఖ్యమంత్రి ఉండేలా చట్టం చేసిన మమతా బెనర్జీ గవర్నర్‌కు షాక్ ఇచ్చారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా అదే దారిలో పయనిస్తున్నారు. నిజానికి కేసీఆర్ కూడా నరసింహన్ గవర్నర్‌గా ఉన్నప్పుడు ఇలాంటి ప్రయత్నమే చేసినా, అది కోర్టు వ్యవహారంలో పడి నిలిచిపోయింది. భవిష్యత్తులో కేసీఆర్ కూడా.. మమతా బెనర్జీ పాటించిన పద్ధతులే పాటించి, గవర్నర్‌ను చాన్సలర్ పదవి నుంచి తొలగిస్తే.. ఇక గవర్నర్‌కు యూనవర్శిటీలపై ఎలాంటి అధికారం ఉండదు. చూడాలి ఏం జరుగుతుందో?!