బాబు టూర్‌లో మోగని ‘గంట’

– మళ్లీ డుమ్మా కొట్టిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌
– అనకాపల్లి, చోడవరం సభలకు డుమ్మా
– ఎయిర్‌పోర్టుకూ రాని బేఖాతరిజం
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలుగుదేశం పార్టీలో విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రూటే సపరేటు. అందరు ఎమ్మెల్యేలది ఒకదారయితే, గంటాది ఇంకో దారి. ఎంతలావు మనిషయినా సరే.. చివరాఖరకు తన పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ ఆఫీసు నుంచి నాయకులు ఫోన్‌ చేసినా సరే… ఆయనకు నచ్చితేనే ఫోన్‌ తీస్తారు. లేకపోతే లేదు. ఆయనకు ఇష్టం ఉన్నప్పుడూ, తీరిక దొరికనప్పుడు మాత్రమే ఫోన్‌ చేస్తారు. అంటే ఆయన దయ, పార్టీ ప్రాప్తం అన్నమాట. గెలిచింది టీడీపీ టికెట్‌తో అయినప్పటికీ, తన సొంత ఫేసుతోనే గెలుస్తున్నానన్నది ఆయన ప్రగాఢ నమ్మిక. అందుకే మంత్రి పదవిలో ఉన్నా ఎవరినీ ఖాతరు చేయరు.

ప్రస్తుతం గంటా శ్రీనివాస్‌ సాంకేతకంగా టీడీపీ ఎమ్మెల్యే. ఆయన.. విశాఖలోని మరో టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ మాదిరిగా పార్టీ జంపయి, వైసీపీలో చేరలేదు. కానీ కొంతకాలం అటువైపు ఊగిసలాడారు. మాటా ముచ్చట్లు కూడా పూర్తయి, ఇక ‘ఫ్యాన్‌’ కింద గాలిపోసుకోవడమే తరువాయన్న ప్రచారం జోరుగా జరిగింది. ఆమేరకు బోలెడు తేదీలు కూడా ఖరారయినట్లు మీడియాలో కూడా ప్రచారం జరిగింది. కానీ వైసీపీలో ఉన్న మాజీ తెలుగుతమ్ముడయిన అప్పటి మంత్రి అవంతి శ్రీనివాస్‌.. ‘గంట’ మోగకుండాganta-srinivasa-rao-rammadhav అడ్డుకున్నారన్న ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి నాటి బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌నూ కలిశారు. దానితో ఇక గంటా కాషాయం కట్టేస్తారన్న ప్రచారం కూడా జరిగింది.

ఈ రకంగా రెండు పార్టీల్లో అదృష్టం పరీక్షించేందుకు ప్రయత్నించిన గంటా, ఇప్పటిదాకా ఏ పార్టీకి ‘అపాయింట్‌మెంట్‌’ ఇవ్వకపోవడం బట్టి.. వైసీపీ-బీజేపీలలో గిట్టుబాటు కాలేదన్నది అర్ధం చేసుకోవలసి ఉంది. నిజానికి గంటా చాలా తెలివైన రాజకీయ వ్యాపారి. జనం పల్సు పట్టేయడంలో మాస్టర్‌ డిగ్రీ తీసుకున్నారు. అందుకే టీడీపీ నుంచి పీఆర్పీలో చేరినా, పీఆర్పీ నుంచి టీడీపీలో చేరినా.. తన సొంత ఇమేజ్‌ కాపాడుకునే పనిలో ఉంటారు తప్ప, పార్టీని పెంచే పనిలో ఉండరన్నది ఆయనపై ఉన్న ఒక ప్రచారం.

గత ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం తర్వాత, గంటా పార్టీ వైపు కన్నెత్తి చూడలేదు. అసెంబ్లీ సమావేశాలకూ హాజరయిన సందర్భాలు అత్యల్పం. ఫోన్లకు స్పందించరు. టీడీఎల్పీ మీటింగులకూ హాజరుకావడం లేదు. అసలు టీడీఎల్పీ ఆఫీసు ముఖమే చూడటం లేదు. దానితో అసలు గంటా పార్టీలో ఉన్నారా? లేదా? గంటాను పక్కనపెట్టాలా? వద్దా? అన్నది నాయకత్వ అయోమయం. వియ్యంకుడైన మాజీ మంత్రి పి.నారాయణను చూసి, గంటాను చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్నది సీనియర నాయకుల వ్యాఖ్య.

అలాగని ఆ నారాయణ ఏమైనా పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారా అంటే అదీ లేదు. పార్టీ ఓటమి తర్వాత నెల్లూరులో కార్యక్రమాలు చేసింది లేదు. పార్ట్‌ టైమ్‌ పొలిటీషియన్‌ అయిన నారాయణను తమ మీద రుద్దుతున్నారని, అప్పుడు నెల్లూరు టీడీపీ నేతలు నెత్తీ నోరూ కొట్టుకున్నా నాయకత్వం లెక్కచేయకుండా, నారాయణకు మంత్రి పదవితోపాటు నెల్లూరుపై పెత్తనం రాసిచ్చింది. ఇప్పుడాయన భూతద్దం వేసి వెతికినా కనిపించడం లేదు.

తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విశాఖ పర్యటనలో ఉన్నారు. చోడవరం, అనకాపల్లి నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. మినీ మహానాడు, బహిరంగసభల్లో పాల్గొంటున్నారు. ఒకప్పుడు ఆ నియోజకవర్గాల్లో గంటా శ్రీనివాస్‌ ఎమ్మెల్యే కూడా. తన పార్టీ అధినేత విశాఖ పర్యటనకు వస్తున్నారనిchandrababu-naidu-in-ankapalli తెలిసీ, మరోసారి ముఖం చాటేసిన గంటా తీరుపై, విశాఖ టీడీపీ వర్గాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాబు పర్యటన ఆయన నియోజకవర్గ పరిథిలోనిది కాదని సమర్ధించుకున్నా.. గతంలో అక్కడ ఆయన ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేశారు. పైగా అక్కడ ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేలు కూడా లేరు. ఇవన్నీ పక్కనపెడితే, కనీసం గంటా ఎయిర్‌పోర్టుకూ హాజరుకాకపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ganta-babuసరిగ్గా మూడు రోజుల క్రితమే.. గంటా శ్రీనివాస్‌ మనుమడి పుట్టినరోజు వేడుకలకు, చంద్రబాబునాయుడు హాజరయ్యారు. దానితో గంటా మళ్లీ పార్టీ గాడిలో పడ్డారని, ఇకపై పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారని టీడీపీ నేతలు అంచనా వేశారు. కానీ, యధావిథిగా గంటా శ్రీనివాస్‌ అధ్యక్షుడు వచ్చినా వెళ్లకుండా, తన పాత మార్కు బేఖారిజం ప్రదర్శించారు. ఇక గంటా అవసరం పార్టీకి ఉందా? పార్టీ అవసరం గంటాకు ఉందా అన్నదే తేలాల్చి ఉందన్నది తమ్ముళ్ల వ్యాఖ్య. దటీజ్‌ గంటా!

Leave a Reply