32మంది అవ్వాతాతలను చంపి శవరాజకీయం చేస్తారా?
మంగళగిరి రచ్చబండ సభలో నిప్పులు చెరిగిన నారా లోకేష్
మంగళగిరి: సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్, వీధివీధికి జె-బ్రాండ్ల మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. ఏ ముఖం పెట్టుకొని మళ్లీ ప్రజలను ఓట్లు అడుగుతారని యువనేత నారా లోకేష్ నిలదీశారు. మంగళగిరి కుప్పారావు కాలనీ రచ్చబండ సభలో లోకేష్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి జగన్ కు ప్రతి ఎన్నికకు శవాలతో రాజకీయం చేయడం అలవాటుగా మారింది. 2014లో తండ్రి పేరుతో, 2019లో బాబాయి పేరుతో రాజకీయం చేశారు, ఇప్పుడు పెన్షన్ ఇవ్వకుండా 32మంది వృద్ధులను చంపేసి శవరాజకీయం చేస్తారా?
కావాలనే పెన్షన్లు ఇవ్వకుండా వృద్ధులను ఇబ్బంది పెట్టారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3వేల పెన్షన్ 4వేలకు పెంచి ఇళ్లవద్దకే అందిస్తాం. పెన్షన్ తోపాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలను కూడా వాలంటీర్ల ద్వారా అందిస్తాం. వాలంటీర్లను వైసిపి ప్రచారానికి వాడటం వల్లే ఎన్నికల కమిషన్ వారిని పక్కనబెట్టింది. అయిదేళ్లపాటు జగన్ తాడేపల్లి ప్యాలెస్ వదిలి జగన్ బయటకు రాలేదు. ప్రజలు సమస్యలపై నిలదీస్తారని 12 కి.మీ.ల ప్రయాణానికి కూడా హెలీకాప్టర్ వాడారు. కుంటిసాకులతో 6లక్షలమంది అవ్వాతాతల పెన్షన్ తొలగించారు.
మేం అధికారంలోకి వచ్చిన వెంటనే వైసిపి ప్రభుత్వం తొలగించిన పెన్షన్లన్నీ పునరుద్దరిస్తాం. సుమారు 1200 కోట్లు బకాయిలు పెట్టి ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారు. ఈ పథకం కింద వైద్యసేవలు అందించేందుకు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. ప్రజలకు సంక్షేమం అందించాలంటే మనసు కూడా ఉండాలి. ఈ ముఖ్యమంత్రికి సాయంచేసే మనసు లేదు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ ద్వారా పేదలందరికీ మెరుగైన వైద్య సదుపాయం కల్పిస్తాం, ఆ పరిధిలోకి రానివారికి సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం అందిస్తామని లోకేష్ చెప్పారు.