Suryaa.co.in

Andhra Pradesh

ఆర్కే మాదిరి నటన రాదు

పనులుచేసి నేనేంటో నిరూపిస్తా
విజన్ తో మంగళగిరి అభివృద్ధికి అహర్నిశలు కష్టపడతా!
స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటుచేసి ఆదుకుంటాం
మంగళగిరి రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్

మంగళగిరి: మంగళగిరి అభివృద్ధిపై నాకు విజన్ ఉంది, ఎమ్మెల్యేగా గెలిచాక అహర్నిశలు కష్టపడి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా. రాబోయే ఎన్నికల్లో నన్ను ఎంత ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తే అంతబలంగా పోరాడి మంగళగిరి అభివృద్ధికి నిధులు తెస్తానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గం కప్పురావు కాలనీ, శ్రీశైలం నగర్, కొలనుకొండ స్టేజిసెంటర్లలో నిర్వహించిన రచ్చబండ సభల్లో యువనేత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… గత ఎన్నికల్లో నేను 5350 ఓట్ల తేడాతో ఓడిపోయాను. అయినా మంగళగిరి పట్టణం, రూరల్ లో నాకు మెజారిటీ ఇచ్చారు. ఓటమి నాలో కసి, పట్టుదల పెంచింది. సొంత నిధులతో 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశాను. 25 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించిన మురుగుడు కుటుంబం కానీ, ఆర్కే గానీ నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా చేశారా? ఒకప్పుడు మంగళగిరి అంటే మగ్గాలు, మగ్గాలు అంటే మంగళగిరిలా ఉండేది. గతంలో 20వేల చేనేత మగ్గాలుంటే ఇప్పుడు వెయ్యికూడా లేవు. చేనేతను బతికించాలనే ఉద్దేశంతో అధునాతన మగ్గాలు ఇచ్చాం.

అధునాతన పనిముట్లతో వీవర్స్ శాల ఏర్పాటుచేసి, మార్కెటింగ్ కోసం టాటాసంస్థతో ఒప్పందం చేసుకున్నాం. పనిచేయాలనే తపనతో మంగళగిరికి వచ్చా, కరకట్ట కమలహాసన్ లా నటన నాకు రాదు. సంక్షేమం, అభివృద్ధి పనులుచేసి నేనేంటో నిరూపిస్తా. మంగళగిరి మాస్టర్ వీవర్స్ పై ఎమ్మెల్యే ఆర్కే కక్షపూరితంగా వ్యవహరించారు. వారిపై జిఎస్టీ దాడులు చేయించారు. దుకాణాలు మూసివేసేలా ఇబ్బందులకు గురిచేశారు. ఎన్నికల సమయంలో మంగళగిరికి అనేక హామీలు ఇచ్చిన ఆర్కే ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారు. 1200 కోట్లతో అభివృద్ధి చేస్తానని చెప్పి 12 కోట్లు కూడా ఖర్చుచేయలేదు.

రాజధాని విషయంలో ఆర్కే వెన్నుపోటు
రాజధాని విషయంలో ఆర్కే మంగళగిరికి వెన్నుపోటు పొడిచారు. అమరావతి రాజధానికి జగన్ ను ఒప్పిస్తానని చెప్పి అసెంబ్లీలో 3రాజధానులకు ఓటేశారు. అమరావతి రాజధాని కోసం 39మంది శాసనమండలి సభ్యులతో పోరాడి మేము మూడురాజధానుల బిల్లు అడ్డుకున్నాం. కనీసం అసంపూర్తిగా మిగిలిపోయిన రాజధాని పనులు పూర్తిచేసినా లక్షమందికి ఉపాధి లభించేది. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి మా నినాదం. గత ఎన్నికల్లో లోకేష్ గెలిపిస్తే ఇళ్లు తొలగిస్తానని నాపై తప్పుడు ప్రచారంచేశారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ ఇంటివద్ద పేదల ఇళ్లను తొలగించారు. ఆత్మకూరు, ఇప్పటం గ్రామాల్లో రోడ్డు విస్తరణ పేరుతో అర్థరాత్రివేళ బుల్డోజర్లతో భయభ్రాంతులను చేసి పేదల ఇళ్లు కూల్చేశారు. నిరాశ్రయులకు ఇళ్లు కూడా ఇవ్వకుండా రోడ్డున పడేశారు. ప్రజాప్రభుత్వం వచ్చాక వారందరికీ ఇంటిస్థలంతోపాటు ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మంగళగిరి పరిధిలో ఇళ్లు లేనివారికి 20వేల పక్కా ఇళ్లు నిర్మిస్తాం. మంగళగిరి పరిధిలో అధికసంఖ్యలో ఉన్న స్వర్ణకారులకోసం సంక్షేమ సంఘాన్ని ఏర్పాటుచేసి పనిముట్లు అందించాం. అధికారంలోకి వచ్చాక గోల్డ్ సెజ్ ఏర్పాటుచేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.

స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసి ఆర్థికసాయం అందిస్తాం. స్వర్ణకారుల కార్పొరేషన్ పై ఆర్కే సిఎంతో కేవలం ఫార్వార్డ్ లేఖ తెచ్చి నాటకమాడారు. యువగళానికి ముందు నేను మంగళగిరిలో పాదయాత్ర చేసి సమస్యలపై అధ్యయనం చేశా. అధికారంలోకి వచ్చాక దీర్ఘకాలంగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి బట్టలుపెట్టి మరీ పట్టాలు అందజేస్తాం. భూగర్భ డ్రైనేజి ఏర్పాటుచేసి అస్యవ్యస్తంగా ఉన్న డ్రైనేజి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తా. కృష్ణానది నుంచి పైప్ లైన్ వేసి ప్రతిఇంటికీ తాగునీరు అందిస్తా, నియోజకవర్గవ్యాప్తంగా సిసి రోడ్లు నిర్మిస్తానని లోకేష్ హామీ ఇచ్చారు.

లోకేష్ దృష్టికి మంగళగిరి వాసుల సమస్యలు
మంగళగిరి కుప్పారావు కాలనీ వాసులు తమ సమస్యలను లోకేష్ దృష్టికి తెచ్చారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయకపోవడంతో లక్షలు అప్పుచేసి వైద్యం చేయించుకుంటున్నాం. లక్షలు వెచ్చించి కోచింగ్ తీసుకున్నా ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు, మెగా డిఎస్సీ ఏర్పాటుచేసి టీచర్ ఉద్యోగాలు భర్తీచేయాలి. ఫీజు రీఎంబర్స్ మెంట్ అమలుకావడం లేదు. పెరిగిన నిత్యావసర ధరలు భారంగా మారాయి. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని రేషన్ కార్డులు, పెన్షన్లు తీసేస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల భారం అధికంగా ఉంది.

శ్రీశైలం కాలనీవాసులు సమస్యలను చెబుతూ ఉద్యోగుల నాలుగు సరెండర్ లీవ్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. భవన నిర్మాణ కార్మికులకు పనుల్లేక ఇబ్బంది పడుతున్నాం. రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి, కొత్తరోడ్లు నిర్మించాలి. యువనేత లోకేష్ మాట్లాడుతూ… అధికారంలోకి వచ్చాక రాజధాని పనులు కొనసాగించి ఉద్యోగాల కల్పిస్తాం. భారీగా పెరిగిన ఇంటిపన్నులపై సమీక్షించి ఉపశమనం కలిగిస్తాం. మంగళగిరి నియోజకవర్గంలో బ్లాక్ డెవలప్ మెంట్ విధానంలో రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజి, ఇంటింటికీ తాగునీటి సౌకర్యం కల్పిస్తాం. మంగళగిరికి పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగాలు ఇస్తాం. అయిదేళ్లలో అన్ని సమస్యలను పరిష్కరించి మంగళగిరిని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని లోకేష్ చెప్పారు.

 

LEAVE A RESPONSE