– టీడీపీ అధికారంలోకి వస్తే మైనింగ్ అక్రమాలపై కమిషన్ వేసి పెద్దిరెడ్డి వంటి దోషులను శిక్షిస్తుంది
– జగన్ రెడ్డికి అక్రమ మైనింగ్ పై సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులంటే లెక్కేలేదు
– సుప్రీంకోర్టు తీర్పును తుంగలో తొక్కి రుషికొండలో అక్రమ నిర్మాణాలు
– జగన్ రెడ్డి సారధ్యంలో పెద్ది రెడ్డి రాంచంద్రారెడ్డి డైరెక్షన్ లో రాష్ట్రంలో మైనింగ్ మాఫియా
– మైనింగ్ మాఫియా ఆగడాలను ఆధారాలతో సహా బయటపెట్టిన చంద్రబాబు
– భారతీ సిమెంట్ కోసం వేల టన్నుల ల్యాటరైట్ ను బమిడికలొద్దిలో దోచుకుంటున్నారు
– తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం
జగన్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న మైనింగ్ మాఫియాకు సంబంధించి నిన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అనేక ఆధారాలతో మీడియా ముందుకు వచ్చారు. శాండ్, గ్రావెల్, గ్రానైట్, లాటరైట్ ఇలా రకరకాలైన అక్రమ మైనింగ్ ను విచ్చల విడిగా జగన్ రెడ్డి మైనింగ్ మాఫియా జరుపుతోంది. జగన్ రెడ్డి సారధ్యంలో పెద్ది రెడ్డి రాంచంద్రారెడ్డి డైరెక్షన్ లో మైనింగ్ మాఫియా పేట్రేగిపోతుంది.
నిన్న అక్రమ మైనింగ్ పై చంద్రబాబు నాయుడు శాటిలైట్ చిత్రాలతో కూడిన ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు. అందులో అక్రమ మైనింగ్ ఎక్కడ జరుగుతుందో ఆయా ప్రాంతంలోని ఫోటోలతో సహా ప్రజల ముందుంచారు. అంతే కాకుండా ‘‘కొండల్ని చెరువులుగా మారుస్తున్న జగన్ రెడ్డి గ్యాంగ్’’ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో, ఏయే గ్రామాల్లో ఏ ఖనిజాన్ని లూఠీ చేస్తున్నారో ఆధారాలతో సహా అందులో పొందుపరిస్తే, నేడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమాధానం చెప్పలేక తప్పించుకునేందుకు బుకాయిస్తున్నారు.
ఈ పుస్తకంలో పొందుపరిచిన అక్రమ మైనింగ్ ఆధారాలను పెద్దిరెడ్డి తప్పు పట్టే అవకాశమే లేదు. స్వామి మాల ధరించి మరీ పెద్దిరెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడడం అతని యొక్క నీచమైన నైజాన్ని బయటపెట్టింది. కుప్పం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ ఏమీ జరగటం లేదు, రెండు లైసెన్సులు తప్ప అన్ని లైసెన్సులు గత ప్రభుత్వం ఇచ్చిందని పెద్దిరెడ్డి బుకాయించారు. చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో కొండలు, గుట్టలు కాలినడకన దాటుకుంటూ మరీ అక్రమంగా మైనింగ్ చేస్తున్న క్వారిల దగ్గరకు వెళ్లి అక్రమ మైనింగ్ ను భయటపెడితే, దానికి ఇప్పుడు పెద్దిరెడ్డి మాట్లాడుతూ రీజనల్ విజిలెన్స్ స్క్వాడ్(ఆర్.వి.ఎస్) లు పంపి కుప్పం నియోజకవర్గంలో 102 మైన్లలో అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్న 71 మైన్లకు రూ.114.60 కోట్ల జరిమానా విధించి, వసూలు చేశామని చెప్పారు.
అదే పని చంద్రబాబు నాయుడు పర్యటన ముందు ఎందుకు చేయలేకపోయారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమాధానం చెప్పాలి. మూడేళ్లుగా అక్రమ మైనింగ్ లో వేలకోట్లు దోచేసి నేడు చంద్రబాబునాయుడు గారు పర్యటకు వెళ్లిన వెంటనే స్క్వాడ్ లు, ఫైన్లు గుర్తుకువచ్చాయా? కేవలం ఫైన్ల రూపంలోనే రూ.114.60 కోట్లు వసూలు చేస్తే, హీనపక్షంగా కుప్పం పరిసర ప్రాంతాల్లో గ్రానైట్ అక్రమ క్వారీల ద్వారా సంవత్సరానికి రూ.2వేల కోట్లు దోపిడీకి మైనింగ్ మాఫియా పాల్పడి ఉండవచ్చు. అంటే గత మూడేళ్లలో రూ.6వేల కోట్లకు పైబడి దోచుకున్నారని అర్థమవుతోంది. కుప్పం పరిసర ప్రాంతాల్లో రూ.114.60 కోట్లు ఫైన్లు వసూలు చేశామని పెద్దిరెడ్డి చెబుతున్నారంటే, అక్కడ అక్రమ మైనింగ్ జరిగినట్లు ఒప్పుకున్నట్టే కదా?
కుప్పంలో అక్రమ మైనింగ్ గురించి National Green Tribunal కు ఫిర్యాదు చేయగా 10-05-2022న Smt. Justice Puspa Satynarayana గారు ఇచ్చిన తీర్పులో పేరా:7లో “There was inspection conducted and the illegal mining was brought out and they have seized vehicles and imposed fines” అంటూ చాలా స్పష్టంగా చెప్పారు. అదే విధంగా పేరా:8లో “The fact remains that illegal mining is happening without any lease or license”. అని కుండబద్దలు కొట్టి చెప్పారు. ఆ ప్రాంతంలో లీజ్, లైసెన్స్ లేకుండా ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంతన స్పష్టంగా తన తీర్పులో పేర్కొంటే, ఇంకా పెద్దిరెడ్డి దేనికి బుకాయిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు బయటపెట్టిన అక్రమ మైనింగ్ నిజమేనని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సమర్ధించింది. ఈ తీర్పులో ఏముందో పెద్దిరెడ్డికి తెలిసినా, తెలియనట్టు నటిస్తున్నారు.
బమిడికలొద్దిలో అక్రమ లేటరేట్ మైనింగ్ గురించి చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆధారాలతో మాట్లాడారు. దానికి నేడు పెద్దిరెడ్డి మాట్లాడుతూ కేవలం సిమెంట్ ఉత్పాదనలో 3 శాతమే లాటరేట్ వాడతారని, కాబట్టి దానిని మనం అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చాలా తేలికగా దాటవేశారు. బమిడికలొద్ది వద్ద అడవులను పెద్దఎత్తున ధ్వంసం చేసి, ఎటువంటి అనుమతులు లేకుండా ప్రతిరోజూ వందల లారీల లాటరైట్ ను భారతీ సిమెంట్స్ కోసం దోపిడీ చేస్తున్న విషయం గత కొద్ది నెలల క్రితమే అనేక ప్రసార మాధ్యమాల ద్వారా బయటపడింది.
ఈ దోపిడీ కోసం అడవిలో పెద్ద రహదారినే నిర్మించి ఆ ప్రాంతంలో ఉన్న గిరిజనులను కూడా జగన్ మైనింగ్ మాఫియా భయభ్రాంతులకు గురిచేస్తుంటే, తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రతిఘటించింది. కానీ ఇది పెద్దిరెడ్డి చెబుతున్నంత చిన్న విషయం ఏమీ కాదు. ప్రతి ఏడాది Ministry of Mines, Govt of India వారు విడుదల చేసే Indian minerals book నందు రాష్ట్రంలో లాటరైట్ మైనింగ్ యొక్క పరిమాణం ఎంత పెద్ద ఎత్తున ఉందో పొందుపరుస్తారు. కేంద్ర ప్రభుత్వం 2020లో విడుదల చేసిన ఈ పుస్తకం ప్రకారం 2015 వరకు చేసిన సర్వే ఆధారంగా అప్పటికే ఏపీలో 4,85,72,000 మెట్రిక్ టన్నుల లాట్రైట్ నిల్వలున్నాయని పేర్కొంది. దేశంలో ఎక్కడా లేని లాట్రైట్ నిల్వలు మన రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి నేడు ఇష్టానుసారంగా దోపిడీ చేస్తున్నారు.
ఇదే Indian Mineral Book లో ప్రతి సంవత్సరం ఒక్క సిమెంట్ పరిశ్రమకే దేశంలో 65,37,700 మెట్రిక్ టన్నుల లాటరైట్ అవసరం ఉంటుందని 2019-20లో మిగతా అన్ని పరిశ్రమలు కలిపి లాటరైట్ డిమాండ్ అత్యంత భారీగా 72,46,500 మెట్రిక్ టన్నులు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ గణాంకాలను బట్టి సిమెంట్ పరిశ్రమకు లాట్రైట్ ఎంత అవసరమో, ఎంత విలువైనదో అర్ధమవుతుంది. ఈ లాటరైట్ దోపిడీ వ్యవహారం పెద్దిరెడ్డి చెబుతున్నంత తేలిక వ్యవహారం కాదు. జూలై 26, 2021న National Green Tribunal justice k. Ramakrishnan గారి తీర్పులో ఈ లాటరైట్ దోపిడీ అక్రమాలను బయటపెట్టేందుకు ప్రత్యేకమైన కమిటీని కూడా వేయడం జరిగింది.
రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లా, బమిడికలొద్ది పరిసర ప్రాంతాల్లోనే ఈ 4,85,72,000 మెట్రిక్ టన్నులు లాట్రైట్ లో అత్యధిక నిల్వలున్నాయి. జగన్ రెడ్డికి చెందిన భారతీ సిమెంట్స్ కంపెనీ ప్రతియేటా 5 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేస్తూ, నేడు లాభాల బాటలో నడుస్తోంది. రూపాయి ఖర్చు లేకుండా వేల టన్నుల లాటరైట్ ను అక్రమంగా దోచేస్తుంటే, భారతీ సిమెంట్స్ కు లాభాలు రాక నష్టాలు వస్తాయా?
రిషికొండ గురించి పెద్దిరెడ్డి మాట్లాడుతూ…శాటిలైట్ ఇమేజెస్ చూడాలని చెబుతున్నారు. టెక్నాలజీ గురించి చంద్రబాబు నాయుడు గారికి పాఠాలు చెప్పే స్థాయి వైసీపీ నాయకులకు లేదు. రిషికొండ అక్రమ తవ్వకాలపై అన్నిరకాల శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగానే నిన్న మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. అక్రమ తవ్వకాలకు ముందు రిషికొండ ఏ విధంగా ఉందో జగన్ మైనింగ్ మాఫియా అడుగుపెట్టిన తర్వాత రిషికొండను ఏ విధంగా నాశనం చేశారో స్పష్టంగా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు వివరించారు.
ఆ చిత్రాలు చూస్తే జగన్ మాఫియా రిషికొండకు ఏ విధంగా బోడిగుండు కొట్టారో అర్ధమవుతుంది. గతంలో 9 ఎకరాల్లో నిర్మించిన హరిత రిసార్ట్స్ స్థలం వరకే నిర్మాణాలకు అనుమతి ఉంది. కానీ నేడు జగన్ మైనింగ్ మాఫియా రిషికొండలో దాదాపు 60ఎకరాలకు పైబడి అక్రమ తవ్వకాలు చేపట్టి, విశాఖకు తలమానికంగా ఉన్నటువంటి రిషికొండను ధ్వంసం చేశారు. మీ నాయకుడి నివాసానికి విలాసవంతమైన భవనాలు నిర్మించడానికి ఇంత దుర్మార్గానికి ఒడిగడతారా?
జూన్ 01, 2022న Justice B.R Gavai and Justice Hima kohli సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పులో “It is necessary to safe guard the environment so as to preserve pollution free environment ecology for the future generations”. పర్యావరణాన్ని సంరక్షించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని భవిష్యత్తు తరాలకు కాలుష్యరహిత వాతావరణాన్ని అందించడం మనందరి కర్తవ్యమని, రిషికొండ విధ్వంసాన్ని గమనించిన తర్వాత సుప్రీం కోర్టు వ్యాఖ్యానించడం దేనికి నిదర్శనమో పెద్దిరెడ్డి సమాధానం చెప్పాలి. ఇది మీ మైనింగ్ మాఫియా ఆగడాలను చెంపపెట్టు కాదా?
అదేవిధంగా “The construction will be permitted only on the area where the construction existed earlier and which has been demolished”. మీరు గతంలో హరిత రిసార్ట్స భవనాలు కూల్చిన ప్రాంతంలో మాత్రమే నిర్మాణాలు చేపట్టాలి గాని దానికి మించి ఒక్క అడుగులో కూడా అదనపు నిర్మాణాలు చేపట్టకూడదని సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా తన తీర్పులో పేర్కొంది. కానీ జూన్ 01, సుప్రీంకోర్టును బేఖాతరు చేస్తూ విచ్చలవిడిగా అనుమతి ఉన్న 9ఎకరాలకు మించి దాదాపు 60ఎకరాల్లో అక్రమ నిర్మాణాలకు జగన్ మైనింగ్ మాఫియా శ్రీకారం చుట్టడం వల్ల నెల తిరిగేలోపే జులై 01న “రిషికొండలో సుప్రీంకోర్టు ఆదేశాలు తూచ్.. కోర్టు వద్దన్నచోటే పునాదులు తవ్వారని” వార్తాపత్రికల్లో ప్రధానంగా వచ్చింది. అంటే సుప్రీంకోర్టు తీర్పులు పట్ల కూడా మీకు కనీస గౌరవం లేదా?
తెలుగుదేశం పార్టీ జగన్ రెడ్డి మైనింగ్ మాఫియా పట్ల భవిష్యత్తులో అత్యంత కఠినంగా వ్యవహరించబోతోంది. వచ్చే ఎన్నకల్లో తెలుగుదేశం విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు. అధికారం చేపట్టిన వెంటనే జగన్ మైనింగ్ మాఫియా ఆగడాలపై విచారణకు ఒక ప్రత్యేక కమిషన్ ను ఏర్పాటు చేస్తాం. పెద్దిరెడ్డితో సహా ఈ అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్న జగన్ ముఠా సభ్యులు ఎవరినీ కూడా వదిలే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కరినీ మేం ఏర్పాటు చేయబోయే కమిషన్ విచారించి, కఠినంగా శిక్షిస్తుంది. గతంలో ఇదేవిధమైన మైనింగ్ అక్రమాలకు పాల్పడిన గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీలక్ష్మికి ఏ గతి పట్టిందో పెద్దిరెడ్డికి, అతని మైనింగ్ ముఠాకు కూడా అదే గతి పట్టబోతుంది. అక్రమ మైనింగ్ కు సంబంధించిన ప్రతి అంశంపై మా వద్ద పక్కా ఆధారాలున్నాయి.
గతంలో ఉచితంగా ఇసుకను ఇస్తే దానిని రద్దు చేసి జగన్ రెడ్డి బినామి జయప్రకాష్ పవర్ వెంచెర్స్ ను తీసుకువచ్చి వేల కోట్లు దోపిడికి పాల్పడుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు హాయంలో కేవలం ట్రాక్టర్ ఇసుక రూ.1500కు వచ్చేది కాని నేడు రూ. 10,000 కూడా దొరకని పరిస్థితి. అంతే కాకుండా పెద్దిరెడ్డి ముఠా తమ వాహనాలకు పీఎల్ఆర్ అనే స్టిక్టర్ వేసి ఇతర రాష్ట్రాలకు వేల టన్నుల దోచేసిన ఇసుకను అక్రమంగా సరఫరా చేన్నారు. పీఎల్ఆర్ స్టిక్టర్ వేస్తే ఏ చెక్ పోస్టు వద్ద ఏ అధికారీ ఎక్కడా ఆపే పరిస్థితి లేదు. నేడు ఇసుక కొనుగోలు చేయాలంటే కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే. మద్యంలో ఏరకంగానైతే దోపిడీ చేస్తున్నారో ఇసుకలోను క్యాష్ ట్రాన్సక్షన్ పేరుతో దోపిడికి పాల్పడుతూ ప్రతి రోజు కోట్లు మింగేస్తున్నారు.