– ఎందుకు ముఖ్యమైంది?
– బడ్జెట్‌కు ప్రతీరూపమేనా?
( అంకబాబు, సీనియర్ జర్నలిస్ట్)
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను సభలో చదువుతారు. ఆర్థిక సర్వే.. బడ్జెట్లో ఏయే అంశాలను రూపొందిస్తారో తెలియజేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. బడ్జెట్ ప్రతీరూపమే ఆర్థిక సర్వే.. ఇదే విషయాన్ని విపక్షాలు విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే.
మోడీ సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సిద్దమవుతుంది. బడ్జెట్ కన్నా ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక్క రోజు ముందు ఆర్థిక సర్వేను ఆవిష్కరిస్తారు. దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు ఎలా ఉందో ఆర్థిక సర్వే వెల్లడిస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ ఏ విధంగా ఉందో ఎకనమిక్ సర్వే ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా భవిష్యత్ సవాళ్లు ఏంటివి? వీటిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలు కూడా ఆర్థిక సర్వేలో ఉంటాయి.
డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్‌లో ఎకనమిక్ డివిజన్ ప్రతి ఏడాది ఎకనమిక్ సర్వేను రూపొందిస్తోంది. చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ ఆర్థిక సర్వే బాధ్యతలు చూసుకుంటారు. నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెడతారు. తొలి ఆర్థిక సర్వేను 1950-51లో ఆవిష్కరించారు. ఆర్థిక సర్వే రెండు వాల్యూమ్స్‌లో ఉంటుంది. తొలి వాల్యూమ్‌లో ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు ఉంటాయి. రెండో వాల్యూమ్‌లో ఆర్థిక వ్యవస్థకు చెందిన గత ఆర్థిక సంవత్సరపు రివ్యూ ఉంటుంది.
ఇంకా ప్రభుత్వ స్కీమ్స్, పాలసీల గురించి వివరంగా తెలుసుకోవచ్చు.ఆర్థిక సర్వే చాలా కీలకమని చెప్పుకోవాలి. దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ డాక్యుమెంట్ చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనీ సప్లై, అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉపాధి, ఎగుమతులు, దిగుమతులు, ఫారిన్ ఎక్స్చేంజ్ ఇలా పలు వాటికి సంబంధించిన ట్రెండ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.