పిచ్చి మా ‘రాజు’!

Spread the love

– ప్రివిలేజ్ కమిటీ ముందుకు రాని ఎంపీ రాజు ఫిర్యాదు
– బీజేపీ సంజయ్ ఫిర్యాదుపై ఆగమేఘాలపై స్పందన
– ఇద్దరూ ఖాకీ బాధితులే అయినా స్పందనలో తేడాలు
– బీజేపీ-వైసీపీ బంధానికి ఇదో నిదర్శనమా?
– బీజేపీ పొలిటికల్ గేమ్ ఎప్పటిదాక?
( మార్తి సుబ్రహ్మణ్యం)

నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు పిచ్చి మారాజులానే కనిపిస్తున్నారు. వైసీపీపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన రాజుకు బీజేపీ బ్యాకింగ్ ఉందనేది చాలామంది నమ్మకం. అది నిజమే కావచ్చు. ఎందుకంటే.. చాలామంది ఎంపీలకు దొరకని మోదీ, అమిత్‌షా, రాజ్‌నాధ్‌సింగ్, బిర్లా,
rajuనద్దా వంటి పెద్దల అపాయింట్‌మెంట్లు రాజుగారికి వీజీగా దొరికేస్తాయి. అంతేనా.. సంఘ్ దళపతి ద త్తాత్రేయ హోసబలె, సంతోష్‌జీ వంటి సంఘాగ్రేసరులతోనూ ఆయన భేటీలు వేస్తారు. అంతెందుకు? ఏపీలో జగనన్న సర్కారు ఆయనను అరెస్టు చేసిన సందర్భంలో, చెరసాలకు వెళ్లకుండా బయటవేయడంలోనూ కమలదళం కావలసిన సాయం చేసి ఉండవచ్చు. రాజు చేసే ప్రతి ఫిర్యాదుపై ఆగమేఘాలపై స్పందిస్తూ ఉండవచ్చు.మరింకేం? అంతకంటే ఇంకేం కావాలి? రాజు గారికి బీజేపీ బాసటగానే నిలిచింది కదా? అని అమాయకంగా అడగవచ్చు.

రేపో మాపో అన్నీ కలసివస్తే నర్సాపురం ఎంపీ బీజేపీ అభ్యర్ధిగా అదే రాజు గారు తెరపైకొచ్చినా ఆశ్చర్యం లేదు. ఆ మేరకు కమలదళం ఆయనకు గ్రీన్‌సిగ్నల్ కూడా ఇచ్చేసి ఉండవచ్చు. అడిగిన వెంటనే ఆయనకు సీఆర్‌పీఎఫ్ సెక్యూరిటీ కూడా ఇచ్చింది. అఫ్‌కోర్స్. అందుకు కోర్టు ఆదేశం కూడా ఒక కారణం.

యస్. రాజు గారికి బీజేపీ పొలిటికల్‌గా సపోర్టు ఇస్తోంది. అంతేనా?.. రాజు బీజేపీలో చేరతానని చెప్పినా ఆయనతో ఎందుకు మాట్లాడలేదని స్వయంగా అమిత్‌షా, ఏపీ బీజేపీ నేతలను కోర్ కమిటీ భేటీలో కడిగేసి ఉండవచ్చు. మరింత చే స్తున్న బీజేపీ, అదే రాజు గారు తనపై ఏపీ ఐపిఎస్ అధికారి పివి సునీల్‌కుమార్‌పై, పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీకి ఎప్పుడో ఇచ్చిన ఫిర్యాదును ఎందుకు పక్కనపడేసింది? ఆయనకంటే ఆలస్యంగా మొన్నీమొధ్యే తెలంగాణలో కరీంనగర్ పోలీసులపై బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్, అదే ప్రివిలేజ్ కమిటీకి ఇచ్చిన ఫిర్యాదుపై యమర్జెంటుగా స్పందించి, డీ జీపీ నుంచి కమిషనర్ల వరకూ తమ ఎదుట హాజరుకావాలని ఎందుకు సమన్లు జారీ చేసింది?

నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్‌పై పోలీసు దాడి జరిగిన వెంటనే స్పీకర్ కొంపలు మునిగినట్లు ఎందుకు ఫోను చేసి, యోగక్షేమాలు విచారించి ముందు అర్జంటుగా ఢిల్లీకి ఏ ఫ్లైటు దొరికితే ఆ ఫ్లెటు ఎక్కి రమ్మని ఎందుకు పిలిచినట్లు? సంజయ్, అర్వింద్ మాదిరిగానే రఘురామకృష్ణంరాజు కూడా ఎన్నికయిన ఎంపీనే కదా? ఆయన వారిద్దరి కంటే పోలీసు బాధితుల్లో సీనియర్ బాధితుడే కదా? వారిద్దరి కంటే ముందుగానే ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదుచేస్తే, దానిని పట్టించుకోకుండా సంజయ్ విషయంలోనే ఎందుకు శ్రద్ధ చూపిస్తున్నట్లు?

ఈ ప్రశ్నలకు సమాధానం సింపుల్. ఇది బీజేపీ ఆడే ఆట. ఈ ఆటలో దానికి అటు రాజు కావాలి. ఇటు వైసీపీ కావాలి. రాజు బూచి చూపి వైసీపీ పిలక చేతిలో ఉంచుకుని, కావలసిన కార్యాలు కానిచ్చుకోవాలి. అటు వైసీపీ బూచిని చూపి రాజును చేతిలో ఉంచుకోవాలి. అంటే ఏకకాలంలో అటు రాజు, ఇటు జగన్‌బాబునూ తన చేతిలో ఉంచుకునే మాయోపాయమన్నమాట. మళ్లీ ఏపీలో బీజేపీ-వైసీపీ చాలా సీరియస్‌గా సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకుంటారు. బీజేపీ నేతలను వైసీపీ సర్కారు అరెస్టు చేస్తుంటుంది. మళ్లీ అదొక ఆట! సో.. బీజేపీ సపొర్టు లేకుండా రాజు ఇప్పటిదాకా కథను ఇక్కడిదాకా తీసుకురావడం అసంభవమని మెడమీద తల ఉన్న ఎవరికయినా అర్ధమయితీరాలి.

అదే సమయంలో కేంద్రంలో బీజేపీ సపోర్టు ఉన్నందుకే, ఏపీలో జగనన్న గుండెమీద చేయివేసుకుని నిద్రపోతున్నారన్న విషయం చిన్న పిల్లాడికీ తెలియదనుకుంటే, అదొక అమాయకత్వం అవుతుంది. ఇప్పటిదాకా జగనన్న సీబీఐ కోర్టుకు హాజరుకాకపోవడం, వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ దర్యాప్తు నత్తనడక, రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడల్లా ‘నిర్మల’ హృదయంతో ఏదో ఒక ఖాతా నుంచి నిధులు విడుదల చేయడం, డీఓపీటీ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అనేక కీలక అంశాలపై ఎన్నిసార్లు లేఖలు రాసినా , సీఎస్ లెక్కచేయకపోయినా కేంద్రం కిమ్మనకుండా ఉంటుదంటే ఆ ధీమాకు కారణమేమిటన్నది మెడ మీద తల ఉన్న ఎవరికయినా ఇట్టే తెలిసిపోతుంది.

రాజ్యసభలో బీజేపీకి ఇంకా సరిపడ బలం లేదు. కాబట్టి అటు తెరాస, ఇటు వైకాపా సందర్భానుసారంగా ఆపద్బాంధవుడి అవతారం ఎత్తుతుంటాయి. మీడియా ముందు కమలంపై కన్నెర్ర చేసే ఈ పార్టీలు, లోకసభలో చర్చలు-ఓటింగ్ సందర్భంలో ఉండవు. ధర్మాగ్రహం ప్రకటించి వాకౌట్ చేయడమో, తమంతట తాము సస్పెన్షన్ చేయించుకోవడమో చేస్తుంటాయి. అంటే ఆరకంగా పరోక్షంగా కమలం పార్టీకి మేలు చేస్తుంటాయన్నమాట. ఈ సూక్ష్మం కూడా తెలియని వారు ఈ శతాబ్దపు అమాయకుల కిందే లెక్క.

ఉదాహరణకు కేసీఆర్‌ను త్వరలో జైలుకు పంపిస్తామని తెలంగాణ బీజేపీ చీఫ్ ఇప్పటికి లక్షా తొంభైసార్లు హెచ్చరించి ఉంటారు. కానీ ఆ లోగా ఆయననే కేసీఆర్ సర్కారు, తొమ్మిదిసార్లు జైలుకు పంపించింది. మరి
kcr-sanjayఅంతచేసినా ప్రతీకారంతో రగిలిపోవలసిన సంజయ్, ఇప్పటిదాకా కేసీఆర్‌కు వ్యతిరేకంగా కేంద్రానికి ఒక్క ఫిర్యాదు చేసిందీ లేదు. తనదగ్గర ఉన్న సాక్షాలను సమర్పించిందీ లేదు. నిజంగా సంజయ్ దగ్గర కేసీఆర్‌కు వ్యతిరేకంగా సాక్షాలుంటే వాటిని ఈపాటికే కేంద్రానికి సమర్పించి ఉండాలి. ఆ మాటకొస్తే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌పై చేసిన ఫిర్యాదులే ఎక్కువ. కనీసం దానిపైనయినా విచారించాలని, తెలంగాణ బీజేపీ కేంద్రాన్ని ఒత్తిడి చేసింది లేదు. అయినా సరే భావోద్వేగం రగిలించే పనిలో బీజేపీ బిజీగా ఉంటుంది. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులో అవినీతి జరిగిందని సంజయ్ అండ్ కో ఆరోపించడం.. అబ్బే అలాంటిదేమీ లేదు. అదో కడిగిన ముత్యం లాంటి ప్రాజెక్టని అదే పార్టీ కేంద్రమంత్రి లోక్ సభలో సమాధానం ఇవ్వడం.. రాష్ట్రంలో కేంద్ర పథకాలతో జరుగుతున్న పథకాల్లో అవినీతి జరుగుతోందని తెలంగాణ కమలదళాలు ఆరోపించడం.. కేంద్ర అధికారుల బృందాలొచ్చి, కేసీఆర్ స్కీములు బ్రహ్మాండమని కితాబు ఇవ్వడం ఇంకో పెద్ద కామెడీ. అదొక ఆట! కంటెంటు లేనివాటికే కటౌట్లు ఎక్కువ!!

ఇంతకీ ఏపీలో బీజేపీ విధానం ఏమిటన్న ప్రశ్నకు ఆ పార్టీ వద్ద సరైన సమాధానం దొరకదు. వైసీపీ జుట్టు తన చేతిలో ఉన్నంతవరకూ, దాని గురించి భయపడాల్సిన పనిలేదు. టీడీపీ కూడా తనను పల్లెత్తు మాట అనకపోగా, తన కరెణాకటాక్ష వీక్షణాల కోసం పరితపిస్తోంది. కాకపోతే టీడీపీ బలహీనపడితే, ఆ స్ధానంలో తాను వచ్చి, ఆ తర్వాత వైసీపీని దెబ్బకొట్టవచ్చు. ఆశ మంచిదే. అత్యాశే పనికిరాదు.

పట్టుమని పదిమంది జనాలను ఆకర్షించే దిక్కులేని లీడర్లు, వికటకవులు, అధికార పార్టీకి దాసోహమనే పేపర్ టైగర్లు ఎక్కువగా ఉన్న ఏపీ బీజేపీ నుంచి, ఢిల్లీ నాయకత్వం ఎక్కువగా ఊహించుకుంటే అంతకుమించిన అమాయకత్వం మరొకటి ఉండదు. ఈలోగా చెలికాడు పవన్ పార్టీ చేజారినా ఆశ్చర్యపోవలసిన పనిలేదు. పులిహోరలో పులి ఉన్పప్పటికీ అందులో పులి ఉండదు. పవన్ కల్యాణ్ ఎంత రాజకీయ అజ్ఞాతవాసి అయినా, పులిహోర ఎవరు? ఏమిటన్నది తెలుసుకోలేనంత మరీ అమాయజీవి కాదు. అయినా ఏపీ-తెలంగాణలో బీజేపీకి పెద్దగా ఆశలేమీలేవు. తాము చెప్పినట్లు వినే ముఖ్యమంత్రులుంటే చాలు. కాంగ్రెస్ కాకుండా మరెవరొచ్చినా బీజేపీకి వచ్చిన గత్తరేమీలేదు. దిసీజ్ వాస్తవం!

ఇక మళ్లీ రాజుగారి దగ్గరకొస్తే.. ఆయన ఏపీ సీఐడీ చీఫ్ సునీల్‌పై ప్రివిలేజ్ కమిటీ, జాతీయ మానవ హక్కుల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులన్నీ ఇంకా చెత్తబుట్టలోనే సుఖనిద్రపోతున్నా, రాజు గారు ఇంకా బీజేపీని గుడ్డిగా నమ్మడమే ఆశ్చర్యం. యుపీ ఎన్నికలయ్యే దాకా బీజేపీకి ఇలాంటి అంశాలు సిల్లీగానే కనిపించ డం సహజం. రాజుకు తన అవసరం ఉంది తప్ప, తనకు రాజు అవసరం లేదు. అఫ్‌కోర్స్.. నర్సాపురంలో రాజు లాంటి అభ్యర్ధి తనకు భూతద్దం వేసి వెతికినా దొరకడు.

అసలు ఇప్పటి పరిస్థితిలో ఏపీ బీజేపీలో చేరితే, వారు తమ భవిష్యత్తును తామే నాశనం చేసుకున్నట్లు లెక్క. కాగితపు పులుపు, టీవీ చానళ్ల చిరుతలే ఎక్కువగా కనిపించే ఏపీ బీజేపీలో చేరాలంటే, దానికి చాలా దమ్ము కావాలి. ఆత్మహత్య చేసుకోవడానికీ చాలా ధైర్యం కావాలి మరి! అలాంటిది అన్నీ తెలిసి రాజులాంటి సిట్టింగ్ ఎంపీ బీజేపీలో చేరాలనుకుంటున్నా, ఆయన పెట్టుకున్న ప్రివిలేజ్ కమిటీ పిటిషన్‌ను విజయవంతంగా సమాధి చేసి, ఆయనపై వైసీపీ ఇచ్చిన అనర్హత పిటిషన్ దుమ్ము దులిపారంటే.. బీజేపీ ఆట ఏమిటన్నది సులభంగానే అర్ధమవుతుంది. ‘పువ్వుపార్టీ’కి అటు జగన్ పార్టీ కావాలి. ఇటు రాజూ కావాలి. ఇద్దరినీ ఒదులుకోలేదు. ఇదో లవ్వాట లాంటి ‘పువ్వా’ట!

Leave a Reply