-3 నుండి 8 గంటలు ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ నిర్ణయమా
– 24 గంటలు ఇచ్చేటట్లు అయితే రాజస్థాన్,చత్తీస్ ఘడ్,కర్ణాటక లలో ఎందుకు ఇవ్వడం లేదు
-చత్తీస్ ఘడ్ లో విద్యుత్ ను అమ్ముకుంటున్నారు
-ఒకరి వెనుక ఒకరు ఆ పార్టీ జాతీయ విధానాన్ని బయట పెడుతున్నారు
-అనువైన సమయంలో వాడుకునేందుకే అందుబాటులో 24 గంటల విద్యుత్
-కాంగ్రెస్ పార్టీ ఏనాడు 24 గంటల ఉచిత విద్యుత్ ఊసే ఎత్తలేదు
-వై ఎస్ ఏనాడు 24 గంటల ఉచిత విద్యుత్ ప్రస్తావించ లేదు
-వ్యవసాయానికి సరఫరా చేస్తున్న ఉచిత విద్యుత్ పై చర్చకు తెరలేపడం కాంగ్రెస్ పార్టీ కుట్రనే
-గృహ వినియోగదారులతో పాటు వర్తక,వాణిజ్య,వ్యాపార,పరిశ్రమలకు సరఫరా చేస్తున్న విద్యుత్ పై మాట లేదేందుకు
-ఉచిత విద్యుత్ కు కాదు అవినీతికి ఆ పార్టీ పేటెంట్
-గల్లీ నుండి ఢిల్లీ దాకా ఊచలు లెక్క పెట్టింది కాంగ్రెస్ పార్టీ నేతలే
-3 గంటల నుండి 8 గంటలు ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ జాతీయ విధానం
-ఆ పార్టీ అధికారంలో ఉండగా ఇచ్చింది ఎన్ని గంటలో రైతులకు తెలుసు
-కాంగ్రెస్ పార్టీ మోసం బట్టబయలు అయింది
-ఆ పార్టీ దుర్మార్గాన్ని ఏక్కడికక్కడే ఎండ గట్టండి
-రైతు సంఘాలు మేల్కొనాలి
-కాంగ్రెస్ పార్టీ కుట్రలను విచ్ఛిన్నం చేసేందుకు రైతాంగం అప్రమత్తంగా ఉండాలి
మంత్రి జగదీష్ రెడ్డి
వ్యవసాయానికి తెలంగాణా ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ పై కాంగ్రెస్ పార్టీ తన విదానాన్ని బహిర్గతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా కాంగ్రెస్ పార్టీ విధానమే అయితే గతించి పోతున్న ఆ పార్టీకీ ఊపిరి పోసిన రాజస్థాన్, శ్వాస నందించిన చత్తీస్ ఘడ్,సంజీవినీని అందించి ప్రాణం పోసిన కర్ణాటక రాష్ట్రాలలో ఎందుకు 24 గంటలు ఉచితంగా సరఫరా చేయడం లేదో తేల్చి చెప్పాలని ఆయన నిలదీశారు.
జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కు రాష్ట్రానికో విధానం ఉండదని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఉదయం హైదరాబాద్ లోని బి ఆర్ ఎస్ ఎల్ పి కార్యాలయంలో సహచర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తుంగతుర్తి శాసన సభ్యులు గాధరి కిశోర్ కుమార్ తదితరులతో కలసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్ది మాట్లాడారు.
ఉచిత విద్యుత్ కు పేటెంట్ గా చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ గానీ, ఆ విధానాన్ని అమలు పరిచారని చెప్పుకుంటున్న వై ఎస్ గానీ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఏనాడు ఉచ్చరించ లేదన్నారు.అలా ఉచ్చరించి ఉంటే ఆ రికార్డ్ లు బహిరంగ పరచాలని ఆయన డిమాండ్ చేశారు. తెలిసో తెలియక ఆ పార్టీ అధినేత మూడు నుండి ఎనిమిది గంటలు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సరిపోతుందంటే అందుకు అనుగుణంగా ఆయన వెంట ఆ పార్టీ నేతలు అదే రాగాన్ని ఆలపిస్తున్న వైనం చూస్తుంటే ఇది కాంగ్రెస్ పార్టీ జాతీయ విధానంగా కనిపిస్తుందన్నారు.
అనువైన సమయంలో రైతాంగం వినియోగించు కోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల ఉచిత విద్యుత్ ను అందుబాటులో ఉంచితే దానిని చూసి ఆ పార్టీ నేతలు సహించుకోలేక పోతున్నారన్నారు.పొర పాటున ఆ పార్టీకీ అక్కడక్కడా ఓటేస్తే ఎకరం ఉన్న రైతులకు గంట,రెండు ఎకరాలు ఉన్న రైతుకు రెండు గంటలు మూడు ఎకరాలు ఉన్న రైతుకు మూడు గంటలు గరిష్టంగా 8 గంటలు సరఫరా చెయ్యడం ఆ పార్టీ విధానంగా రూపొందించుకున్నట్లు మూడు రోజులుగా కాంగ్రెస్ పార్టీ నేతల నోటి వెంట జారుతున్న మాటలు రుజువు పరుస్తున్నాయాన్నారు.
ఇంటికి 24 గంటలు సరఫరా ఉండాలి,వాణిజ్య,వ్యాపారాలకు 24 గంటలు సరఫరా ఉండాలి,పరిశ్రమలకు 24 గంటలు ఉండాలి వ్యవసాయ దారులకు మాత్రం 8 గంటలు చాలు అన్నది కాంగ్రెస్ పార్టీ వైఖరిగా తేట తెల్లం అవుతుందన్నారు.విద్యుత్ వినియోగ దారులందరికి 24 గంటలు సరఫరా చేస్తున్నట్లే రైతాంగానికి 24 గంటలు సరఫరా చెయ్యాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని ఆయన సుస్పష్టం చేశారు.
చీటికీ మాటికి గల్లీ నుండి ఢిల్లీ వరకు పేటెంట్ పేటెంట్ అంటూ చిలక పలుకులు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు వారి పార్టీ అధికారంలో ఉన్న చత్తీస్ ఘడ్ లో వ్యవసాయానికి 24 గంటలు సరఫరా చెయ్యక పోగా అమ్ముకుంటున్నారని అటువంటి మోసాన్ని ఎండగట్టకపోతే తెలంగాణా రైతాంగానికి మొదటికే మోసం వస్తుందని ఆయన హెచ్చరించారు. అవును వారు పేటెంట్లే గల్లీ నుండి ఢిల్లీ వరకు అధికారాన్ని అనుభవించి జైలులో ఊచలు లెక్కపెట్టిన వారు అవినీతికి మాత్రమే పేటెంట్ దారులని ఆయన ఎద్దేవాచేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమి చేసాడు అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటున్నారని ఆయన విరుచుకుపడ్డారు.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తులు కోటి 40 లక్షల మెట్రిక్ టన్నులకు పెరగడమే ముఖ్యమంత్రి కేసీఆర్ పని తీరుకు నిదర్శనమన్నారు.తెలంగాణా ప్రజలను మోసం చేయడానికే కాంగ్రెస్ పార్టీ వ్యవసాయానికి సరఫరా చేస్తున్న ఉచిత విద్యుత్ మీద చర్చకు తెర లేపిందన్నారు.గృహ వినియోగదారుల నుండి మొదలు వర్తక వ్యాపార,వాణిజ్య ,పరిశ్రమలకు సరఫరా 24 గంటల విద్యుత్ పై ఎందుకు మాట్లాడడం లేదని ఆయన కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.
ఇందులో దాగి ఉన్న మర్మం కనిపెట్టాలని తెలంగాణా రైతాంగానికి ఆయన పిలుపునిచ్చారు. కేవలం వ్యవసాయానికి సరఫరా చేస్తున్న ఉచిత విద్యుత్ పై చర్చ పెడుతున్నారు అంటే దాని వెనుక కాంగ్రెస్ పార్టీ పెద్ద కుట్రకు తెరలేపిందన్న అనుమానం కలుగుతోందన్నారు.అవాకులు చెవాకులు పేలుతున్న ఈ ప్రబుద్ధుల పాలనలోనే కదా సబ్ స్టేషన్ ల ముట్టడిలు, ధర్నాలు,రాస్తారోకోలు,ఆందోళనలు జరిగిందని ఆయన దుయ్యబట్టారు.
వాటన్నింటిని మరచి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాతో బీడు భూములన్నీ సస్యశ్యామలంగా మారి రైతాంగం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుంటే వారిలో అలజడి లేపేందుకే కాంగ్రెస్ పార్టీ ఈ చర్చకు తెర లేపినట్లుందన్నారు.గృహ వినియోగదారులకు,వర్తక వ్యాపార,వాణిజ్య,పరిశ్రమలకు 24 గంటలు సరఫరా ఉండొచ్చు కానీ వ్యవసాయానికి మూడు గంటల నుండి 8 గంటలకు పరిమితము చెయ్యలన్న కాంగ్రెస్ పార్టీ నేతల మాటల్లోనే కాంగ్రెస్ పార్టీ వైఖరి బహిర్గతం అయిందన్నారు.
అటువంటి దుర్మార్గాన్ని ఎండ గట్టేందుకు తెలంగాణా రైతాంగం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ రైతు సంఘంతో పాటు అన్ని పార్టీల రైతు సంఘలా ప్రతినిధులు రైతువేదికల మీద,రచ్చబండల కాడ వ్యవసాయానికి మూడు గంటల నుండి ఎనిమిది గంటలు సరఫరా చాలు అన్న కాంగ్రెస్ పార్టీ నేతల ప్రకటన పై చర్చించి తీరాల్సిందే నని మంత్రి జగదీష్ రెడ్డి ఆయా సంఘలకు విజ్ఞప్తి చేశారు.