పవన్ కళ్యాణ్ నేత్రత్వం లోని జనసేన పార్టీ ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా తయారైంది. ఇటీవల కుప్పం నియోజకవర్గ పర్యటనలో ఉన్నప్పుడు, తెలుగు దేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన ఓ సరదా వ్యాఖ్య తో తేనెతుట్టె ను కదిపినట్టయింది. జనసేన తో పొత్తుపెట్టుకుంటారా అని ఒక కార్యకర్త అడిగిన ఒక ప్రశ్నకు ; ‘వన్ సైడ్ లవ్ తో -కుదరదు కదా! ఇద్దరూ పరస్పరం ప్రేమిస్తేనే-అది పెళ్లి వరకు వస్తుంది…’ అని ఆయన వ్యాఖ్యానించారు.
దీనిపై ఎవరి వ్యాఖ్యానాలు వారు చేశారు. ఒక జనసేన నాయకుడు అయితే ఎక్కడికో వెళ్లిపోయారు. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థి గా ప్రకటించి; జనసేనకు 50 శాతం సీట్లు కేటాయిస్తే,టీడీపీ తో పొత్తుకు సిద్ధమే అని ప్రకటించారు. ఇలా ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వారు చేసిన తరువాత, పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. జనసేన తో పొత్తుకు చాలా పార్టీలు ఆసక్తి చూపిస్తున్నాయని; అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుందామని; ఈ లోపు ఈ మైండ్ గేమ్స్ ను పట్టించుకోవద్దని అన్నారు. పనిలో పనిగా మరో మాట కూడా చెప్పారు. తాము ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్నామని కూడా పవన్ చెప్పారు.
మరి, బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు, మళ్లీ పొత్తుల ప్రస్తావన ఎందుకు అనేది అర్థంకాదు.’మేం బీజేపీ తో పొత్తులో ఉన్నాం. వేరే పొత్తుతో పనిలేదు…’అని పవన్ కళ్యాణ్ ప్రకటించివుండవలసింది. రాజకీయాలలో స్పష్టత వచ్చి ఉండేది. అలా చెప్పకుండా; పవన్ కళ్యాణ్ కూడా కొత్త పొత్తుల గురించి మాట్లాడారు అంటే- బీజేపీ కి టాటా చెప్పడానికి మానసికంగా సిద్ధమయ్యారని భావించవచ్చు. వాట్ నెక్స్ట్ అనేదే తేల్చుకోలేకపోతున్నారు అని అనుకోవదానికి ఆయన ప్రకటన అవకాశం ఇచ్చింది.
అందుకే, అదును చూసి, చంద్రబాబు నాయుడు గాలిలోకి ఓ బాణం వదిలారు. తగలాల్సిన చోట తగిలింది. ఆయనకు కావలసిన సమాధానం లభించింది. ‘కొత్త పొత్తుల కోసం జనసేన సిద్ధం ‘అనే సంకేతాలను పవన్ కళ్యాణ్ పంపించారు. ఇక, పిల్లి మెడలో గంట కట్టడమే మిగిలి ఉంది.
ఈ పరిస్థితుల్లో, పవన్ కళ్యాణ్ కు గల ప్రత్యామ్నాయాలు ఏమిటో చూడాలి.
1. వైసీపీని రాజకీయ ప్రత్యర్థిగా పవన్ కళ్యాణ్, జనసేన సభ్యులు భావిస్తారు. కనుక, వైసీపీ తో జత కట్టలేరు.
2. కమ్యూనిస్టులతో 2019 లో జతకట్టారు. ఇద్దరికీ వర్క్ ఔట్ కాలేదు. కనుక, వారితో జత కట్టే ప్రశ్న లేదు. కట్టినా, 2019 పునరావృతమే కదా! పై పెచ్చు, సీపీఐ ఇప్పటికే, టీడీపీ తో ‘రిలేషన్ షిప్’లో ఉంది.
3. బీజేపీ తో ఇప్పటికే పొత్తు అంటున్నారు కానీ; ఇది పేపర్ మీదే అని జనసేన మాటలను బట్టి అర్ధం చేసుకోవచ్చు.
4.ఇక, మిగిలింది తెలుగు దేశం. అయితే,తెలుగు దేశం తో ఎన్నికల పొత్తు పెట్టుకోవాలి. లేదంటే- బీజేపీ తో కలిసి ఎన్నికలకు వెళ్ళాలి. ఇంకొంచెం ఫిల్టర్ చేస్తే; రెండు పార్టీల బలం 10 శాతం దాటే అవకాశం లేదు. అందువల్ల ; వచ్చే శాసన సభలో అడుగుపెట్టే మహత్తర అవకాశం కోసం- జనసేనకు మిగిలి ఉన్న ప్రత్యామ్నాయం – టీడీపీ తో కలిసి ఎన్నికలకు వెళ్లడమే. నిజానికి, క్షేత్ర స్థాయిలో జనసేన వర్గీయులలో అధికుల అభిప్రాయం ఇదే. ఈ మధ్య జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. జనసేన-బీజేపీ పొత్తుపెట్టుకుని పోటీ చేశాయి. టీడీపీ వర్గాలు జనసేనకు వెనుక నుంచి మద్దతు ఇవ్వడంతో,దాదాపు నలభై చోట్ల జనసేన అభ్యర్థులు గెలిచారు. బీజేపీ కి మాత్రం డిపాజిట్లు రాలేదు, ఒక్క ఆదినారాయణ రెడ్డి వ్యక్తిగత ప్రభావం ఉన్నచోట్ల తప్పించి. జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తే…; ఫలితం ఎలా ఉంటుందో తిరుపతి ఎం.పీ. ఉప ఎన్నిక ఫలితం చెప్పేసింది. కనుక,ఈ రాష్ట్రం లో బీజేపీ పరిస్థితి ఏమిటో జనసేనకు తెలిసినప్పటికీ…. ఆ పొత్తు విషయం లో సభ్యత రీత్యా- జనసైనికులు మౌనం పాటిస్తున్నారు.
అయితే, ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నందున, పొత్తులకు ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పుడు నగారా మోగిన ఎన్నికల రాష్ట్రాలలో మార్చి నెల 10 వ తేదీ తరువాత బీజేపీ పరిస్థితి ఏమిటో చూడాలి. మళ్లీ 2023 లో కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు ఉన్నాయి.
తెలంగాణ,కర్ణాటక,రాజస్థాన్,మధ్యప్రదేశ్,ఛత్తీస్ ఘడ్ , కొన్ని ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత బీజేపీ పరిస్థితి ఏమిటో తెలుస్తుంది. వాటితో, ఇక్కడ ఏ పీ లో,రాజకీయాలు, పొత్తులలో పూర్తికి స్పష్టత వస్తుంది. ఈలోపు ఎవరి మైండ్ గేమ్ వారు ఆడుకోవచ్చు. దాగుడు మూతల ఆటలు బోలెడు ఆడుకోవచ్చు.
