Suryaa.co.in

Editorial

గుళ్లపై పాలకుల పెత్తనమేంటి?

  • ఆలయాలపై సర్కారు పెత్తనం అవసరం లేదు

  • మా గుళ్లను మాకు ఇచ్చేయండి

  • ఇతర మతాలపై లేని నిబంధన మాకెందుకు?

  • మా గుడి.. మా ధర్మం నినాదం

  • ఆలయాలపై దాడులు జరిగితే నిద్రపోతున్నారా?

  • దిక్కులేని హిందూ ధర్మానికి దిక్కెవరు?

  • ఆలయ నిధులు అన్యమతస్థులకు ఇవ్వడానికి వీల్లేదు

  • గర్జించిన హిందూసేన

  • విజయవాడ హైందవశంఖారావనికి పోటెత్తిన హిందూవాహిన

  • కాషాయమయమయిన రాజధాని పురవీధులు

  • హిందూ డిక్లరేషన్ ప్రకటించిన హైందవశంఖారావం

  • చరిత్రలో తొలిసారి హిందువుల ఇళ్లపై కాషాయధ్వజం

(సూర్య ప్రధాన ప్రతినిధి)

విజయవాడువీధులు కాషాయంతో కళకళలాడాయి. కేసరపల్లిలో వీహీచ్‌పీ నిర్వహించిన హైందవశంఖారానికి హిందూవాహిని పోటెత్తింది. లక్షల సంఖ్యలో హిందూదండు కేసరపల్లివైపు అడుగులేసింది. హిందూ ఆలయాలపై పాలకుల పెత్తనమేమిటని చూపుడువేలితో ప్రశ్నించింది.

మా ఆలయాల నిధులతో ఇతర మతాలను సంతృప్తి పరచడమేమిటని నిలదీసింది. అసలు ఆలయాలను సర్కారు కబంద హస్తాల నుంచి విముక్తం చేయాలని గళమెత్తింది. మిగిలిన మతాలపై లేని పెత్తనం.. కేవలం హిందూమతంపైనే ఎందుకని గర్జించింది. మా గుడి.. మా ధర్మం అంటూ నినదించింది. ఆలయాలపై దాడులు జరుగుతుంటే చర్యల కొరడా ఝళిపించకుండా, పాలకులు గుడ్డిగుర్రానికి పళ్లు తోముతున్నారా అని ధర్మాగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా లక్షలాది హిందూసైనికుల సమక్షంలో హిందూ డిక్లరేషన్ ప్రకటించింది.

పీఠాథిపతులు, హిందూ సంస్థలు, ధార్మిక సంస్థలు తరలివచ్చిన హైందవశంఖారం హిందూజాతిని జాగృతి చేసింది. ఏపీ, తెలంగాణ నుంచి ఈ సభకు లక్షలాదిమంది తరలిరావడంతో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. చరిత్రలో తొలిసారి విజయవాడ, పరిసర ప్రాంతాల్లో హిందువులు తన ఇళ్లపై కాషాయ జెండా ఎగురవేయటం విశేషం.

విదేశీయుల పాలనలోనూ మన దేవాలయాలను రక్షించుకున్నాం, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మాత్రం మన దేవాలయాలను రక్షించుకోలేకపోతున్నాం. మన ధర్మానికి మూలస్తంభమైన దేవాలయాలను రక్షించుకోవడమే మన దీక్ష కావాలి. ఆ దీక్షను హిందూ సమాజం చేపట్టాలనే ఉద్దేశాన్ని బలోపేతం చేయడానికి విజయవాడ దగ్గరలోని కేసరపల్లిలో జనవరి 5న విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ‘హైందవ శంఖారావం’ కార్యక్రమం నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల నుండి దాదాపు మూడు లక్షల మందికి పైగా హిందువులు పాల్గొన్న ఈ ‘హైందవ శంఖారావం’ కార్యక్రమంలో శ్రీమన్నారాయణ త్రిదండి చిన్నజీయర్ స్వామి, గణపతి సచ్చిదానంద స్వామి సహా 150కి పైగా సాధుసంతులు పాల్గొన్నారు. విశ్వహిందూ పరిషత్ అఖిల భారత అధ్యక్షులు అలోక్ కుమార్, అఖిల భారత సంస్థాగత కార్యదర్శి మిలింద్ పరాండే, అఖిల భారతీయ సంయుక్త కార్యదర్శి కోటేశ్వర శర్మ, అయోధ్య శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవిందదేవ్ గిరి మహరాజ్ పాల్గొన్నారు.

గోవిందదేవ్ గిరి మహరాజ్ మాట్లాడుతూ ‘‘భారతదేశం ప్రపంచానికి అందించిన జ్ఞానజ్యోతి… శాస్త్రాలు, సాధువులు, గోమాత, తీర్థయాత్రలు, దేవాలయాలు అనే ఐదు అంశాల ఆధారంగా ఏర్పడింది. దేవాలయం భగవంతుడి నివాసం. మన సంస్కృతికి ఆధార స్తంభం. మన దేవాలయాలను రక్షించి తీరాలని ప్రతిజ్ఞ చేయడం కోసం మనం ఇక్కడకు వచ్చాం’’ అని చెప్పారు.

విహెచ్‌పి అఖిల భారతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వరశర్మ మాట్లాడుతూ ‘’34 సంవత్సరాల క్రితమే, 3 దేవాలయాలు ఇవ్వకపోతే 30వేల దేవాలయాలు తీసుకుంటాం అని హిందూ సమాజం నినదించింది. దేశమంతా దేవాలయాలను రాజకీయ పార్టీల, ప్రభుత్వాల కబంధహస్తాల నుండి విముక్తం చేయడానికి తొలి ప్రయత్నమే ఈ హైందవ శంఖారావం. నిజానికి ఈ శంఖనాదం ఈనాటిది కాదు. 1987లోనే చల్లా కొండయ్య కమిషన్ సిఫార్సులకు వ్యతిరేకంగా చిన్నజియర్ స్వామి నిరాహారదీక్ష చేసిననాడే మొదలైంది. కమలానందభారతీ స్వామి పాదయాత్ర చేసి రాష్ట్రంలోని అన్న దేవాలయాల ఆస్తుల వివరాలు, వాటిలో అన్యాక్రాంతమైన ఆస్తుల వివరాలూ సేకరించారు.

ఆలయాల్లో ఆస్తుల వివరాలతో బోర్డులు పెట్టించింది ఆయనే.అలా ఈ ఉద్యమానికి ఎప్పుడో పునాది పడింది. చల్లా కొండయ్య నివేదికలో అర్చకులు, ట్రస్టుబోర్డులు, ఉద్యోగులు దేవాలయాల ఆస్తులను భ్రష్టుపట్టిస్తున్నారని, అవినీతికి పాల్పడుతున్నారనీ పేర్కొన్నారు. కానీ నేటివరకూ ఆ అక్రమాలను నిరూపించలేకపోయారు, అన్యాక్రాంతమైన భూములను అప్పగించలేకపోయారు. చల్లా కొండయ్య కమిషన్ దేవాలయాలపై పెత్తనాన్ని ప్రభుత్వాధికారులకు అప్పజెప్పింది. దానివల్ల అన్యమతస్తులు దేవాలయాల్లో ఉద్యోగులు అయ్యారు. పూజలపై ఆంక్షలు విధించారు. హిందూసమాజం సాధుసంతుల మార్గదర్శనంతో దేవాలయాల నిర్వహణ సమర్ధంగా చేసుకోగలదు’’ అన్నారు.

హైందవ శంఖారావం ధ్యేయగీతం (థీమ్ సాంగ్) రచయిత, సినీ గేయ రచయిత అనంతశ్రీరామ్ మాట్లాడుతూ ‘‘సినిమాల్లో హైందవ ధర్మం మీద దాడి మూడు కోణాల్లో జరుగుతోంది. కావ్య ఇతిహాసపురాణాల వక్రీకరణ, సినిమా పాత్రలతో హైందవ ధర్మాన్ని కించపరచడం, సినీ పరిశ్రమలోని అన్యమతస్తులు తెర వెనుక చేసే దుర్మార్గాలు.చిత్రపరిశ్రమకు చెందిన వ్యక్తిగా నేను హిందూ సమాజానికి క్షమాపణ చెబుతున్నాను. హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలను ప్రభుత్వం బహిష్కరించడం కంటె ముందు ప్రజలే తిరస్కరించాలి.డబ్బులు రానప్పుడు ఏ నిర్మాతా హిందువులను వెటకరిస్తూ సినిమాలు తీయరు’’ అని చెప్పారు.

విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సహకార్యదర్శి పర్రె కోటేశ్వరరావు మాట్లాడుతూ ‘‘ఈమధ్య కూడా పెడన, బొబ్బిలి, రాయచోటి, మదనపల్లె తదితర ప్రాంతాల్లో హిందువులపై ఎన్నో దాడులు జరిగాయి. ఈ కార్యక్రమానికి వస్తున్న బస్సు మీద కూడా గతరాత్రి దాడి చేసారు. హిందూ సమాజం అన్యమతస్తుల దాడులు, రక్షణ విభాగం నుండి కేసులు, ప్రభుత్వం నుండి ఆంక్షలను ఎదుర్కొంటోంది. హిందువులు ఓర్పు కోల్పోతే ఏమైనా జరగొచ్చు. అన్యమతస్తుల దాడులను పిచ్చివాళ్ళ చేష్టలు అంటే, హిందువులకు దేవతల పూనకాలు వస్తాయి. అప్పుడు హిందువుల నుండి పైమూడు వ్యవస్థలూ తమను తాము కాపాడుకోగలుగుతాయా?’’ అని ప్రశ్నించారు.

ప్రధాన వక్త శ్రీమన్నారాయణ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ మాట్లాడుతూ.. ‘‘మహారాజులు, జమీందార్లు దేవాలయాలు నిర్మించి, లక్షల ఎకరాల భూములిచ్చి, లక్షల విలువైన ఆభరణాలిచ్చి ఆలయాల పోషణకు వ్యవస్థలు ఏర్పాటు చేసారు. ఆలయాలు ఎండోమెంట్స్ విభాగం చేతిలోకి వెళ్ళిపోయాక అవన్నీ కరిగిపోయాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 15లక్షల ఎకరాల భూములకు గాను 4.5లక్షల ఎకరాలు మాత్రం మిగిలాయి. ఆలయాలకు సంబంధించి నిర్ణయాలు ఎవరు చేయాలి? అది అడగడానికే మీరు వచ్చారు. అది ఎవరిని అడగాలో తెలియడానికే విశ్వహిందూ పరిషత్ ఈ సభ ఏర్పాటు చేసింది.

పూజ వ్యవధిపైనా, ప్రసాదం పరిమాణం పైనా ప్రభుత్వాధికారుల ఆంక్షలు దారుణం. వారి వ్యవహార శైలి వల్లే హిందువులు ఇతర మతాల్లోకి మారిపోతున్నారు. మన గుడులు నిర్వహించుకోవడం మనకు చేతకాదా? ఆలయ నిర్వహణ ఆలయ సంప్రదాయాన్ని బట్టి, విధానాన్ని బట్టి, స్థానిక ఆచారాలు కట్టుబాట్లను బట్టి జరగాలి. ఆలయ సంప్రదాయాలను పాటించని అధికారులను పక్కకు తొలగించవలసిందే.దేవాలయాల ఆస్తులను వెనక్కు తిరిగి ఇప్పించాలన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తక్షణం అమలుచేయాలి’’ అన్నారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ దేవాలయాలకు ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి విముక్తి కోసం ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించింది.

LEAVE A RESPONSE