Suryaa.co.in

Features

పట్టభధ్రుల నిర్లిప్తత దేనికి సంకేతం ?

గత నెల రోజుల నుంచి శాసనమండలి ఓటరు నమోదు కార్యక్రమం జరుగుతుంది కేవలం పదిహేను శాతం ప్రజలు ఓటు నమోదు చేసుకున్నారు. ప్రజాస్వామ్యంలో సామాన్యుడి ఆయుధం ఓటు. బ్యాలెట్‌ పోరు వచ్చిన ప్రతిసారీ వినిపించే మాట ఇది. నిజంగా సామాన్యుడు ఈ ఆయుధాన్ని ఎంతవరకు వినియోగించుకుంటున్నాడు? విద్యావంతులు మాత్రమే ఓటర్లుగా ఉండే పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికకు ఓటరు నమోదు మందకొడిగా సాగుతుండడంతో అభ్యర్థులలో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఎనభై శాతం పైగా ప్రజలు ఇంకా ఓటర్లుగా నమోదు చేసుకోలేదంటే ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. అలాగే ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు ఎన్నికల సమయంలోనూ ఆశించిన స్థాయిలో పోలింగ్‌ నమోదు కాకపోవడం ఒకవంతైతే, ముఖ్యంగా విద్యావంతులు పోలింగ్‌ రోజు గడప దాటి బయటకు రాకపోవడమనేది ప్రతిసారి జరుగుతున్నదే. ఈ క్రమంలో పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలోనూ ఇదే తంతు కొనసాగుతుండటంతో అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది. ఇందుకు గతంలో జరిగిన పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల పోలింగ్‌ నిదర్శనం.

గత ఎన్నికల సమయంలో 42 శాతం, 45 శాతం 49 శాతం పట్టభద్రులు తమ ఓటును నమోదు చేయించుకున్నారు. గతంలో హైదరాబాద్‌ జిల్లాలో అతి తక్కువగా 29 శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకోగా, మిగిలిన వారు పోలింగ్‌ కేంద్రాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఓటింగ్ రోజు సెలవు కావడంతో సుదూర ప్రాంతాలకు విహార యాత్రలకు పనికట్టుకొని వెళ్లడం జరుగుతున్న తంతు. అసలు ప్రధాన పార్టీల దిగజారుడు రాజకీయాల వల్లే ఓటర్లు రాజకీయాలంటే అసహ్యించుకునేలా తయారయ్యాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో ఉంటున్నా ఓట్లు గల్లంతు కావడం, ప్రతి ఎన్నికలకూ ఓటరుగా నమోదు చేసుకోవడం ప్రహసనంగా మారుతోంది. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు ఓటు వేయడానికి బద్దకిస్తున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ సందర్భంగా ఇచ్చిన హాలిడేని ఎంజాయ్ చేయడానికి బంధువుల ఊళ్లు వెళుతున్నారు. కొన్ని సందర్భాలలో వరుస సెలవులు రావడం కూడా ఓటింగ్ శాతం పడిపోవడానికి బలమైన కారణంగా కనిపిస్తోంది. ఓటరు నమోదు కార్యక్రమానికి ప్రజలందరూ సంసిద్ధులు కావాలి.

ప్రజాభిప్రాయానికి విలువ లేకపోవడం, అదే సమయంలో డబ్బుకు ప్రాథాన్యత పెరగడం కూడా సగటు ఓటరు ఓటు వేయకపోవడానికి కారణంగా తెలుస్తోంది. తాను ఓటు వేసిన వ్యక్తి విజయం సాధించాక వ్యాపారం కోసమే, ఇతర రాజకీయ ప్రయోజనాల కోసమే తాను వ్యతిరేకించే పార్టీలో చేరితే ఇక తన ఓటుకు విలువెక్కడదని ఓటరు ప్రశ్నించుకుంటున్నాడు. చదువుకున్న వ్యక్తులు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే దేశం మనుగడ ఎలా సాధిస్తుంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అధికార, విపక్షాలపై విశ్వాసం సన్నగిల్లటం కూడా ఓటింగ్ శాతం తగ్గటానికి కారణంగా చెప్పుకోవచ్చు. ఓటు హక్కు, ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది రాయి.

ప్రజలు నిర్మించుకున్న వ్యవస్థ మార్పుకై సమర్థవంతమైన వ్యక్తికి నాయకునిగా నిలబెట్టడానికి తమ అభిప్రాయాన్ని ఓటు హక్కు అనే ఆయుధం ఉపయోగిస్తూ ఎన్నికల్లో గెలిపించి చట్టసభల్లోకి పంపడం జరుగుతుంది. అనగా ఒక వ్యవస్థ నిర్మించడానికైన, కూల్చడానికైన సామాన్య ప్రజానీకంలో ఉన్న ఏకైక ఆయుధం ‘ఓటు హక్కు’, దేశ చరిత్రలో ఇది ఒక కీలక మైలురాయి. ఆంగ్లేయుల కాలంలో పరిమిత ప్రాతిపదికన భారతీయులకు కల్పించిన ఓటుహక్కును ధనిక, పేద మరియు కులము, మతము, లింగం అనే తేడా లేకుండా రాజ్యాంగం ద్వారా సార్వత్రిక వయోజన ఓటు హక్కును రాజ్యాంగం ద్వారా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భారతీయ పౌరులందరకి కల్పించడం జరిగింది.

దేశ స్వతంత్ర వ్యవస్థలో ఆగస్టు 15, 1947లో ఆంగ్లేయుల కబంధ హస్తాల నుండి ఈ దేశ మట్టికి స్వతంత్రం వస్తే, జనవరి 26, 1950లో కులము, మతము, లింగము అనే చారిత్రక అడ్డుగోడలకు చరమగీతం పాడి మనుషులకు స్వతంత్రం సిద్ధించడం జరిగింది. తద్వారా రాజ్యాధినేతను ఎన్నుకొనే గణతంత్ర వ్యవస్థకు పునాది వేసిన గొప్ప పవిత్ర భారత రాజ్యాంగం. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 మరియు ఆర్టికల్ 19(1) ఎ ప్రకారం ఓటు అనేది రాజ్యాంగబద్ధ ప్రాథమిక హక్కుగా భారత రాజ్యాంగంలో పేర్కొని ఒక ఓటు ఒక విలువతో సమానత్వం ప్రస్తావించడం జరిగింది.

భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకుని పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కల్పిస్తామని రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న రాజ్యాంగ అంతర్లీన సూత్రాన్ని పీఠిక ద్వారా ప్రజల ముందు ఉంచడం జరిగింది. భారతదేశంలో కులము, మతము, లింగము అనే చారిత్రక అడ్డుగోడలను కూకటివేళ్లతో కూల్చేసిన పవిత్ర గ్రంథం భారత రాజ్యాంగం. రాజ్యాంగం ద్వారా ‘ఒక ఓటు ఒక విలువ’ రాజకీయ వ్యవస్థలో సాకారం అయినప్పటికీ సామాజిక, ఆర్థిక వ్యవస్థ నేటికి సాకారం కావడం లేదు.

తండ్రి అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఓటు హక్కు ప్రవేశపెట్టి మన తలరాతను మార్చిన దేవుడు. ప్రజల సామాజిక, ఆర్థిక, అసమానతలు లక్ష్యంగా చేసుకొని నేడు రాజకీయ పార్టీల అభ్యర్థులు ఓటర్లకు ఎరవేస్తూ సామాన్య ప్రజానీకం యొక్క ఓటు అనే ఆయుధాన్ని చిదిమేస్తున్నారు. ధన ప్రవాహం ద్వారా గెలిచిన అభ్యర్థులు అవినీతి వైపు వెళుతూ సామాన్య ప్రజానీకం గొంతుకు తాళం వేసి అంధకారంలోకి నెడుతున్నారు.

ప్రపంచంలో ప్రజాస్వామ్య రాజ్యాంగ దేశాలు వేగవంతమైన అభివృద్ధి వైపు ప్రయాణిస్తుంటే, గడిచిన 75 వసంతాలు స్వతంత్ర భారతదేశం నేటికీ ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోక, కులము, మతము, వర్గం అనే తారతమ్యాలతో కొట్టుమిట్టాడడం జరుగుతుంది. అదేవిధంగా ధన బలం, అధికార బలంతో పరిపాలనను హస్తగతం చేసుకొని, చట్టసభల్లో వెళ్లి ప్రగతిశీల చట్టాలకు పాతరేసి భారత రాజ్యాంగంను సంక్షోభంలోకి నెట్టడం జరుగుతుంది.

డాక్టర్ యం.సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజా సైన్స్ వేదిక

LEAVE A RESPONSE