( వి.విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు)
రాష్ట్ర ప్రయోజనాల కన్నా స్వవర్గ స్వార్ధమే మిన్న అని నమ్ముతుంది తెలుగుదేశం అధిపతి చంద్రం మరి రాము చెందిన పచ్చకుల కరపత్రిక కు రాష్ట్రంలోని ఏ ప్రాంతమైనా, ఏ రంగమైనా, ఏ నగరమైనా అవసరమొచ్చే వరకూ కనిపించవు. వాటికి సొంత కులం, టీడీపీ ప్రయోజనాలే ముఖ్యమని మూడు రోజులుగా వాటి అబద్ధపు కథనాలే చెబుతున్నాయి. టీడీపీకి, చంద్రబాబు నాయుడుకు ‘మార్గదర్శి’గా చెలామణి అయ్యే ఫక్తు వ్యాపారికి చిట్ ఫండ్ బిజినెస్ కేంద్రం హైదరాబాద్.
ఆయన పత్రిక ‘ఈనాడు’కు పుట్టినిల్లు విశాఖపట్నం. రాము మీడియా సామ్రాజ్యం విస్తరణకు విశాఖ చేయూతనిచ్చింది. స్థాపించిన మరుసటి ఏడాదే ఈనాడు ప్రధాన కార్యాలయాన్ని రాజధాని హైదరాబాద్ తరలించిన దాని యజమాని రాముకు విశాఖ విలువ తెలుసుగాని ఏనాడూ ఈ నగర ప్రయోజనాల గురించి ఆలోచించలేదు. తాను కొద్ది కాలం చేసిన షిప్ బ్రేకింగ్ వ్యాపారం ఐడియా కూడా విశాఖ నుంచే ఆయనకు వచ్చింది. విజయవాడలో పచ్చళ్ల తయారీ కేంద్రం పెట్టుకుని ఆయన చాలా ఏళ్లుగా నడుపుతున్నారు. అలా అని బెజవాడ అభివృద్ధికి చేసిన తన వంతు సాయం కూడా ఏమీ లేదు. ఇప్పుడు హఠాత్తుగా విశాఖ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై టీడీపీని నడిపించే ఈ రాజకులగురువు కు అయన కులకర తెలుగు పత్రికలకు శ్రద్ధ పెరిగిపోయింది. ప్రజలకు కనిపించని ‘విధ్వంసం’ ఈ పత్రికలకే కనిపిస్తోంది!
2014లో విశాఖను ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా నిర్ణయించే అవకాశం వచ్చినా ఈ పత్రికలూ నాటి సీఎం చంద్రబాబుకు ఆ సలహా ఇవ్వ లేదు. మెట్రోపాలిటన్ జీవనశైలి అప్పటికే ఉన్నది నవ్యాంధ్రలో అతి పెద్ద నగరం విశాఖలో మాత్రమే అనే వాస్తవం వాటికి, వాటి యజమానులకు కనిపించ లేదు. దేశంలో పారిశ్రామికంగా, రాజకీయంగా వందేళ్ల క్రితమే అభివృద్ధి చెందిన మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాజధానులు ముంబై, కోల్కత్తా, చెన్నై రేవు నగరాలనే విషయం కూడా తెలుగుదేశం అధినేతకు గుర్తుచేయడం మరిచాయి ఈ పత్రికలు. ఆర్థిక సంస్కరణల ఫలాలు రేవు పట్టణాలకు ముందు అందుతాయి.
ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధిలో ఈ పోర్టులు కీలకపాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ విభజన నాటికే విశాఖ అన్ని విధాలా మహానగరంలా అవతరించింది. హైదారాబాద్ మాదిరిగానే పెట్టుబడులతో వ్యాపారం చేయడానికి వచ్చినవారందరినీ అక్కున చేర్చుకుంది విశాఖ. ఇవేమీ చంద్రబాబుకు గాని, ఆయనకు ‘మార్గదర్శనం’ చేసే పత్రికాధిపతులకు గాని పట్టలేదు. మూడేళ్ల క్రితం ఏపీకి మూడు రాజధానులుంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందంటూ, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ సర్కారు ప్రతిపాదించింది.
అప్పుడు కూడా విశాఖ నగర ప్రగతి, ప్రయోజనాలు, సాగర తీర అందాల నగరంగా దాని పర్యావరణ రక్షణ వంటి విషయాలు ఈ మీడియా దృష్టికి రాలేదు. అమరావతి రైతుల పాదయాత్ర నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజానీకం వైజాగ్ ను రాజధాని చేయాలనే అభిలాషను బలంగా వ్యక్తంచేయడంతో ఈ కుల పత్రికలకు కొత్త ఐడియా వచ్చింది. అర్జెంటుగా ఉత్తరాంధ్రుల దృష్టి మళ్లించాలి. ‘విశాఖను రాజధానిని చేయాలనుకుంటున్న రాజకీయపక్షమే దానికి నష్టం చేసే చర్యలు తీసుకుంటున్నదనే ప్రచారం చేయాలి.
2024 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఉత్తరాంధ్రలో పాలకపక్షంపై వ్యతిరేకత పెంచాలి,’ అనే ఏకైక అజెండాతో టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారం మొదలెట్టింది. గత రెండు రోజులుగా ఈ విష ప్రచారాన్ని ఎక్కువ చేసింది. ఎన్నడూ లేని ‘విధ్వంసం’ నగరంలో జరిగిపోతున్నట్టు రోజుకో కథనం ప్రచురిస్తున్నారు. నగరంలో నివసించే ప్రజలకు కనిపించని ‘వినాశనాన్ని’ చూపించాలని ఈ విష పత్రికలు తెగ తాపత్రయపడుతున్నాయి.