తిరుప్పావై ఒక అద్భుత వేదాంత గ్రంధం. భగవంతుని సులభంగా అందించగలిగే సాధనా మార్గం. ‘తిరు” అంటే శ్రీ అని, ”పావై” అంటే పాటలు లేక వ్రతం అని అర్ధం. కలియుగంలో మానవకన్యగా జన్మించి గోదాదేవిగా ప్రఖ్యాతమైన ఆండాళ్ భగవంతుడినే తన భర్తగా భావించి, ఆయన్ను చేపట్టడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై వ్రతం. తిరుప్పావై లో పాశురాలు ఉంటాయి. పాశురం అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలు. ఆండాళ్ అపురూప భక్తి పారవశ్యాన్నే శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యద అనే గ్రంథంగా అందించారు.
తిరుప్పావై వ్రతానికి కొన్ని విధివిధానాలు ఉన్నాయి. వేకువజామునే నిద్ర లేచి స్నానం చేయాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా స్వామి కీర్తనలను, తిరుప్పావై పాశురాలను ఆలపించాలి. పేదలకు దానాలు, పండితులకు సన్మానాలు చేయాలి. స్వామికి, ఆండాళ్ కు ఇష్టమైన పుష్ప కైంకర్యం చేయాలి. ప్రతిరోజూ స్వామివారికి పొంగలి నివేదించాలి.
సృష్టిలో భగవంతుడొక్కడే పురుషుడు, మానవులందరూ స్త్రీలు అనే ఉద్దేశంతోనే విష్ణుమూర్తిని శ్రీవారు అని సంబోధిస్తుంటారు. అటువంటి విష్ణుమూర్తిని భర్తగా పొందాలనే తలపుతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన ఈ వ్రతాన్ని నేటికీ మనం ఆచరిస్తున్నాం. ధనుర్మాసం మొదటిరోజున ఈ వ్రతాన్ని ఆరంభించి, భోగిరోజున ఆండాళ్, శ్రీరంగనాథుల కల్యాణం జరిపించడంతో ఈ వ్రతం ముగుస్తుంది.
శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారం భక్తిసాగరంలో మునిగితేలినవారిని ”ఆళ్వారులు” అంటారు. పన్నెండుమంది ఆళ్వారుల్లో విష్ణుచిత్తుడు మొదటివాడు. ఆయన గోదాదేవికి భక్తిసంపదలను వారసత్వంగా ఇచ్చారు. నిజానికి భూదేవియే ఆండాళ్ అని చెప్తారు. జనకమహారాజు భూమిని దున్నే సమయంలో సీతామాత దొరికింది. అలాగే శ్రీరంగనాథునికి పుష్ప కైంకర్యం కోసం విష్ణుచిత్తులవారు తులసితోట సాగుచేస్తుండగా ఆండాళ్ దొరికింది.
భగవంతుని తప్ప ఇతరులను సేవించడానికి వినియోగం కాని తులసివనంలో ఆండాళ్ దొరకడాన్ని గమనిస్తే సీతాదేవి ఆండాళ్ భూదేవి అంశయే అన్న సంగతి అర్ధమౌతుంది. ఆండాళ్ అసలు పేరు కోదై. ”కోదై” అంటే మాలిక. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది.
ఆ గోదాదేవి రచించిన 30 పాశురాలలో ఏయే అంశాలు ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. 30 పాశురాలలోని అంశాలు స్థూలంగా మంచిని ప్రబోధిస్తాయి. మంచి అలవాట్లతో జీవించమని, తోటివారికి సాయపడమని, భగవంతుని తప్పనిసరిగా ఆరాధించమని ఈ ప్రబోధాలు సూచిస్తాయి. ప్రతి పాశురంలోనూ ఇలాంటి సదాచరణే ఉంటుంది.
బృందావన గోపికలు ఒక సారి ఒక ఉపవాస వ్రతం చేసారు. ఆ ఉపవాసాన్ని ముగించటానికి వారికి ఒక మునికి భోజనం పెట్టే కార్యక్రమం చేయవలసి వచ్చింది. యమునా నదికి అవతలి పక్క నివసిస్తూ ఉండే దూర్వాస మహామునికి ఆరగింపు చేయమని శ్రీ కృష్ణుడు వారికి సలహా ఇచ్చాడు. గోపికలు రుచికరమైన భోజనం తయారు చేసి బయలు దేరారు, కానీ యమునా నది ఆ రోజు చాలా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఏ నావికుడూ కూడా వారిని నది దాటించటానికి ఒప్పుకోలేదు.
గోపికలు శ్రీ కృష్ణుడి ని ఎదో ఒక పరిష్కారం కోసం వేడుకున్నారు. ఆయన అన్నాడు, “యమునా నదికి చెప్పండి, ఒకవేళ శ్రీ కృష్ణుడు అఖండ బ్రహ్మచారి అయితే మీకు దారి ఇవ్వాలి అని”. గోపికలు నవ్వటం మొదలు పెట్టారు, ఎందుకంటే వారు శ్రీ కృష్ణుడు తమపై ప్రేమవ్యామోహ మోజుతో ఉండేవాడు అనుకున్నారు, కాబట్టి ఆయన అఖండ బ్రహ్మచారి అన్న పశ్నే తలెత్తదు అని. ఎదేమైనా, వారు యమునా నదిని ఆ విధంగా వేడుకున్నప్పుడు, ఆ నది వారికి దారి ఇచ్చింది, వారు వెళ్ళటానికి ఒక పూల వంతెన కూడా అగుపించింది.
గోపికలు ఆశ్చర్య చకితులయ్యారు. వారు దూర్వాసముని ఆశ్రమానికి వెళ్లారు. వారు తయారు చేసిన రుచికరమైన భోజనమును స్వీకరించమని ఆయనను ప్రార్ధించారు. ఆయన సన్యాసే కాబట్టి ఏదో కొద్దిగా తిన్నాడు, దీనితో గోపికలు నిరాశ చెందారు. దీనితో, వారిని సంతృప్తి పరచదలిచిన దూర్వాసుడు తన యోగ శక్తితో వారు తెచ్చినదంతా భుజించాడు. అంత పదార్ధాన్ని ఆయన తినటం చూసి గోపికలు ఆశ్చర్య పోయారు, కానీ తాము వండిన శ్రమకు ఆయన న్యాయం చేసాడని సంతోషపడ్డారు.
గోపికలు ఇప్పుడు దూర్వాస మహామునిని, యమున దాటటానికి సహాయం చేయమన్నారు. ఆయన అన్నాడు, “యమునా నదికి చెప్పండి, ఒకవేళ దూర్వాసుడు గడ్డి తప్ప ఇంకా ఏమీ తినకుండా ఉంటే, ఆ నది దారి ఇవ్వాలని”. గోపికలు మళ్లీ నవ్వటం మొదలెట్టారు, ఎందుకటే వారు ప్రత్యక్షంగా దూర్వాసుడు ఎన్నో పదార్ధాల తో ఉన్న భోజనం చేయటం చూసారు. అయినా, వారికి ఆశ్చర్యం గొలిపేలా, వారు యమునా నదిని ఆ విధంగా ప్రార్ధించి నప్పుడు, యమునా నది మరలా దారి ఇచ్చింది.
గోపికలు శ్రీ కృష్ణుడిని జరిగిన వృత్తాంతం వెనుక ఉన్న రహస్యం అడిగారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. భగవంతుడు, మునులు బాహ్యంగా ప్రాపంచిక కార్యకలాపములలో నిమగ్నమై ఉన్నట్టు అనిపించినా, అంతర్గతంగా వారెప్పుడూ ఇంద్రియాతీత స్థితిలో ఉంటారు. ఈ విధంగా అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్నా, వారు ఏమీ చేయనట్టే లెక్క గోపికలతో బాహ్యంగా అన్యోన్యంగా ఉన్నా, శ్రీ కృష్ణుడు అంతర్గతంగా అఖండ బ్రహ్మచారి. అలాగే, గోపికలు సమర్పించిన మధురమైన భోజనం చేసినా, అంతర్గతంగా ఆ మహాముని మనసు గడ్డిని మాత్రమే రుచి చూసింది. ఈ రెండు కూడా, కర్మలో అకర్మ ని విశదీకరించే ఉదాహరణలు.
సేకరణ : హైందవ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్