Suryaa.co.in

Telangana

సల్మాన్‌ఖాన్ సరే.. రేవంత్‌కు ఏ శిక్షవేస్తారు?

– జింకలను హతమారుస్తున్న రేవంత్‌కు ఎన్ని శిక్షలు వేయాలి?
– బిఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్

న్యూ ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతూ, నియంతృత్వ పాలనతో రియల్ ఎస్టేట్ మాఫియాను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంకుశ వైఖరిపై బిఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ , పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ ఢిల్లీలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ని కలిసి, రాష్ట్ర ప్రభుత్వ అరాచక పాలన, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విధ్వంసం, పర్యావరణ నాశనంపై ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా దాసోజు శ్రావణ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియంతృత్వ ధోరణితో రాష్ట్రాన్ని పాలిస్తున్నారని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని మసకబారుస్తూ, రియల్ ఎస్టేట్ మాఫియాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్ర పన్నుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు.

యూనివర్సిటీ భూవివాదం.. విద్యా రంగంపై రేవంత్ రెడ్డి దాడి

తెలంగాణలో విద్యా సంస్కరణలను నిరోధిస్తూ, విద్యార్థుల భవిష్యత్తును సర్వనాశనం చేసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చర్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల విలువైన భూమిని అక్రమంగా కబ్జా చేసి, దానిని రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతికి అప్పగించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

ఇది ఒక విద్యా సంస్థపై జరిగిన అన్యాయమే కాకుండా, దేశ భవిష్యత్తుకు తూట్లు పొడిచే ప్రయత్నమని పేర్కొన్నారు. ఈ భూమిని రక్షించేందుకు యూనివర్సిటీ యాజమాన్యం గతంలో సుదీర్ఘ న్యాయ పోరాటం చేసినప్పటికీ, ప్రభుత్వం తాజాగా ఈ భూములను కబ్జా చేయడానికి మరో కుట్ర మొదలుపెట్టిందని వివరించారు.

సుప్రీంకోర్టు తీర్పును తుంగలో తొక్కిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పరిరక్షణకు సంబంధించి, గతంలో సుప్రీంకోర్టు అనుకూల తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ, ఆ భూములను తాకట్టు పెట్టి రూ. 20 వేల కోట్ల రుణాన్ని తీసుకోవడం పూర్తిగా అనైతికమని, ఇది విద్యా వ్యవస్థను ధ్వంసం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలో భాగమని దాసోజు శ్రావణ్ అన్నారు.

పర్యావరణ నాశనం.. నెమళ్ల ఊపిరి తీసేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం

ఈ భూముల విషయంలో రాజకీయ స్వార్థంతో ప్రభుత్వం వ్యవహరిస్తూ, ప్రాంతంలోని పర్యావరణాన్ని సైతం పూర్తిగా నాశనం చేస్తోంది. ఈ ప్రదేశంలో సహజసిద్ధంగా నివసించే భారత జాతీయ పక్షి నెమళ్ళు, ఇతర వన్యప్రాణులు ప్రమాదంలో పడుతున్నాయని తెలిపారు.

ఒక జింకను వేటాడినందుకు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఐదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విధ్వంసంతో వందలాది నెమళ్ళను, జింకలను హతమారుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలాంటి శిక్ష పడాలి? అని ప్రశ్నించారు.

పరిసరాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం, ప్రత్యర్థి శత్రుదేశంపై దాడి చేసినట్లుగా యూనివర్సిటీ భూములపై దాడి చేస్తోందని ఆరోపించారు. నెమళ్ళ కిలకిలరావాలు ఇప్పుడు ప్రభుత్వం వినిపించుకోవాలని, ఈ విధ్వంసాన్ని తక్షణమే అరికట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా మారిన సీఎం

రాష్ట్రానికి నాయకత్వం వహించాలని ఎన్నికైన ముఖ్యమంత్రి, ఇప్పుడు రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా మారి వ్యవహరిస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. విద్యార్థులకు, పేదలకు సంబంధించిన భూములను అక్రమంగా హస్తగతం చేయడం, వాటిని వ్యాపార లావాదేవీలకు మార్చడం తీవ్రంగా ఖండించదగిన చర్య అని పేర్కొన్నారు.

ఇలాంటి నిబంధనల ఉల్లంఘనలను కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పట్టించుకోవాలని, రాష్ట్రంలో విద్యా వ్యవస్థపై జరుగుతున్న దాడిని అరికట్టాలని కోరారు.

“రేవంత్ రెడ్డి రాజ్యంలో నోరులేని మృగాలు, పేదలు బ్రతకలేరా?” అని ప్రశ్నిస్తూ, బిఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దీక్షగా పోరాటం చేస్తుందని దాసోజు శ్రావణ్ స్పష్టం చేశారు.

కేంద్ర విద్యా మంత్రితో భేటీ.. భూముల పరిరక్షణకు హామీ

ఈ సమస్యకు పరిష్కారం కోసం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ని కలిసినట్లు దాసోజు శ్రావణ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా యూనివర్సిటీ భూములను కబ్జా చేయకుండా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో పరిశీలిస్తామని, విద్యా సంస్థలకు సంబంధించిన భూములను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు.

LEAVE A RESPONSE