Suryaa.co.in

Andhra Pradesh Telangana

దివ్యాంగులకు కావలసింది చేయూత, సానుభూతి కాదు

• పెరుగుతున్న సాంకేతికత ద్వారా దివ్యాంగులకు అండగా నిలవాలి
• జాతీయ సంస్థలు, విశ్వవిద్యాలయాలకు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచన
• వారిపట్ల సామాజిక దృక్పథాన్ని మార్చాల్సిన తరుణమిది
• బహిరంగ స్థలాల్లో దివ్యాంగులకు అవసరమైన వాతావరణాన్ని ఏర్పాటుచేయాలి
• నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజెబిలిటీస్ (ఎన్ఐఈపీఐడీ)ని సందర్శించిన ఉపరాష్ట్రపతి

హైదరాబాద్ : దివ్యాంగుల పట్ల ఉన్న సామాజిక దృక్పథాన్ని మార్చాల్సిన తరుణమిదేనని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. వారిపట్ల సానుభూతిని చూపించాల్సిన అవసరం లేదని, చేయూతనందించడం ద్వారా వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ముందుకు సాగాలన్నారు. వారిపట్ల ఉన్న వివక్షతను నిర్మూలించే దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు సమాజం కూడా తనవంతు పాత్ర పోషించాలని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. దివ్యాంగుల్లో సహజంగానే వివిధ అంశాలకు సంబంధించిన తెలివితేటలుంటాయని వాటిని గుర్తించి పదునుపెట్టాలన్నారు.

హైదరాబాద్ బోయినపల్లిలోని ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజెబిలిటీస్’ (ఎన్ఐఈపీఐడీ)ని ఆదివారం ఉపరాష్ట్రపతి సందర్శించారు. ఈ సందర్భంగా దివ్యాంగులు, వారి కుటుంబసభ్యుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిన సమాజాభివృద్ధిలో వారిని భాగస్వాములు చేసేందుకు ఎన్ఐఈపీఐడీ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు.

దివ్యాంగుల అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటుచేయడం చాలా అవసరం అన్న ఉపరాష్ట్రపతి, ఈ దిశగా ‘యాక్సెసెబుల్ ఇండియా’ ఉద్యమం ద్వారా సానుకూలమైన మార్పులు కనబడుతున్నాయన్నారు. బహిరంగ ప్రదేశాల్లో, రవాణా, సమాచార ప్రసార వ్యవస్థలు మొదలైన ఏర్పాట్లను మరింతగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. దివ్యాంగ విద్యార్థులు చదువుకునే పాఠశాల్లో ఉపాధ్యాయులు, బోధనేత సిబ్బంది కూడా ఇలాంటి విద్యార్థుల సమస్యలను గుర్తెరిగి వారికి చేయూతనందించాలన్నారు.

నానాటికీ పెరుగుతున్న సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ.. దివ్యాంగులకు అవసరమైన వ్యవస్థలను ఏర్పాటుచేయడంలో జాతీయ సంస్థలు, విశ్వవిద్యాలయాలు ప్రత్యేకమైన చొరవ తీసుకోవాలన్నారు. స్మార్ట్ టెక్నాలజీ ని దివ్యాంగులకు అందించేందుకు విశిష్టమైన కృషిచేయాలన్నారు.

శిశువుల్లో బాల్యంలోనే ఉండే సమస్యలను వెంటనే గుర్తించి వాటికి సరైన పరిష్కారాలు చూపించాలని ఉపరాష్ట్రపతి అన్నారు. ఈ దిశగా ఎన్ఐఈపీఐడీ వంటి సంస్థలు, సీసీఎంబీ వంటి సంస్థలతో అనుసంధానమై పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా చిన్నారుల్లో వికలాంగ సమస్యలు తీవ్రతరం కాకుండా చూసేందుకు వీలవుతుందన్నారు. ఇందుకోసం తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అవసరాన్ని ఉపరాష్ట్రపతి నొక్కిచెప్పారు.

ఈ కార్యక్రమంలో డి.ఈ.పి.డబ్ల్యూ.డి. సంయుక్త కార్యదర్శి రాజీవ్ శర్మ, ఎన్.ఐ.ఈ.పి.ఐ.డి. సంచాలకులు మేజర్ బి.వి.రామ్ కుమార్ సహా వివిధ విభాగాలకు చెందిన అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

 

LEAVE A RESPONSE