Suryaa.co.in

Andhra Pradesh

ఈ అబద్దాల బడ్జెట్ తో మీరేం చేస్తారు?

* అబద్దాలు, అంకెల గారడీలు బాబుకి అలవాటే
* పోలవరం, అమరావతి కష్టమే
* ఉద్యోగులకు, నిరుద్యోగులకు భరోసా ఏదీ?
* బడ్జెట్ పై బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఘాటు విమర్శ

అమరావతి: “ఈ బడ్జెట్ తో మీరేం చేస్తారు? అమరావతి కడతారా? పోలవరం పూర్తి చేస్తారా? ఉద్యోగులకు బకాయిలు చెల్లిస్తారా? నిరుద్యోగ భృతి ఇస్తారా? విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లిస్తారా? ఆడబిడ్డ నిధి, యువగళం నిధి ఇస్తామని హామీ ఇచ్చి, ఈ బడ్జెట్ లో కూడా ఎగ్గొట్టారు. అసలు రంగాలకు వదిలేసి.. కొసరుకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు.. ఈ బడ్జెట్ రాష్ట్రానికి, ప్రజలకు నిరూపయోగం” అంటూ బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ద్వజమెత్తారు.. ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.

పోలవరం ప్రాజెక్టుకు 6705 కోట్లు కేటాయించారు.. ఓ వైపు ప్రాజెక్టుని 2027 నాటికి పూర్తి చేస్తాం అంటున్నారు.. కేంద్రం నుండి పూర్తిగా నిధులు రావడం లేదు, రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు పూర్తిగా లేవు.. అక్కడ చూస్తే పునరావాస, ఇళ్ల నిర్మాణాలు, ప్యాకేజీ, భూ సేకరణ ప్రక్రియ ఏది పూర్తి కాలేదు.. ఈ ఏడాది కనీసం 20 వేల కోట్లు ఖర్చు చేయాల్సిన ప్రాజెక్టుకి 6705 కోట్లుతో ఏం చేస్తారని ప్రశ్నించారు..
కలల రాజధాని అమరావతి.. రాష్ట్ర భవిష్యత్తు మొత్తం రాజధానిపై ఆధారపడి ఉంది.. అమరావతి నిర్మాణం మూడేళ్లలో అన్నారు, కానీ ఈ బడ్జెట్ లో ప్రత్యేక నిధులు ఇవ్వలేదు.. ఓ వైపు 42 వేల కోట్లతో పనులు అంటున్నారు, టెండర్లు అంటూ హడావిడి చేస్తున్నారు.. ఈ నిధుల సర్దుబాటు ఎలా చేస్తారు.?

ఉద్యోగులకు IR/ DA లు బకాయిలు ఉన్నాయి. వాటిపై ఒక స్పష్టత లేదు. ఉద్యోగులను నిలువునా మోసం చేసిన ప్రభుత్వం ఇది. ఇప్పటికే ఉద్యోగ వర్గాల్లో అసమ్మతి, అసంతృప్తి పెరిగింది. ఈ బడ్జెట్ తో ఉద్యోగుల విషయంలో బాబు వైఖరి “ఏరు దాటాక తెప్ప తగలేయ్యడం” అనేది స్పష్టమైందనీ రామచంద్ర యాదవ్ దుయ్యబట్టారు.

నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారు? ఆడబిడ్డ నిధి విషయంలో క్లారిటీ లేదు. సూపర్ సిక్స్ లో ఒక్క హామీ మాత్రమే అరకొరగా అమలు చేశారు. మరో రెండు హామీలకు ఈ బడ్జెట్ లో నిధులిచ్చారు. కానీ మిగిలిన హామీల మాటేమిటి? రాష్ట్రంలోని చాలా వర్గాలను ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది.

పోలవరం సహా వెలిగొండ, హంద్రీనీవా, గాలేరు నగరి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదు. అంకెల గారడీతో రూ. 3.22 లక్షల కోట్లు అంటూ గొప్పలు చేస్తున్నారే తప్ప వాస్తవానికి ఇది మోసపూరిత బడ్జెట్ అంటూ రామచంద్ర యాదవ్ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు.

LEAVE A RESPONSE